హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ విక్రయాల గుట్టురట్టు
కల్తీ...కల్తీ ఆహార పదార్థాల విక్రయాలకు హైదరాబాద్ నగరం కేంద్రంగా మారింది. దేశంలోనే కల్తీ ఆహార పదార్థాల విక్రయాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉందని తేలింది.
హైదరాబాద్ నగరాన్ని కల్తీ ఆహార పదార్థాలు వీడటం లేదు. హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్న కల్తీ ఆహార పదార్థాల విక్రయాలకు తెరపడటం లేదు.
- పలు హోటళ్లలో నాణ్యత లేని కల్తీ ఆహార పదార్థాలను కొందరు స్వార్థపరులు ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటున్నా కల్తీ చేసే వ్యాపారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కల్తీ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు.
- కొబ్బరినూనె, పాలు, పన్నీరు,తేయాకు పొడి, లిప్ స్టిక్ బామ్, సబ్బులు కల్తీ చేసి విక్రయిస్తున్నారు. ప్రముఖ బాండ్ల లేబుళ్లతో కల్తీ వస్తువులను విక్రయిస్తున్నారు.
మరో కల్తీ వెల్లుల్లి పేస్ట్ గుట్టురట్టు
హైదరాబాద్‌లోని డిఫెన్స్ కాలనీ, లంగర్ హౌస్‌లో ఉన్న ఒక గోదాంపై టాస్క్ ఫోర్స్ కమీషనర్ , సౌత్ వెస్ట్ జోన్ టీమ్, హైదరాబాద్,లంగర్ హౌస్ పోలీసుల ఆకస్మిక దాడి చేశారు. లంగర్ హౌస్ పీఎస్ పరిధిలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఇమ్రాన్ సలీమ్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నారు.నాణ్యత లేని అల్లం, వెల్లుల్లితో సిట్రిక్ యాసిడ్ కలిపి హీనా బ్రాండ్ అల్లం, వెల్లుల్లిని కిరాణా స్టోర్లు, జనరల్ స్టోర్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో విక్రయిస్తున్నాడని దర్యాప్తులో తేలింది. నిందితుడు ఇమ్రాన్ సలీంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఇతనిపై వికారాబాద్, తాండూర్, రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లలోనూ కేసులున్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Next Story