
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగేదెన్నడు?
73, 74 రాజ్యాంగం సవరణ లు జరిగి దాదాపు 34 సంవత్సరాలు అయినా అమలు చేసేందుకు అంత యాతన ఎందుకు?
-తాడా ప్రభాకర రెడ్డి
పంచాయతీ ఎన్నికలని ప్రతిసారి ఏదో కారణం చేత దాటావేస్తు ప్రజలని మభ్య పెట్టడం ప్రభుత్వాలకు ఆనవాయితీ. కానీ ప్రజాస్వామ్యం హాస్యాస్పదం అవుతున్నదన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలి. దీనివల్ల ఇప్పటికే ఎంతో నష్టం వాటిల్లినదని తెలుసుకోవాలి.
గ్రామాల్లో అభివృద్ధి అట్టకేక్కింది. ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. స్పెషల్ ఆఫీసర్లు స్పెషల్ గానే ప్రవరిస్తున్నారు. వారికి చిత్త శుద్ధి కరువయ్యింది. ఒకవైపు ఏసీబీ లంచగొండి ఆఫీసర్స్ ని పట్టుకుని లోపల వేస్తుంటే ఇదేమి పట్టనట్లుగా ఇతర అధికారులు మరీముఖ్యంగా రెవిన్యూ డిపార్ట్మెంట్ అధికారులు తమ రొటీన్ గా చేతివాటం ప్రదర్శిస్తునే ఉన్నారు. ఈరోజు మండల రెవిన్యూ ఆఫీస్ లో డబ్బులు ఇవ్వనిదే ఏ ఒక్క పని జరగడం లేదు. ఇది ప్రజలు ఆవేదన.
ఇదే పరిస్థితి లో ప్రజా ప్రతినిధులు ఉండి ఉంటే పరిస్థితి కొంతవరకైనా వేరేగా ఉండేది అని బాధ పడుతున్నారు. ఎంతో కొంత మేలు జరిగేది అని వాపోతున్నారు. ఈ పరిస్థితిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు తీరు అగమ్య గోచరంగా మారింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కైనా గ్రామపంచాయతీ ఎన్నికలు జరిపి ప్రజా ప్రతినిధులుని కార్యాలయాల్లో కూర్చోబెట్టాలి. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దోషి గా నిలబడాల్సి వస్తుంది. ఉదాహరణ కి ఒక రేషన్ కార్డు లేదా ఇళ్ల పంపిణీ లేదా ఇంకేది జరగాలన్నా ఆఫీసర్స్ ఆశగా లంచం కోసం ఎదురుచూస్తున్నారు.
73, 74 రాజ్యాంగం సవరణ లు జరిగి దాదాపు 34 సంవత్సరాలు అయినా వాటిని తు.చ తప్పకుండ అమలు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్లోకి రావడం లేదు. ఎలాగైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు క్రమం తప్పకుండ జరుపుకుంటారో అలాగే స్థానిక ప్రభుత్వం ఎన్నికలు ఎందుకు జరపడం లేదని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిత్త శుద్ధి లేకనా లేక రాబోయే ఎన్నికలలో తమ పార్టీ గెలవడం సాధ్యం కాదని భయమా? ఏది ఏమైనా అధికారంలో ఉన్నవారు కర్తవ్యం మరచి పోయారు. కాబట్టి తక్షణమే ఎన్నికలు జరిపితే భారీ నష్టాన్ని రాకుండా ఆపిన వారవ్వుతారు. లేనిచో ఈ ఎన్నికలు రెండేళ్లు కాంగ్రెస్ పాలనకి రిఫరెండం అవుతుంది.
ఇలాగే ఇంకొన్ని రోజులు జాప్యం చేస్తే ప్రజలు తమ ఆగ్రహం చూపించడానికి సిద్ధం గా ఉన్నారు. ఎందుకంటే ఒక వైపు యూరియా దొరకడం లేదు రైతులు లైన్ లో నిలబడి ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఖండించినా ఇది కళ్ల ముందున్న వాస్తవం.
రాజధాని లో కూర్చొని ఫ్యూచర్ సిటీ లేదా మూసి ప్రక్షాళన మాట్లాడటం కాదు. అది సులభం. పెట్టుబడి దారులతో సమావేశం కాదు. అదీ సులభమే. కాని ప్రజల కష్టాలు తెలుసు కోవడమనేడి చాలా కష్టం. సాధారణంగా ప్రభుత్వాలు ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే నమ్మవు. అందువల్ల గౌరవ మంత్రివర్యులు, ఎమ్మెల్యే లు జిల్లాల్లో ప్రజలు అవసరాలు ఏమిటో తెలుసు కోండి. అదే పరిపాలన అంటే. ప్రజల పాలన అంటే..
దాని వలన ప్రజలు కేంద్రంగా (సిటిజెన్ సెంట్రిక్) సాగే పరిపాలన అందించిన వారు అవుతారు. పౌరుల ఆధారిత పరిపాలన లక్ష్యం గా పంచాయతీలని ఏర్పాటు చేసి, నిధులు విధులు ఇచ్చి బాధ్యతాయుతమైన యంత్రాంగం ద్వారా పనులు జరిగేట్లు చూడాలి. ఎన్నికలు జరగాలి అని హైకోర్ట్ ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. పిదప నిపుణులతో రాష్ట్ర ఆర్థిక కమిషన్ వేయండి. దీని వలన క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు జరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రజలకు మీపై మంచి స్పందన వస్తుంది. ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ ఫుకుయామా (Francis Fukuyama) స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం వారు చెప్పినట్లు ప్రజాస్వామ్య ప్రభుత్వం నడవాలి అంటే ప్రజల అభిప్రాయాలూ, సూచనలు పొందాలి. అంతే కానీ పేట్రొనైజింగ్ ప్రవర్తన పనికి రాదు. నేను ఇచ్చేవాడిని మీరు తీసుకునేవారు అన్నట్లుగా ఉండ కూడదు.
కర్తవ్యం ఏమిటంటే..
ముఖ్యంగా గ్రామ సభలని, మహిళా సభలని నిర్వహించడం వారి సలహాలు సూచనలు తీసుకొని గ్రామం సమస్యలు పరిష్కారం చేయడం, అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేయాలి. మహిళా గ్రూప్ లని ఉత్తేజపరిచి పూర్వ వైభవం తీసుకొని రండి. తెలంగాణ స్వయం సహాయక బృందాల (SHG) మోడల్ ని ప్రపంచానికి తెలియ చేయండి.
ప్రభుత్వం పథకాల, కార్యక్రమాల బెనిఫిట్స్ అర్హులైన లబ్ధిదారులకే అందిచడం జరగాలి. దీనికోసం సోషల్ రిజిస్ట్రీ ఏర్పాటు చేయండి. బహుముఖ పేదరికం గురించి సర్వే చేయండి. పిల్లల భవిష్యత్తుకి సామాజిక భద్రత పథకం డిజైన్ చేసి అమలు చేయండి. ఎందుకంటే పేదరికంలో కొట్టు మిట్టాడేవారిలో పిల్లలే సగం.
ఆర్థిక శాస్త్ర వేతల సలహాలు తీసుకోండి. ప్రొఫెసర్ అనగానే మేధావి అనుకో కూడదు.సామజిక భద్రత కార్యక్రమం అమలుకు ఒక డేటా బేస్ ఏర్పాటు చేయండి. ప్రభుత్వ ఖర్చ (Public expenditure) రివ్యూ జరగాలి ప్రతి సంవత్సరం. దీని వలన బడ్జెట్ కేటాయింపు లో కొంత వెసలుబాటు లభిస్తుంది. ఆదాయవనరులు సమీకరించచుకోవడానికి ఫిస్కల్ (Fiscal) స్పేస్ క్రియేషన్ చేపట్టండి. తద్వారా అప్పులు వడ్డీలు తగ్గి ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం లభిస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి మార్గం లభిస్తుంది.
(రచయిత ఆర్థిక శాస్త్ర వేత్త,గతంలో యునైటెడ్ నేషన్స్ (UN) లో వివిధ హోదాలో పనిచేసారు. యునిసెఫ్ (బ్యాంకాక్)సామాజిక విధాన రూపకర్త)