భారత గడ్డపై  70 ఏళ్ల తర్వాత:కోలాహలంగా చీతాల అడుగులు!
x
అభయారణ్యంలో సేదతీరుతున్న చీతాలు(ఫోటో : నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సౌజన్యంతో)

భారత గడ్డపై 70 ఏళ్ల తర్వాత:కోలాహలంగా చీతాల అడుగులు!

దేశంలో పర్యావరణ పర్యాటకానికి కొత్త ఆకర్షణ


భారతదేశ అడవుల్లో 70 ఏళ్ల తర్వాత మళ్లీ చీతాల సంచారం మొదలైంది. విదేశాల నుంచి వచ్చిన చీతాలు ఇప్పుడు కునో,గాంధీ సాగర్ వన్యప్రాణి అభయారణ్యాల్లో పునర్జన్మ ఇచ్చాయి. భారతదేశంలో చీతాల సంఖ్య పెరుగుతోంది. దేశంలో అంతరించి పోయిన చీతాలను తిరిగి పునరుజ్జీవింప చేయడంలో చీతా ప్రాజెక్టు విజయం సాధించింది. దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి చీతాలను ప్రత్యేకంగా భారతదేశానికి విమానాల్లో తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్, గాంధీ సాగర్ అభయారణ్యంలో వదిలారు. దీంతో అభయారణ్యాల్లో చీతాల సంఖ్య వృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ చీతాల డే సందర్భంగా అటవీశాఖ, వన్యప్రాణి పరిరక్షణ విభాగాల అధికారులు, చీతాల ప్రేమికులు చీతాల సంఖ్య వృద్ధి చెందుతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. భారత గడ్డపై 21 చీతాలు జన్మించాయి.




వన్యప్రాణులు అంతరించి పోకుండా కాపాడాలి

డిసెంబరు 4వతేదీ అంతర్జాతీయ చీతా డే ను భారత జాతీయ పులుల సంరక్షణ సంస్థ అధికారులు కన్నుల పండువగా గురువారం జరిపారు. అంతరించి పోయిన చీతాలను విదేశాల నుంచి తీసుకువచ్చి వాటి సంతతిని పునరుజ్జీవింప చేయడంలో చీతా ప్రాజెక్టు విజయవంతం అయింది. భారతదేశ గడ్డపై అత్యంత చారిత్రాత్మక వన్యప్రాణుల పునరాగమనాల్లో ఒకటైన చీతాల దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటున్నామని తెలంగాణ అటవీ శాఖ వన్యప్రాణి విభాగం ఓఎస్ డీ ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. భారతదేశంలో చీతాలు అంతరించి పోయినందువవల్ల నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి తీసుకువచ్చి బ్రీడింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గురువారం కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో ఫౌండేషన్ డే సందర్భంగా దేశంలోని వన్యప్రాణులు అంతరించి పోకుండా వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని శంకరన్ చెప్పారు. విద్యార్థులకు చీతాల ప్రాజెక్టు గురించి, వీటి బ్రీడింగ్ గురించి శంకరన్ వివరించారు.



భారత గడ్డపై 21 చీతాల జననం

భారతదేశంలో ప్రస్థుతం రెండు అభయారణ్యాల్లో 32 చిరుతలు వృద్ధి చెందుతున్నాయి. వాటిలో 21 పిల్లలు భారత గడ్డపై జన్మించాయి. భారతదేశంలో చీతాలు అంతరించిపోవడంతో 70 ఏళ్ల తర్వాత నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి తిరిగి తీసుకువచ్చారు. ఆడ చీతాలు విజయవంతంగా పిల్లలను పెంచుతున్నాయి. వృద్ధి చెందుతున్న చీతాలు భారతదేశ అటవీ ప్రదేశాల్లో అడుగిడనున్నాయి. చీతాలు అడవుల్లో స్వేచ్ఛగా పరిగెత్తుతూ, జింకలను వేటాడుతున్నాయి. గడ్డి భూములు, అడవులు పర్యావరణ వ్యవస్థలకు అనుగుణంగా మారుతున్నాయి.

బోట్స్వానా దేశం మరో 8 చీతాలు
బోట్స్వానా దేశం అధికారికంగా భారతదేశానికి 8 చీతాలను అప్పగించింది. ప్రస్తుతం 8 చీతాలను విమానాల్లో తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విమాన ప్రయాణానికి ముందు చీతాలను నిర్బంధంలో ఉంచారు. దేశంలోని అటవీ ప్రకృతి దృశ్యాలలో చిరుతల జనాభాను పునరుద్ధరించే ప్రణాళికలో భాగంగా ప్రాజెక్ట్ చీతాను చేపట్టింది. వన్యప్రాణుల సంరక్షణకు భారతదేశం చర్యలు చేపట్టింది. దేశంలో అంతరించి పోయిన చీతాలను పునరుద్ధరించేందుకు వీలుగా విదేశాల నుంచి చీతాలను తీసుకువచ్చి పర్యావరణ పర్యాటక రంగం అభివృద్ధి కోసం చీతా ప్రాజెక్టును చేపట్టారు. భారతదేశ గడ్డి భూముల వారసత్వాన్ని పునరుద్ధరించడం కోసం ప్రాజెక్ట్ చీతా ఒక ప్రధాన అడుగుగా నిలిచింది.



జీవవైవిధ్యాన్ని బలోపేతం చేయడానికే చీతా ప్రాజెక్టు

అంతర్జాతీయ చీతా దినోత్సవం సందర్భంగా అత్యంత అద్భుతమైన జీవుల్లో ఒకటైన చీతాలను రక్షించడానికి అంకితభావంతో పనిచేస్తున్న వన్యప్రాణుల ప్రేమికులు, పరిరక్షకులందరికీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం ఈ అద్భుతమైన చీతాలను రక్షించడం,పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం అనే లక్ష్యంతో మన ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కోల్పోయిన పర్యావరణ వారసత్వాన్ని పునరుద్ధరించడానికి, జీవవైవిధ్యాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ ప్రాజెక్టు చేపట్టామని ప్రధాని మోదీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.



చీతాలకు నిలయంగా...

భారతదేశం చీతాలకు నిలయంగా ఉండటం వన్యప్రాణి ప్రేమికులు గర్వపడుతున్నారు. చీతాలు గణనీయమైన సంఖ్యలో భారత గడ్డపై జన్మించాయి. చీతాలు కునో నేషనల్ పార్క్,గాంధీ సాగర్ అభయారణ్యంలో వృద్ధి చెందుతున్నాయి. ‘‘చీతాల పర్యాటకం కూడా ప్రజాదరణ పొందడం ఉత్సాహకరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల ఔత్సాహికులు భారతదేశాన్ని సందర్శించి, చీతాలను చూసేందుకు చీతా ప్రాజెక్టును నేను ప్రోత్సహిస్తున్నాను’’అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

మన దేశ గడ్డపై చీతాల సంచారంతో వన్యప్రాణి ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు.విదేశాల నుంచి వచ్చిన చీతాలు కూనలకు జన్మనివ్వడమే కాకుండా ఎండ, వృక్షం, వనరుల మధ్య పచ్చని అడవుల్లో స్వేచ్ఛగా పరుగెత్తుతున్నాయి.


Read More
Next Story