
బ్రిటీష్ మ్యూజియం కు ధీటుగా అఫ్జల్‌గంజ్ లైబ్రరీ
దాదాపు 135 సంవత్సరాల చరిత్ర. సుమారు యాభై వేల మంది మెంబర్స్ వున్నారు.
అఫ్జల్‌గంజ్‌లోని సెంట్రల్ లైబ్రరీ రాష్ట్రంలోనే అతి పెద్దది. స్వాతంత్ర్యానికి ముందే ఈ లైబ్రరీ ఏర్పాటు అయింది. ఇందులో ఏళ్ల నాటి సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంది. తాళపత్ర గ్రంథాలతోపాటు, ఐదు లక్షలకు పైగా పుస్తకాలు, పత్రికలు ఉన్నాయి. చారిత్రక నేపథ్యంతోపాటు వారసత్వ కట్టడంగా కూడా గుర్తింపు ఉంది. ఒకప్పుడు “ఖుతుబ్ ఖానా అసఫియా” గా పిలిచే ఈ సెంట్రల్ లైబ్రరీని నవాబ్ “ఇమాద్-ఉల్-ముల్క్” 1891లో నిర్మించారు. దాదాపు 135 సంవత్సరాల చరిత్ర. సుమారు యాభై వేల మంది మెంబర్స్ వున్నారు. కానీ రెన్యువల్ చాలా తక్కువ మందే చేయించుకుంటారు. లైబ్రరీ టైమింగ్స్ మామూలు రోజుల్లో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ సెక్షన్ మాత్రం రాత్రి పన్నెండు వరకూ ఉంటుంది. గురువారం శలవు. ఇక్కడ పుస్తకాలని చాలామంది రీసెర్చుకోసం వాడుకున్నారు. ఈ లైబ్రరీని సినిమాలలో హైకోర్టులా చాలా సార్లు చూపించారు.
ఈ "లైబ్రరీలో నిజాం కాలం నాటి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఎవరైనా ఏదైనా కోర్టు కేసులుంటే వాటి గెజిట్స్ కావాలంటే ఇక్కడికి రావాల్సిందే. మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ కూడా ఈ లైబ్రరీ మెంబరు ఒకప్పుడు. ఇప్పటికీ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ లు, ప్రముఖ అడ్వకేట్‌లు వస్తూ ఉంటారు. ఉర్దూ, పార్సీ పుస్తకాలు చదువుకోటానికి వచ్చేవాళ్ల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింద"ని లైబ్రేరియన్ హనుమాన్ కేసరి చెప్పారు.
"వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఈ గ్రంథాలయం మంచి రీడింగ్ రూంలా ఉపయోగపడుతోంద" ని డిఫెన్స్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్న శివ రామ రాజు చెప్పారు.
"పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత నిత్యం పెద్దసంఖ్యలో ఇక్కడకి వచ్చి ప్రిపేర్ అవుతుంటారు. గ్రంథాలయంలో పుస్తకాలు, గ్రంథాలయ సంస్థ ఉచితంగా కల్పించే సౌకర్యాల గురించి తెలియక చాలామంది ఉద్యోగార్థులు అద్దె చెల్లిస్తూ స్టడీ హాళ్లలో చదువుకుంటున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేవారికి ఇదో మంచి అవకాశం" అంటారు కర్నాటకలకు చెందిన విద్యార్థి హరి.
"యువతీయువకులు ఉద్యోగ నోటిఫికేషన్లు, ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి సెంట్రల్ లైబ్రరీలో కంప్యూటర్లున్నాయి. పోటీ పరీక్షల కేంద్రాలు నిర్వహించే ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు ఉచిత హైస్పీడ్ వైఫై కూడా ఉంటుంది. ఉద్యోగార్థులు వాడుకుని క్లాసులు వినొచ్చు. రూ.150తో సభ్యత్వం తీసుకుంటే పుస్తకాలు అక్కడే ఉండి చదువుకోవడమే కాకుండా ఇంటికి తీసుకెళ్లి చదివే వెసులుబాటు ఉంటుంద" ని డి.ఎస్.సి.కి ప్రిపేర్ అవుతున్న నరేష్ చెబుతున్నారు.
హెచ్‌ఎండీఏ ఇంజినీర్లు తెలిపిన వివరాల ప్రకారం.. "సున్నం, స్కాఫోల్డింగ్, పైకప్పు ఉపరితలంపై చిప్పింగ్ పనులు జరుగుతున్నాయి. అసలు నిర్మాణాన్ని పరిరక్షిస్తూ సిమెంట్‌కు బదులు బెల్లం, ఇసుక, ఇతర ముడిపదార్థాల మిశ్రమంతో సున్నం వేసి పనులు చేపడుతున్నారు. భవనంలో పాచెస్, పగుళ్ల సమస్యను పరిష్కరించడమే కాకుండా, విద్యుత్తు పనులతో పాటు పారిశుద్ధ్య పైపులు, మ్యాన్‌హోల్స్‌ను కూడా మరమ్మతులు చేస్తున్నారు" .
లైబ్రేరియన్ హనుమాన్ కేసరి తెలిపిన వివరాల ప్రకారం, "విహంగ వీక్షణం తెరిచిన పుస్తకంలా కనిపించే విధంగా ఈ భవనాన్ని డిజైన్ చేసి నిర్మించారు. 1891లో మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి స్థాపించిన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఈ పండితుని వ్యక్తిగత గ్రంథాలయంగా ఉంది. ఇది అసఫ్ జా రాజవంశం పేరు మీదుగా అసఫియా స్టేట్ లైబ్రరీగా పిలువబడింది. దాని అద్భుతమైన ముఖభాగం, భారీ హాళ్లు మరియు ఎత్తైన పైకప్పులతో, భవనం యొక్క నిర్మాణం పాత రాజు ప్యాలెస్‌ను పోలి ఉంటుంది."
ఈ గ్రంథాలయ భవనం 72,247 చదరపు గజాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. అజీజ్ ఆలీ అనే ఆర్కిటెక్ట్ ద్వారా భవన నిర్మాణం జరిగింది. శంకుస్థాపన 1932లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేయగా, 1936లో గ్రంథాలయాన్ని ఈ భవనంలోకి తరలించారు. పెద్ద గదులతో, ఎత్తైన పైకప్పుతో రాజప్రాసాదాన్ని తలపించేలా ఉంటుందీ భవనం. 1941లో ఈ గ్రంథాలయం గోల్దేన్ జూబిలీ (50 ఏళ్ళ ఉత్సవం) జరుపుకుంది. 1955లో స్టేట్ సెంట్రల్ లైబ్రెరీగా పేరు మార్పు పొంది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిందని" తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ ది ఫెడరల్‌తో చెప్పారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం హబ్‌గా ఈ లైబ్రరీని తీర్చిదిద్దుతున్నట్లు ఛైర్మన్ రియాజ్ తెలిపారు.