RS Praveen kumar
x
image source : twitter

RS Praveen Kumar | ఆర్ఎస్పీ కి ఆకునూరి మురళి సూటి ప్రశ్న

అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ కుటుంబ పాలన అంతమవ్వాలంటూ ధ్వజమెత్తిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఇప్పుడు వారితోనే చేతులు కలిపారు.


రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది మరోసారి తెలంగాణలో రుజువైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ కేసీఆర్ కుటుంబ పాలన అంతమవ్వాలంటూ ధ్వజమెత్తిన తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఇప్పుడు వారితోనే చేతులు కలిపారు. బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సాక్ష్యాలు చూపించి మరి చెండాడిన ఆయన.. పార్లమెంటు ఎన్నికల ముందు కేసీఆర్ తో జతకట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు, మేధావులు, సామాజికవేత్తలు పెదవి విరుస్తున్నారు. ఒక్క ఎంపీ సీటు కోసం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సైతం ట్విట్టర్ వేదికగా ఆరెస్పీ నిర్ణయంపై ఘాటుగా స్పందించారు.

దుర్మార్గుడు హీరో అయ్యాడా? ఆకునూరి మురళి సూటి ప్రశ్న

"ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్ధం కావడం లేదు.. గత రెండు సంవత్సరాలు మీరు BRS మీద చెప్పినవన్నీ తప్పులు అయినట్టేనా? అప్పుడు దుర్మార్గుడిగా కనపడిన KCR ఇప్పుడు హీరో అయిండా? గాడిద మీద ఎక్కి అయినా పర్లేదు మీరు ఎంపీ అవ్వాలసిందేనా? ( గాడిదకు క్షమాపణలు చెబుతున్నాను ). రేపు BRS కేంద్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా? రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెలియదా? రాజకీయాల్లో విలువలు ఉండవనే వాదనను మీరు కూడా అనుసరిస్తారా? అన్యాయం పోలీస్ బాస్.. కరెక్టు కాదు మీ స్టెప్. యువత ఇంకా ఎవ్వరిని నమ్మరు, మిమ్మల్ని మీ రాజకీయాల్ని చూశాక. సారీ.... Mr RSP BSP " అంటూ ఆకునూరి మురళి ట్విట్టర్ లో ఆర్ఎస్పీని సూటిగా ప్రశ్నించారు.


ఆర్ఎస్పీ ని సగటు పొలిటీషియన్ గా యాక్సెప్ట్ చేయగలరా?

"వంద శాతం పేదల పక్షాన ఉండాలనుకుంటున్నాను. అందుకే వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నాను. ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో 26 ఏండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించాను. అనేక శాఖల్లో పని చేశాను. ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉంది. నా సర్వీసులో కేవలం ఒక్క శాతం మాత్రమే పేదలకు సేవలందించాను. వందశాతం పేదల పక్షాల ఉండాలనే రాజీనామా చేస్తున్నాను". 2021 జులై లో రాజీనామా చేసిన సందర్భంగా ప్రజలకు, అభిమానులకు ఆయన ఇచ్చిన వివరణ.

ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచే కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగ యువత డబ్బును దోచుకుంటున్నారు తప్ప ఉద్యోగాలు కల్పించడం లేదని పోరాటాలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం బాగు పడాలంటే కేసీఆర్ ని ఓడించాలని పిలుపునిచ్చారు.

ఇప్పుడు అదే డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోగలరా? ఆయన కూడా సాధారణ పొలిటీషియన్స్ లానే రంగులు మార్చడాన్ని యువత యాక్సెప్ట్ చేస్తుందా? చేయలేరు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అభిమానులు రాజకీయ నాయకుడిలా చూడలేదు. అన్యాయాలకు, అక్రమాలకు గురవుతున్న తమకి అండగా నిలబడే నాయకుడిలా చూశారు. తమ స్వరాన్ని వినిపించే గొంతుకలా చూశారు. కానీ ఎన్నికల ముందు వరకూ ఎవరినైతే అవినీతిపరులు, అక్రమార్కులు అంటూ దూషించారో.. వారితోనే పార్లమెంటు ఎన్నికల వేళ మైత్రి ఏర్పరుచుకోవడం మింగుడుపడని విషయం. ఆర్ఎస్పీ కూడా అందరిలానే సగటు రాజకీయ నాయకుడిగా మారిపోయారని ఆవేదన చెందుతున్నారు.

Read More
Next Story