సైబర్ నేరాల సొమ్మంతా ‘మ్యూల్’ ఖాతాల్లోకి
x
Mule accounts

సైబర్ నేరాల సొమ్మంతా ‘మ్యూల్’ ఖాతాల్లోకి

సైబర్ నేరాల ద్వారా దేశంలోని ఎక్కడెక్కడి ప్రాంతాల్లో కొల్లగొడుతున్న డబ్బునంతా హైదరాబాద్ లోని మ్యూల్ ఖాతాల్లో జమచేస్తున్నట్లు.


సైబర్ నేరాలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఒక కొత్త విషయాన్ని గుర్తించారు. అదేమిటంటే సైబర్ నేరాల ద్వారా దేశంలోని ఎక్కడెక్కడి ప్రాంతాల్లో కొల్లగొడుతున్న డబ్బునంతా హైదరాబాద్ లోని మ్యూల్ ఖాతాల్లో జమచేస్తున్నట్లు. మ్యూల్ ఖాతా అంటే కమీషన్ కోసం తమ బ్యాంకు ఖాతాను ఇంకోరికి అప్పగించేయటం. వివిధ బ్యాంకుల్లో ఆరు మ్యూల్ ఖాతాలున్నట్లు పోలీసులు తమ విచారణలో కనుక్కున్నారు. ఆరు ఖాతాల్లోని ఒక ఖాతాకు రు. 125కోట్లు జమైనట్లు గుర్తించిన పోలీసులు విస్తుపోయారు. ఎప్పటినుండి జరుగుతోంది ? నగరంలోని బ్యాంకుల్లో ఇంకెన్ని మ్యూల్ ఖాతాలున్నాయనే విషయాన్ని విచారణ చేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే సైబర్ నేరాలతో పాటు ఖాతాల నుండి మాయమవుతున్న డబ్బంతా ఎక్కడికి చేరుతోంది ? ఏ విధంగా ఖాతాదారుల ఖాతాల నుండి డబ్బును సైబర్ నేరగాళ్ళు కొల్లగొడుతున్నారనే విషయాన్ని సైబర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. తమ విచారణలో నగరంలోని శంశీర్ గంజ్ ఎస్బీఐ శాఖలోని కొన్ని ఖాతాల్లోని లావాదేవీలు అనుమానాస్పదంగా కనిపించింది. దాంతో పోలీసులు మరిన్ని విషయాల కోసం సదరు ఖాతాదారుడి వ్యవహారాలపై నిఘావేశారు. కొద్దిరోజుల్లోనే అనుమానాస్పదమైన లావాదేవీలు భారీ మొత్తాల్లో జరుగుతున్నట్లు తెలంగాణా సైబర్ సెక్యూరిటి బ్యూరో పోలీసులు(టీజీసీఎబీపీ) గుర్తించింది. వెంటనే ఖాతాదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆరు ఖాతాల్లోకి ఒకేసారి రు. 125 కోట్ల లావాదేవీలు జరిగిన విషయాన్ని ప్రస్తావించి ప్రశ్నించారు. ప్రోవెన్ ఏహెచ్ఎం ఫ్యూజన్ అనే సంస్ధపేరుపై ఉన్న ఖాతాలో మార్చి, ఏప్రిల్లో పెద్ద మొత్తంలో సొమ్ములు జమవ్వటమే కాకుండా తర్వాత అందులో నుండి ఆ సొమ్ము మాయమైపోయిన విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఖాతాదారుడు మహ్మద్ బిన్ అహ్మద్ బవజీర్ ను ప్రశ్నించారు. దాంతో అతను చెప్పిన వివరాలు విన్న పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. బవజీర్ చెప్పింది ఏమిటంతే ఖాతాతనదే కాని తాను లావాదేవీలు నిర్వహించటంలేదని. ఎందుకంటే దుబాయ్ లోని ఒక వ్యక్తి చెబితేనే తాను బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసినట్లు చెప్పాడు. సదరు వ్యక్తి చెప్పినట్లుగా బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ చెప్పినందుకు తనకు సూత్రదారుడు రెగ్యులర్ గా కమీషన్ పే చేస్తున్నట్లు బవజీర్ చెప్పాడు.

దుబాయ్ లోని సూత్రదారుడు ఎవరో ? తననే ఎందుకు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయమన్నాడో ? తన ఖాతాద్వారా ఇప్పటికి ఎంతడబ్బు లావాదేవీ జరిగియో బవజీర్ సరిగా చెప్పలేకపోయాడు. మామూలుగా అయితే బ్యాంకు టు బ్యాంకు అయితే ప్రతి లావాదేవీ రిజిస్టర్ అవుతుంది. కాని కొన్నిసార్లు బ్యాంకు నుండి మరికొన్నిసార్లు ఏటీఎంల నుండి కూడా డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో విత్ డ్రా చేసిన డబ్బంతా ఎవరికి చేరిందనే విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోతున్నారు. బవజీర్ పేరుతోనే ఉన్న రెండో ఖాతాలోకి ఒకసారి రు. 34.19 లక్షలు జమయ్యాయి. బ్యాంకు ఖాతాలో జమవుతున్న డబ్బును వివిధ రూపాల్లో విత్ డ్రా చేసి హవాలామార్గంలో ఫారిన్ ఎక్స్చేంజీల ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదే సమయంలో బవజీర్ ది కాకుండా మరో నాలుగు ఖాతాలు కూడా మ్యూల్ ఖాతాలే అని పోలీసులకు అర్ధమైపోయింది. దుబాయ్ లోని సూత్రదారి ఎవరో పట్టుబడితే కాని కేసు ముందుకు సాగే అవకాశంలేదు. ఎందుకంటే అరెస్టయిన బవజీర్ కు దుబాయ్ లో ఉంటున్న సూత్రదారి ఎవరో తెలీదు. కమీషన్ ఇస్తామని ఆశచూపితే బ్యాంకులో రెండు ఖాతాలు తెరిచి వాటి వివరాలను సూత్రదారికి ఇచ్చేశాడు. తన కమీషన్ తనకు వస్తోంది కాబట్టి ఖాతాలో లావాదేవీల విషయాన్ని బవజీర్ పట్టించుకోలేదు. 234 నేరాలకు సంబంధించిన 160 కోట్ల రూపాయలు మ్యూల్ ఖాతాల్లో జమై తర్వాత హవాలా మార్గంలో విదేశాలకు వెళ్ళిపోయిందని మాత్రం గుర్తించారు. తాజా ఘటనతో శంశీర్ గంజ్ ఎస్బీఐ శాఖలోని పెద్ద పెద్ద ఖాతాల్లో జరిగిన లావాదేవీలను పోలీసులు ఇపుడు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఈ శాఖలోని ఖాతాలకే పెద్ద మొత్తాలు జమవుతున్నాయనే విషయం బయటపడింది. శాఖలోనే కాకుండి హైదరాబాదులోని అన్నీ బ్యాంకు శాఖల్లో ఎన్ని మ్యూల్ ఖాతాలున్నాయో అన్న విషయం తేలక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

Read More
Next Story