రేవంత్-చంద్రబాబు రేపు ఏమ్మాట్లాడతారు?
x
చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిల భేటీ రేపు

రేవంత్-చంద్రబాబు రేపు ఏమ్మాట్లాడతారు?

విభజన జరిగి పదేళ్లు గడిచినా తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి.ఇద్దరు సీఎంలు సమావేశం కానుండటంతో సమస్యల పరిష్కారంపై కొత్త ఆశలు రేకేత్తాయి.


రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ల ముఖ్యమంత్రులుగా ఎనుముల.రేవంత్‌రెడ్డి, నారా.చంద్రబాబు నాయుడు జులై 6వతేదీన (రేపు) జరగనున్న తొలి సమావేశంపై రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాల ప్రజల్లో కొత్త ఆశలు ఏర్పడ్డాయి.

విభజన సమస్యలను పరిష్కరించుకుందాం : ఏపీ సీఎం చంద్రబాబు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలపై చర్చించేందుకు సమావేశం అవుదామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు లేఖ రాస్తూ చొరవ తీసుకున్నారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు లేఖలో కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని, ఉమ్మడి అంశాలపై సామరస్య పరిష్కారానికి తాను ఎదురు చూస్తున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
సామరస్యంగా చర్చిద్దాం రండి : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
విభజన సమస్యల పరిష్కారానికి భేటీ అవుదామంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబు భేటీ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో జరిగే భేటీకి సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి ప్రత్యుత్తరం రాయడంతో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మొదటి సమావేశానికి రంగం సిద్ధమైంది.విభజన సమస్యలను పరిష్కరించుకోవాలనే మీ అభిప్రాయంతో ఏకిభవిస్తున్నానని రేవంత్ సమాధానమిచ్చారు. విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని తెలంగాణ సీఎం పేర్కొన్నారు.
పదేళ్ల సమస్యలకు పరిష్కారం లభించేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి, తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటింది.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పదేళ్లుగా పలు సమస్యలు పరిష్కారం కాలేదు. గత 10 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రలు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అనుబంధం
రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు హయాంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ టీడీపీలో కూడా పనిచేశారు.2017వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా రేవంత్ రెడ్డి ఆ పార్టీని విజయపథంలో నడిపి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు.మరో వైపు టీడీపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ఘనవిజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు.ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అనుబంధం ఉంది. దీంతో పదేళ్లుగా పరిష్కారం కాని విభజన సమస్యలు పరిష్కారమవుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

2014లో చంద్రబాబు,కేసీఆర్‌ల మధ్య కుదరని సఖ్యత
2014- 2019 సంవత్సరాల మధ్య విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసినప్పుడు, తెలంగాణలో కె. చంద్రశేఖర్ రావు సీఎంగా ఉన్నారు. ఇద్దరు నాయకులు కూడా గతంలో టీడీపీలో సహచరులుగా ఉన్నప్పటికీ వారి మధ్య సఖ్యత కుదరలేదు. 2009వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పొత్తు పెట్టుకున్నప్పటికీ, కేసీఆర్, ఆయన పార్టీ టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) ఎల్లప్పుడూ టీడీపీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా భావించడం వల్ల ఇద్దరు తెలుగు సీఎంల మధ్య సఖ్యత కుదరలేదు.

ఓటుకు నోటు కేసు
2015 నాటి ఓటుకు నోటు కేసులో తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నాడని కేసీఆర్ ఆరోపించడంతో ఇద్దరు తెలుగు సీఎంల మధ్య మరింత అపనమ్మకం ఏర్పడింది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డికి అనుకూలంగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఓటును కొనుగోలు చేసేందుకు యత్నించారని రేవంత్‌రెడ్డిపై అప్పట్లో అవినీతి నిరోధక శాఖ దాడి చేసి అరెస్ట్ చేసింది.

అమరావతికి మారిన ఏపీ రాజధాని
ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించినప్పటికీ, 2016లోనే చంద్రబాబునాయుడు ఏపీ రాజధానిని విజయవాడకు మార్చి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం ప్రారంభించారు.అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ హాజరైనా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన సహా అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కారం కాలేదు.

జగన్, కేసీఆర్ కలిసినా ...
తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేయడంతో కేసీఆర్, చంద్రబాబు మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.అయితే కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో తెలంగాణలో రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది.కొన్ని నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ టీడీపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది.ఆ మార్పును టీఆర్‌ఎస్‌ ప్రశంసించింది.కాబోయే ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌తో తొలిసారి భేటీ అయ్యారు.

గవర్నర్ సమక్షంలో చర్చలు జరిగినా...
ఏపీ సీఎం జగన్ 2019 ఆగస్టు 6వతేదీన అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో కలిసి ఉమ్మడి రాష్ట్రాల ఆస్తులు, నదీ జలాల పంపకాలపై చర్చించారు. అనంతరం ప్రగతి భవన్ కు వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. అయినా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు.
- 2021 జులై 10వతేదీన ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం, రాయలసీమ లిఫ్ట్ వ్యవహారం, పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి లిఫ్ట్ ల వ్యహారంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. ఈ వివాదాలను కేంద్రం, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ తీర్చ లేక పోయింది.
- కాళేశ్వరంలో, ప్రగతిభవన్ లో సీఎంలు జగన్, కేసీఆర్ కలిసినా వారి మధ్య రెండు రాష్ట్రాల వివాదాలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు.
- తన ఉమ్మడి ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా రాజకీయంగా జగన్, కేసీఆర్ లు అంతర్గతంగా కలిసి ఒకరికి మరొకరు సహకరించుకున్నా, రెండు రాష్ట్రాల పెండింగ్ సమస్యలను మాత్రం సామరస్యంగా పరిష్కరించుకోలేక పోయారు.

పరిష్కారం కాని వివాదాలు
అంతర్రాష్ట్ర వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఇద్దరు సీఎంలు కలిసి పని చేసేందుకు అంగీకరించడంతో జగన్-కేసీఆర్ మధ్య స్నేహబంధం ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ హాజరైన సందర్భంగా జరిగిన భేటీతో సహా ఇద్దరు నేతలు కొన్ని సమావేశాలు నిర్వహించారు.అయినా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు.

9 వ షెడ్యూల్ వివాదాలు
ఏపీరాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కేంద్రం పిలిచి రెండు రాష్ట్రాల అధికారులతో పలు సమావేశాలు నిర్వహించినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు.పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న 23 కార్పొరేషన్లకు చెందిన ఆస్తుల విభజన ఇంకా కాలేదు. రోడ్డు రవాణా సంస్థ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ల మధ్య వివాదాలున్నాయి.

పదో షెడ్యూల్ సంస్థల ఆస్తుల విభజనపై రాజుకున్న వివాదం
చట్టంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న 30 సంస్థల ఆస్తుల విభజనపై కూడా రెండు రాష్ట్రాలు విభేదిస్తున్నాయి. వీటిలో రాజ్ భవన్, హైకోర్టు,లోకాయుక్త ఉన్నాయి.హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి సంస్థల భూములు,భవనాలు, బ్యాంకు నిల్వలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా నిష్పత్తిలో 52:48 శాతం నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటాను డిమాండ్ చేస్తోంది.

గోదావరి, కృష్ణా జలాల పంపిణీపై వివాదం
గోదావరి, కృష్ణా జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాలు వాగ్వాదానికి దిగాయి. రెండు నదులపై నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగించారు గత ఒప్పందాలను, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించారని పరస్పరం రెండు రాష్ట్రాలు ఆరోపణలు చేసుకున్నాయి.

పునర్వ్యవస్థీకరణ చట్టం కింద పరిష్కరించని సమస్యలు
ఆంధ్రప్రదేశ్ అధికారులు తమ రాష్ట్రానికి బలవంతంగా నీటిని విడుదల చేయడంతో గత ఏడాది నవంబర్ 30వతేదీన కృష్ణా నదికి అడ్డంగా ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.కేంద్రం జోక్యం చేసుకుని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ని మోహరించింది.కేంద్రం డ్యామ్ నియంత్రణను కృష్ణా రివర్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించింది.

ఎన్నెన్నో వివాదాలు...
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో వాటా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కూడా డిమాండ్ చేసింది. అయితే తెలంగాణ ఆ డిమాండ్‌ను తిరస్కరించింది.వాణిజ్య పన్నుల బకాయిలు,విద్యుత్ బకాయిలు,కార్మిక సంక్షేమ నిధికి సంబంధించిన వివాదాలు కూడా ఉన్నాయి.5,000 కోట్ల విద్యుత్ బకాయిలను తెలంగాణ ఇంకా చెల్లించలేదని ఆంధ్ర ప్రదేశ్ చెబుతోంది.


Read More
Next Story