
సన్నద్ధమవుతున్న స్కిల్ వర్సిటీ క్యాంపస్
70 శాతం నుంచి 80 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాలను కూడా నేర్పించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రయత్నిస్తోంది. దీంతో పాటు విద్యార్థులకు సకల సదుపాయాలతో నైపుణ్యాలను పెంచేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో సమీపంలోని మీర్ఖాన్ పేట్ లోని స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌లోని వసతులపై దృష్టిసారించారు. అందులో అకడమిక్ బ్లాక్, ప్రయోగశాలలు, వసతి గృహాలు, వైస్ ఛాన్సలర్ కార్యాలయాల నిర్మాణాలను శరవేగంగా చేయిస్తున్నారు. ఇవి డిసెంబర్ నాటికి సిద్ధమవుతాయి. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 9న లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ప్రస్తుతం స్కిల్స్ యూనివర్సిటీలో సంబంధిత దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఫార్మా, రిటైల్, లాజిస్టిక్స్, ఏవియేషన్ అండ్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నామని, ప్రస్తుతం ఈ కోర్సులకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. వీటిని విజయవంతంగా పూర్తి చేసిన 70 శాతం నుంచి 80 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు. "యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ" నిర్మాణ పనుల పురోగతిని ఆయన మంగళవారం పరిశీలించారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించి, తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో "యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ"ని ఏర్పాటు చేశామని వివరించారు. తెలంగాణ యువతలో ప్రతి కొదవలేదని, కొంచెం సానబెడితే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఓవైపు పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూనే మరోవైపు తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.