హైడ్రా దెబ్బకు ప్రముఖుల కబ్జాలన్నీ బయటపడుతున్నాయా ?
x
Janwada farm house

హైడ్రా దెబ్బకు ప్రముఖుల కబ్జాలన్నీ బయటపడుతున్నాయా ?

ఆక్రమణల తొలగింపులో జన్వాడలో కేటీఆర్ ఫాంహౌస్ నే హైడ్రా వదిలిపెట్టలేదంటే ఇక తమ పరిస్ధితి ఏమిటన్న విషయంలోనే చాలామంది ప్రముఖుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.


హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దెబ్బకు ప్రముఖుల్లో చాలామందికి టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే హైడ్రా కేంద్రంగా బుధవారం జరిగిన డెవలప్మెంట్లే. ఇంతకీ ఆ డెవలప్మెంట్ ఏమిటంటే జన్వాడలో తన ఫాం హౌస్ కూల్చివేతను నిలిపేయాలని బిల్డర్ కమ్ కాంట్రాక్టర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించటమే. ఒక బిల్డర్ ఫాంహౌస్ కూల్చివేతపై ఎందుకింత చర్చజరిగింది ? ఎందుకంటే ఆ ఫాంహౌస్ కేటీఆర్ ఆధీనంలో ఉండటమే. తానుంటున్న ఫాంహౌస్ తనదికాదని తన మిత్రుడు ప్రదీప్ రెడ్డిదని కేటీఆర్ మీడియా ముందుచెప్పారు. ఫాంహౌస్ ను మిత్రుడి దగ్గర నుండి తాను లీజుకు తీసుకున్నట్లు కేటీఆర్ చెబుతున్నారు.

అసలు ఆ ఫాంహౌస్ ను కూల్చేయాలని హైడ్రా ఎందుకు అనుకున్నట్లు ? ఎందుకంటే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో చెరువును ఆక్రమించి ఫాంహౌస్ నిర్మించుకున్నారని ఇరిగేషన్ అధికారులు హైడ్రాకు చెప్పారు. దాంతో ఫాంహౌస్ సంగతేమిటో చూడాలని హైడ్రా డిసైడ్ అయ్యింది. దాంతో అప్రమత్తమైన ప్రదీప్ రెడ్డి వెంటనే కోర్టులో కేసువేశారు. ఎందుకింత అర్జంటుగా కేసు వేశారంటే తన ఫాంహౌస్ ను హైడ్రా ఎక్కడ కూల్చేస్తుందో అన్న భయంతోనే. చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించుకున్న 140 నిర్మాణాలను హైడ్రా కూల్చేయటమే కాకుండా 150 ఎకరాలను స్వాధీనం చేసుకున్నది. హైడ్రా కూల్చేసిన నిర్మాణాల్లో ఎంఐఎం ఎంఎల్ఏ మొబిన్ తో పాటు చాలామంది ప్రముఖులవి ఉన్నాయి.

కాబట్టి హైడ్రా తన ఫాంహౌస్ ను కూల్చేస్తుందేమో అన్న భయంతోనే ప్రదీప్ కోర్టును ఆశ్రయించారు. తాను చెరువును ఆక్రమించి ఫాంహౌస్ ను నిర్మించుకోలేదని అయితే కేటీఆర్ కు సన్నిహితుడనన్న కారణంతో తన నిర్మాణాన్ని కూల్చేసే అవకాశముందన్న అనుమానంతోనే తాను కోర్టులో కేసు వేసినట్లు బిల్డర్ చెబుతున్నారు. సరే ఈ విషయాన్ని వదిలేస్తే హైడ్రా దెబ్బకు చాలామంది ప్రముఖుల్లో టెన్షన్ పెరిగిపోతోందన్నది వాస్తవం. ట్విట్లర్ వేదికగా అక్రమంగా నిర్మించారంటు కొందరి ఫాంహౌస్ ల శాటిలైట్ ఇమేజెస్ చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, కాంగ్రెస్ ఎంఎల్ఏలు గడ్డం వివేక్, దానం నాగేందర్, రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి, సినీనటుడు అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ లాంటివి ప్రముఖంగా కనబడుతున్నాయి. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు రేవంత్ సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ తదితరులు అక్రమంగా నిర్మించిన ఫాం హౌస్ లను కూడా కూల్చాలని డిమాండ్ చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలు, ఎంపీలతో పాటు సీనియర్ నేతల ఫాం హౌస్ వివరాలను బీఆర్ఎస్ నేతలు బయటపెడుతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రముఖుల ఫాంహౌస్ వివరాలను కాంగ్రెస్ నేతలు రిలీజ్ చేస్తున్నారు. రెండుపార్టీల నేతలు ఒకళ్ళ ఫాం హౌస్ ల వివరాలను మరొకళ్ళు బయటపెట్టుకోవటం వల్ల హైడ్రా పని చాలా సులభం అవుతోంది. అయితే రాజకీయ వైరం కారణంగా ఇపుడు ట్విట్టర్లో కనబడుతున్న ఫాం హౌస్ లు అన్నీ అక్రమ నిర్మాణాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించినవి కాకపోవచ్చు. రాజకీయ వైరం కారణంగా ప్రత్యర్ధులను గబ్బుపట్టిద్దామనే హిడెన్ అజెండా కూడా ఉండచ్చు.

ఏదేమైనా చెరువులు, కుంటలను ఆక్రమించి చేసిన నిర్మాణాలే కాకుండా అసలు అనుమతులే లేకుండా చేసిన నిర్మాణాల గురించి కూడా హైడ్రాకు వచ్చే ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. దాంతో హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ తన బృందంతో నిజాంపేట, శేరలింగంపల్లి, కూకట్ పల్లి, గండిపేట, కుత్బుల్లాపూర్, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖుల్లో చాలామందికి ఫాంహౌస్ లున్నాయి. వీటిల్లో అక్రమ నిర్మాణాలతో పాటు చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించినవి కూడా ఉండచ్చు. వీటన్నింటిపైనా ఇపుడు హైడ్రా గట్టిగా దృష్టిపెట్టింది.

హైదరాబాద్ పరిధిలోని సుమారు 400 చెరువులు ఆక్రమణలకు గురైనట్లు ఇఫ్పటికే హైడ్రాకు జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ శాఖ, రెవిన్యు, మున్సిపాలిటిల నుండి సమాచారం అందింది. అందుకనే వరుసగా చెరువుల వారీగా హైడ్రా కమీషనర్ పరిశీలిస్తున్నారు. చెరువుల్లో నిర్మించిన సుమారు 20 భారీ నిర్మాణాలను ఇప్పటికే హైడ్రా కూల్చేసింది. వీటిల్లోనే ఒకరిద్దరు ఎంఎల్ఏల ఆస్తులు కూడా ఉన్నాయి. ఆక్రమణల తొలగింపు, చెరువులు, కుంటలను కాపాడటం, ప్రభుత్వ స్ధలాల్లో అక్రమనిర్మాణాలను తొలగించి తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకురావటంలో హైడ్రాకు రేవంత్ ఫుల్ పవర్స్ ఇచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే రాజకీయంగా ఎంతటి ఒత్తిళ్ళు వస్తున్నా హైడ్రా లెక్కచేయకుండా ముందుకు వెళుతోంది.

కబ్జాలో 650 చెరువులు

ఒకపుడు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న 3500 చెరువులుండేవి. అయితే కాలక్రమేణా అవన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. 2023 లెక్కల ప్రకారం సాగు, తాగునీరందించే చెరువుల్లో 200 తప్ప మిగిలినవన్నీ కబ్జా అయిపోయాయి. ఇవన్నీ కూడా రాజకీయ నేతల దన్ను లేకుండా జరగలేదు. చెరువులు, తూములు, కాల్వల ఆక్రమణల్లో ప్రతిరాజకీయ పార్టీకి సంబంధముందనటంలో సందేహంలేదు. ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే మూసీ నదికి రెండువైపులా ఉన్న 56 చెరువులు పూర్తి ఆక్రమణకు గురయ్యాయి. మురికికూపంగా మారిన మూసీని సుందర నదిగా, మంచినీటి నదిగా మార్చాలన్న రేవంత్ ఆలోచన సాకారం కావాలంటే ముందు ఆక్రమణలన్నింటినీ తొలగించాలి. మూసీ నది టార్గెట్ గానే రేవంత్ 56 చెరువులతో పాటు మిగిలిన చెరువుల్లోని ఆక్రమ నిర్మాణాలను తొలగించాలని డిసైడ్ అయ్యారు.

హైదరాబాద్ పరిధి పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా ఊపందుకుంటోంది. ఎప్పుడైతే భూముల డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయో అప్పుడే కబ్జాలు కూడా పెరిగిపోయాయి. ఇందులో భాగంగానే సాగు, మంచినీటి చెరువులు, తూములు, కాల్వలను ఆక్రమించేసి అక్రమంగా నిర్మాణాలు చేసేస్తున్నారు. అక్రమార్కులకు అధికారులు కూడా మద్దతు ఇస్తున్నారు కాబట్టే యధేచ్చగా కబ్జాలు పెరిగిపోతున్నాయి. అధికారుల మద్దతు లేకపోతే చెరువులను ఆక్రమించేసి పెద్ద పెద్ద అపార్టుమెంట్లను ఎవరైనా కట్టగలరా ? తెల్లాపూర్, అమీన్ పూర్, జిన్నారం ప్రాంతంలోని చెరువులన్నీ ఆక్రమణలకు గురైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఒక్క అమీన్ పూర్ లోని 13 చెరువుల్లో 883 అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక అందించినట్లు సమాచారం. మూసీ సుందరీకరణ చేయాలంటే రెండు వైపుల ఆక్రమణలు తొలగించటంతో పాటు చుట్టుపక్కల చెరువులను కూడా కాపాడుకోవాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఈ నేపధ్యంలోనే హైడ్రా పుట్టింది. ఆక్రమణల తొలగింపులో జన్వాడలో కేటీఆర్ ఫాంహౌస్ నే హైడ్రా వదిలిపెట్టలేదంటే ఇక తమ పరిస్ధితి ఏమిటన్న విషయంలోనే చాలామంది ప్రముఖుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story