కవిత దగ్గర బాణాలు అయిపోయాయా ?
x
Kavita kalvakuntla

కవిత దగ్గర బాణాలు అయిపోయాయా ?

బెయిల్ సంపాదించటం కోసం చివరి బాణం(అస్త్రం)గా మహిళా రిజర్వేషన్ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. అయినా ఎలాంటి ఫలితమూ దక్కలేదు.


కల్వకుంట్ల కవిత దగ్గర అన్నీ బాణాలు అయిపోయినట్లున్నాయి. బెయిల్ సంపాదించటం కోసం చివరి బాణం(అస్త్రం)గా మహిళా రిజర్వేషన్ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. అయినా ఎలాంటి ఫలితమూ దక్కలేదు. బెయిల్ తీసుకోవటానికి మహిళా, పురుషుడు అన్న రిజర్వేషన్ లేదన్నట్లుగా సుప్రింకోర్టు చెప్పింది. దాంతో బెయిల్ తీసుకోవటానికి కవితకు అన్నీ దారులు మూసుకుపోయాయనే చెప్పాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇందులో నుండి బయటపడేందుకు కవిత నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 14వ తేదీన హైదరాబాద్ లో అరెస్టుచేసిన కవితను ఈడీ వెంటనే ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించింది. అప్పటినుండి తీహార్లోనే కవిత గడుపుతున్నారు. లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధంలేదని కవిత వాదిస్తున్నారు. అయితే స్కామ్ లో కవితే కీలక పాత్రని ఈడీ, సీబీఐలు బలంగా చెబుతున్నాయి. కవిత పాత్రకు ఆధారంగా కోర్టులో కొన్ని సాక్ష్యాలు కూడా చూపించాయి. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను బెదిరించటమే కాకుండా సాక్ష్యాలను మార్చేయగల సామర్ధ్యం ఉందన్న దర్యాప్తు సంస్ధల వాదనతో కోర్టులో కూడా ఏకీభవిస్తున్నాయి.

బెయిల్ కోసం ముందు కవిత రౌస్ ఎవిన్యు కోర్టులో చాలాసార్లు పిటీషన్లు వేశారు. అనారోగ్యమన్నారు, కొడుకు చదువు, పరీక్షలన్నారు. ఏమిచెప్పినా కోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఎన్నికల్లో పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేయాలన్నా కోర్టు బెయిల్ ఇవ్వలేదు. కిందికోర్టులు లాభంలేదని అనుకున్న కవిత ఏకంగా సుప్రింకోర్టునే ఆశ్రయించారు. సుప్రింకోర్టులో తాను మహిళ కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని వాదించారు. అయితే సుప్రింకోర్టు ఇందుకు అంగీకరించలేదు. బెయిల్ ఇచ్చే విషయంలో అర్హతుందా లేదా అని మాత్రమే కోర్టు చూస్తుంది కాని పురుషుడా లేకపోతే మహిళా అని చూడరని చురకలు కూడా అంటించింది. ఇదే సమయంలో కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదో చెబుతు ఆమె రాజకీయ నేపధ్యాన్ని దర్యాప్తుసంస్ధలు వివరించాయి. దాంతో కవితకు సుప్రింకోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే బెయిల్ కోసం వేసుకున్న మరో పిటీషన్ను ఈనెల 20వ తేదీన విచారిస్తామని చెప్పింది. ఇదే సమయంలో కవిత జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 2వ తేదీ వరకు రౌస్ ఎవిన్యు కోర్టు పొడిగించింది.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బెయిల్ కోసం కవిత ముందున్న అన్నీ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. ఇప్పటికి ఐదునెలలుగా తీహార్ జైలులోనే ఉంటున్న కవిత మరికొంత కాలం ఉండక తప్పేట్లు లేదు. వెంట వెంటనే కవిత బెయిల్ పిటీషన్లు వేస్తుండటంతో కోర్టు కూడా సఫోకేషన్ ఫీలవుతున్నట్లుంది. అందుకనే కొంతకాలం విరామం తీసుకుని తర్వాత ఏదైనా గట్టి కారణం చూపించి బెయిల్ పిటీషన్ వేస్తే బాగుంటుంది. వారంరోజుల్లో కవితకు బెయిల్ వచ్చేస్తుందని సోదరుడు కేటీఆర్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైపోయాయి.

Read More
Next Story