Allu Arjun and Police|పోలీసు విచారణకు హాజరైన పుష్ప
పుష్పతో పాటు తండ్రి అల్లు అరవింద్, మామ కంచర్ల చంద్రశేఖరరెడ్డి, లాయర్లు కూడా ఉన్నారు.
చిక్కడపల్లి పోలీసుల విచారణకు పుష్ప అలియాస్ అల్లుఅర్జున్ మంగళవారం ఉదయం హాజరయ్యారు. ఈనెల 4వ తేదీన పుష్ప సినిమా(Pushpa Movie) థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవటంతో పాటు ఆమె కొడుకు శ్రీతేజ స్పృహతప్పిన విషయం తెలిసిందే. రేవతి థియేటర్లోనే చనిపోగా తేజ ఇప్పటికీ కోమాలోనే ఉన్నాడు. ఇదేవిషయమై పుష్పమీద కేసునమోదు చేసి పోలీసులు అరెస్టు చేయగా బెయిల్ తెచ్చుకున్నాడు. పుష్పకు బెయిల్ ఇచ్చిన హైకోర్టు కేసు విచారణకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈరోజు 11 గంటలకు విచారణకు హాజరవ్వాలని అల్లుఅర్జున్(Allu Arjun) కు పోలీసులు నోటీసు(Police Notice)లు జారీచేశారు. నోటీసులు అందుకున్న అల్లుఅర్జున్ సొమవారం తన లీగల్ టీమ్ తో భేటీ అయ్యారు. పోలీసుల విచారణను ఎదుర్కొనే విషయంలో లాయర్ల నుండి పుష్ప సలహాలు, సూచనలు తీసుకున్నారు.
థియేటర్లో తొక్కిసలాటకు సంబంధించిన సీన్ ఆఫ్ అఫెన్స్ ను రీ క్రియేట్ చేయటం కోసమే పోలీసులు అల్లుఅర్జున్ ను పిలిపించారు. థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించినట్లు మరుసటిరోజు మాత్రమే తనకు తెలిసిందని, తొక్కిసలాట జరుగుతున్న కారణంగా తనను థియేటర్లో నుండి వెళ్ళిపోవాలని మేనేజర్ చెబితే వెంటనే వెళ్ళిపోయినట్లు చెప్పాడు. అయితే మరుసటిరోజు అంటే శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి(Revanth reddy) మాట్లాడుతు అల్లుఅర్జున్ వైఖరిపై పెద్దఎత్తున ధ్వజమెత్తారు. తొక్కిసలాటకు అల్లుఅర్జునే కారణమని చెప్పారు. తొక్కిసలాటలో మహిళ మరణించిందని పోలీసులు చెప్పినా సినిమా పూర్తయ్యేవరకు కదిలేదిలేదని అల్లుఅర్జున్ చెప్పాడని ఆరోపించాడు. పోలీసులు బలవంతంగా అల్లుఅర్జున్ ను ధియేటర్లో నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఓపెన్ టాప్ కారులో అభిమానులకు అభివాదాలు చేసుకుంటు వెళ్ళినట్లు రేవంత్ మండిపడ్డాడు.
అదేరోజు రాత్రి అల్లుఅర్జున్ మీడియా సమావేశం పెట్టి రేవంత్ ఆరోపణలను ఖండించాడు. తనక్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోందని మండిపడ్డాడు. తొక్కిసలాటలో మహిళ మరణించిన విషయం మరుసటిరోజు మాత్రమే తనకు తెలిసిందని మళ్ళీచెప్పాడు. తొక్కిసలాటకు తనకు అసలు సంబంధంలేదన్నాడు. రేవంత్ చెప్పినట్లుగా తాను రోడ్డుషో, ర్యాలీ చేయలేదన్నాడు. ఎప్పుడైతే రేవంత్ ఆరోపణలు తప్పని అల్లుఅర్జున ఖండించటంతో పాటు పోలీసులను తప్పుపట్టాడో వ్యవహారం బాగా ముదిరిపోయింది. అల్లుఅర్జున్ ఆరోపణలను ఖండించిన పోలీసులు శనివారం మధ్యాహ్నం థియేటర్లో అల్లుఅర్జున్ రాకముందు, వచ్చిన తర్వాత ఏమి జరిగిందన్న 10 నిముషాల వీడియోను రిలీజ్ చేశారు.
ఆవీడియోలో అల్లుఅర్జున్ రోడ్డుషో, ర్యాలీ చేసినట్లు, థియేటర్లో తొక్కిసలాట, బౌన్సర్ల ఓవర్ యాక్షన్ మినట్ మినిట్ దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వీడియోచూసిన వారికి అల్లుఅర్జున్ తప్పుచేయటమే కాకుండా అబద్ధాలు చెప్పినట్లు స్పష్టంగా అర్ధమైపోతుంది. ఈనేపధ్యంలోనే అల్లుఅర్జున్ను విచారించేందుకు రావాలని ఆదివారం చిక్కడపల్లి పోలీసులు(Chikkadapalli Police Station) నోటీసులు జారీచేశారు. ఈ కారణంగానే పుష్ప 11 గంటలకు పోలీసుస్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఏసీపీ రమేష్, సీఐ రాజు అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు. పుష్పతో పాటు తండ్రి అల్లు అరవింద్, మామ కంచర్ల చంద్రశేఖరరెడ్డి, లాయర్లు కూడా ఉన్నారు. మరి అల్లుఅర్జున్ విచారణలో పోలీసులు అల్లుఅర్జున్ను స్టేషన్ కు మాత్రమే పరిమితంచేస్తారా ? లేకపోతే సీన్ ఆఫ్ రికనస్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్ కు తీసుకువెళతారా అన్నది చూడాలి.