అమెజాన్‌తో మంత్రి చర్చలు సక్సెస్
అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది.
అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆదివారం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధి బృందంతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు.
ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్లో ఉంది. గత ఏడాది అమెజాన్ డెడికేటేడ్ ఎయిర్ కార్గో నెట్‌వర్క్ ‘అమెజాన్ ఎయిర్’ ప్రారంభించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు సంబంధించి హైదారాబాద్లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్‌తో పాటు తమ వ్యాపారాన్నివిస్తరించే ఆలోచనలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అమెజాన్‌తో చర్చలు విజయవంతమయ్యాయని ప్రకటించారు. ప్రభుత్వం తరఫున తగినంత సహకారంతో పాటు ఉత్తమమైన ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ విస్తరణకు కంపెనీ మందుకు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అమెజాన్ వెబ్సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధికి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందన్నారు.