
హైదరాబాద్‌కు అమిత్ షా.. శోభాయాత్ర కోసమే..
విభేదాలపై ఫోకస్ పెట్టనున్నారా..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సెప్టెబర్ 6న హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతుండటం, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటం, తెలంగాణ బీజేపీలో నేతల మధ్య అంతర్విభేధాలు ఇలా అనేక అంశాలు కీలకంగా మారాయి. ఈ క్రమంలో అమిత్ షా.. పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 6న జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. శోభాయాత్ర అనంతరం ఆయన పార్టీ పరంగా తెలంగాణలో ఉన్న విభేధాలపై ఫోకస్ పెడతారని తెలుస్తోంది.
అమిత్ షా షెడ్యూల్ ఇదే..
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సెప్టెంబర్ 6న ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. ఉదయం 11:30 గంటల నుంచి 12:30 వరకు ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 1గంటకు చార్మినార్ దగ్గర వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఎంజే మార్కెట్ దగ్గర నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు. చార్మినార్ దగ్గర కూడా అమిత్ షా ప్రసంగించే అవకాశం ఉంది.
సమావేశంలో ఈ అంశాలపైనే చర్చ..!
పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించే సమావేశంలో అమిత్ షా పలు కీలక అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది. వాటితో పాటుగా అతి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలంగాణ బీజేపీ సత్తా చాటాలని నాయకులను ఆయన ఉత్తేజపరుస్తారు. అందుకోసం స్థానిక ఎన్నికల పర్యటనలో అవలంభించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో లేవనెత్తాల్సిన అంశాలు ఇలా అనేక విషయాలపై అమిత్ షా చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటుగానే పార్టీలో నేతల మధ్య కొనసాగుతున్న కొన్ని విభేధాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది.