
హైదరాబాద్ లో ప్రాచీన చతుర్ముఖ నందీశ్వర లింగం లభ్యం
చైతన్యపురి ఫణిగిరి ఆలయం వెనక శిధిలాలో కనుగొన్న చరిత్రకారుడు
హైదరాబాద్‌లోని చైతన్యపురి ప్రాంతం సుమారు 1600 ఏళ్ల క్రితం నిర్మించబడిన గోవిందరాజ విహార ( Govindaraja Vihara) అనే హీనయాన బౌద్ధ విహారం (Hinayana Buddhist monastery ) సూచించే శాసనంతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఆ విహారం స్థలాన్ని ఫణిగిరి కొసగుండ్ల నరసింహ స్వామి దేవాలయంగా పిలుస్తున్నారు. నిన్న ఆ ఆలయం వెనుక భాగంలోని శిథిలాలలో నేను కొత్తగా ఒక చతుర్ముఖ నందీశ్వర లింగం (Chaturmukha Nandeeshwara Lingam) నాకు కనిపించింది.
దాదాపు 2 అడుగుల చదరపు గ్రానైట్ రాతి స్లాబ్‌పై, 4 దిక్కులలో ఒక్కొక్కటి 8 అంగుళాల పరిమాణంలో నందులను చెక్కారు. వాటి మధ్యలో శివలింగం, దాని చుట్టూ అభిషేక జలాన్ని బయటకు పంపే పానవట్టం చెక్కారు.
1500 ఏళ్ల చరిత్ర:
ఈ శిల్పం తెలంగాణలోనే కాకుండా మొత్తం భారతదేశంలోనూ అతి ప్రాచీనమైన అరుదైన చతుర్ముఖ నందీశ్వర లింగం. క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 2వ శతాబ్దం మధ్య కాలానికి చెందిన ఏకశిలా శివలింగాలు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా గుడిమల్లం, అలాగే తెలంగాణలోని గద్వాల జిల్లా రంగాపురం, ఘూమకొండ ప్రాంతాలలో లభించినప్పటికీ ఇప్పుడు వెలుగు చూసిన ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే—ఇది నాలుగు దిక్కులలో నందులను కలిగి ఉండటమే.

ఈ శిల్పం, సుమారు క్రీస్తు శకం 400 ప్రాంతంలో విష్ణుకుండి వంశపు రాజైన గోవిందరాజు నిర్మించిన బౌద్ధ క్షేత్రంలో లభించడం వల్ల, ఆ తరువాతి పాలకులు బౌద్ధ స్థలాలను నిర్లక్ష్యం చేసి, వాటి శిథిలాలపై శైవ సంప్రదాయాన్ని ప్రోత్సహించారని అర్థమవుతోంది. ఇదే విషయాన్ని సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో కూడా చూడవచ్చు. అక్కడ బౌద్ధ శిలాఫలకంపై శివలింగం చెక్కబడి ఉంది. ఈ ఆధారాలపై చరిత్రకారులు విష్ణుకుండుల తరువాతి పాలకులు బౌద్ధమతాన్ని విస్మరించి, శైవమతాన్ని ప్రోత్సహించారని నిర్ణయించారు. దీనికి మద్దతుగా క్రీ.శ. 6వ శతాబ్దంలో విష్ణుకుండి పాలకులు ఇంద్రభట్టారక వర్మ , ఆయన కుమారుడు విక్రమేంద్ర వర్మ తమ బిరుదుల్లో "పరమ మహేశ్వర" అనే పదాన్ని స్వీకరించారు. అంటే మహేశ్వర (శైవ) మతాన్ని పోషించారన్నమాట.
తదుపరి కాలంలో చతుర్ముఖ నందీశ్వర లింగ సంప్రదాయం కొనసాగిందని చెప్పడానికి నిదర్శనంగా నాగర్‌కర్నూలు జిల్లా మన్ననూరులో చతుర్ముఖ బసవేశ్వర లింగం బయటపడింది. దీనిని క్రీ. శ.13వ శతాబ్దంలో పాల్కురికి సోమన "పండితారాధ్య చరిత్ర"లో విపులంగా వర్ణించాడు. అనంతరం ఆ సంప్రదాయం ఆలంపూర్, శ్రీశైలం మరియు మరికొన్ని ఆలయాలలో నాలుగు దిక్కులలో నందులను శిల్పరూపంలో ఏర్పాటు చేసే విధానంగా అభివృద్ధి చెందింది.
ఈ విశిష్టమైన చతుర్ముఖ నందీశ్వర లింగం యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా ఆలయాధికారులు మరియు ప్రభుత్వం దాని సంరక్షణ చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను.