అందెశ్రీ అందించిన తెలంగాణ రాష్ట్ర గీతం ఇదే...
x

అందెశ్రీ అందించిన తెలంగాణ రాష్ట్ర గీతం ఇదే...

మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల పాట


2024 ఫిబ్రవరి 4 వ తేదీ ఆదివారం నాడు జరిగిన క్యాబినెట్ సమావేశం అందెశ్రీ రాసి ‘జయ జయహే తెలంగాణ’ని రాష్ట్రగీతం గా ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదించిన పాట ఇదే.


1) జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
జై తెలంగాణ.. జైజై తెలంగాణ

2) పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి
భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
హాలుని గాథాసప్త శతికి ఆయువులూదిన నేల
బృహత్కథల తెలంగాణ కోటి లింగాల కోన
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
జై తెలంగాణ.. జైజై తెలంగాణ

3) ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించాలని
తెలుగులో తొలి ప్రజాకవి ’పాలకుర్కి’ సోమన్న
రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని కట్టి
కవి రాజై వెలిగె దిశల ’కంచర్ల గోపన్న’
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
జై తెలంగాణ.. జైజై తెలంగాణ

4) కాళిదాసు కావ్యాలకు భావాలను రాసినట్టు
మల్లినాథ సూరి మా మెతుకు సీమ కన్నబిడ్డ
ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధువతడు
దిజ్ఞాగుని గన్న నేల ఢీకొట్టడమే జన్మహక్కు
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
జై తెలంగాణ.. జైజై తెలంగాణ

5) ’పోతన’దీ పురిటి గడ్డ ’రుద్రమ’దీ వీరగడ్డ
గండర గండడు ’కొమురం భీముడే’ నీ బిడ్డ
కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
జై తెలంగాణ.. జైజై తెలంగాణ

6) రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల
‘సర్వజ్ఞ సింగభూపాలుని’ బంగరు భూమి
వాణీ నా రాణి అంటు నినదించిన కవి కులరవి
పిల్లల మర్రి పిన వీరభద్రుడు మాలో రుద్రుడు
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
జై తెలంగాణ.. జైజై తెలంగాణ

7) సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు
సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు
ఉరూర పాటలైన ‘మీర సాబు’ వీరగాథ
దండు నడిపే పాలమూరు ‘పండుగోల్ల సాయన్న’
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
జై తెలంగాణ.. జైజై తెలంగాణ

8) కవిగాయక వైతాళిక కళల మంజీరాలు
డప్పు, ఢమరుకము, డక్కి, శారద స్వర నాదాలు
పల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ
అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
జై తెలంగాణ.. జైజై తెలంగాణ

9) జానపదా జనజీవన జావళీలు జాలువార
జాతిని జాగృతపరచే గీతాల జన జాతర
వేల కొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి
తరగనిదీ నీ త్యాగం మరుపనిదీ శ్రమయాగం
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
జై తెలంగాణ.. జైజై తెలంగాణ

10)బడుల గుడులతో పల్లెల ఒడులు పులకరించాలి
విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక
ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మ మెలగాలి
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
జై తెలంగాణ.. జైజై తెలంగాణ

11) సిరి వెలుగులు జిమ్మే సింగరేణి నల్ల బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం
సహజమైన మన సంపద సక్కనైన పువ్వుల పొద
సిరులుపండె సారమున్న మాగాణమె కదా నీ యెద
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
జై తెలంగాణ.. జైజై తెలంగాణ

12) గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలి
ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
***


Read More
Next Story