గ్రేటర్లో సెగలు పుట్టిస్తున్న ఏపీ ఎన్నికల వేడి
x
YCP and TDP

గ్రేటర్లో సెగలు పుట్టిస్తున్న ఏపీ ఎన్నికల వేడి

ఆంధ్రాలో ఎన్నికల వేడి విపరీతంగా పెరిగిపోతోంది. పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ ఆ వేడి గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి కూడా గట్టిగానే తగులుతోంది


ఆంధ్రాలో ఎన్నికల వేడి విపరీతంగా పెరిగిపోతోంది. పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ ఆ వేడి ఏపీ సరిహద్దులు దాటేసి గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి కూడా గట్టిగానే తగులుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో పోటీచేస్తున్న కొందరు అభ్యర్ధులు తమ ప్రచారిన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా చేస్తున్నారు. ఏపీ ఎన్నికలకు గ్రేటర్ హైదరాబాద్ కు ఏమిటి సంబంధం అనుకుంటున్నారా ? ఉంది, సంబంధం గట్టిగానే ఉంది. ఇంతకీ ఆ సంబంధం ఏమిటంటే సీమాంధ్రకు చెందిన లక్షలాదిమంది ఓటర్లు గ్రేటర్ హైదరాబాద్ లో ఉంటున్నారు. సంవత్సరాల క్రితమే సీమాంధ్రలోని వివిధ జిల్లాల నుండి తెలంగాణాకు వచ్చిన వారిలో గ్రేటర్ పరిధిలో ఎక్కువగా ఉంటున్నారు.

ఒక అంచనా ప్రకారం గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉంటున్నారు. ఏరియాలుగా తీసుకుంటే కూకట్ పల్లి, నిజాంపేట, కొంపల్లి, మియాపూర్, చందానగర్, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్ పేట, సరూర్ నగర్, బోడుప్పల్ లాంటి చాలా చోట్ల సీమాంధ్రులుంటున్నారు. వీరిలో చాలామందికి రెండు రాష్ట్రాల్లోను ఓట్లున్నాయి. తెలంగాణాలో జరుగుతున్నది పార్లమెంటు ఎన్నికలే కాబట్టి సీమాంధ్రుల దృష్టంతా ఏపీ మీదే ఉంది. అందుకనే సీమాంద్రలోని శ్రీకాకుళం, విజయవాడ, కాకినాడ, అమలాపురం, అనంతపురం, నెల్లూరు, కర్నూల్లాంటి నియోజకవర్గాల నుండి వీలుంటే అభ్యర్ధులు లేదా వారి తరపున ముఖ్యమైన నేతలు వచ్చి గ్రేటర్ ప్రాంతంలోని హోటళ్ళు, ఫంక్షన్ హాళ్ళు, కన్వెన్షన్ సెంటర్లలో శనివారం, ఆదివారాల్లో మీటింగులు పెట్టుకున్నారు. రాబోయే శని, ఆదివారాల్లో వచ్చి మీటింగులు పెట్టడానికి పై ఏరియాల్లోని ఫంక్షన్ హాళ్ళని అడ్వాన్స్ బుక్ చేసుకున్నట్లు సమాచారం.

ఎప్పుడైతే ఒకపార్టీ గ్రేటర్లో ప్రచారం మొదలుపెట్టిందో వెంటనే ప్రత్యర్ధి పార్టీ కూడా ప్రచారం మొదలుపెట్టేయటం సహజమే. గ్రేటర్ పరిధిలో ఉద్యోగాలు, ఐటి సెక్టార్, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, వృత్తినిపుణులుగా లక్షలమంది సీమాంధ్రులు నివసిస్తున్నారు. పైగా నియోజకవర్గాల్లోని అభ్యర్ధుల తరపున గ్రేటర్ పరిధిలో ఎంతమంది ఉంటున్నారన్న విషయాన్ని వాకాబు చేసి వారితో వాట్సప్ కాంటాక్టు పెట్టుకుని మీటింగులు పెట్టుకుంటున్నారు. మే 12వ తేదీకే నియోజకవర్గాలకు వచ్చేసి తమకు ఓట్లేయాలని వైసీపీ, టీడీపీ అభ్యర్ధులే గ్రేటర్ జనాలతో మీటింగులు పెట్టుకుంటున్నారు. ఎంతమంది నియోజకవర్గాలకు వస్తారో ముందుగానే చెబితే ప్రత్యేక బస్పులు లేదా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా అభ్యర్ధులు హామీలు ఇస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధిగా బత్తుల బలరామకృష్ణ పోటీచేస్తున్నారు. ఈయన తరపున ముఖ్యనేతలు మియాపూర్లోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. అనంతపురం జిల్లాలో పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్ధి కూడా నిజాంపేటలోని ఒక హోటల్లో తన నియోజకవర్గంలోని ఇక్కడి ఓటర్లతో విందు సమావేశం పెట్టుకున్నారు. కొందరు అభ్యర్ధుల తరపున ముఖ్యనేతలు గ్రేటర్ పరిధిలోని పై ప్రాంతాల్లో క్యాంపు వేసి నియోజకవర్గాల వారీగా ఓటర్లతో సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి సమావేశాలు ఎక్కువవుతుండటంతో హోటళ్ళు, కన్వెన్షన్ సెంటర్లు, ఫంక్షన్ హాళ్ళు శని, ఆదివారాల్లో కిటకిటలాడిపోతున్నాయి. ఏదేమైనా ఏపీ ఎన్నికల వేడి గ్రేటర్లో సెగలు పుట్టిస్తోందన్నది వాస్తవం.

Read More
Next Story