
అంజన్ కు ఆగ్రహం, కాంగ్రెస్ లో కలవరం
జూబ్లీహిల్స్ సీటు గొడవ. మంటలార్పేందుకు పరుగులుపెట్టిన నేతలు
జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ కుమార్ యాదవ్ కు ప్రకటించటంపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఫుల్లుగా ఫైరయ్యారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఉపఎన్నికలో తానుకూడా నామినేషన్ వేయబోతున్నట్లు అంజన్(Anjan kumar Yadav) చేసిన ప్రకటన పార్టీలో పెద్ద కలకలాన్ని రేపింది. వెంటనే మంత్రి గడ్డం వివేక్(Gaddam Vivek), తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మాజీఎంపీని కలిసి బుజ్జగింపులు మొదలుపెట్టారు. ఇంతకీ అంజన్ ఏమన్నారంటే జూబ్లీహిల్స్(Jubilee Hills by poll) టికెట్ ప్రకటించేముందు తనను సంప్రదించరా అని నిలదీశారు. తనకు టికెట్ రాకుండా ఎందుకు అడ్డుకున్నారంటు ఫైర్ అయ్యారు. టికెట్ రాకుండా అడ్డుకున్నది ఎవరనే విషయాన్ని తొందరలో నే బయటపెడతానని హెచ్చరించారు.
తొందరలో జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అధిష్ఠానం వల్లాల నవీన్ కుమార్ యాదవ్ ను అభ్యర్ధిగా ప్రకటించిన విషయం తెలిసిందే. టికెట్ కోసం అంజన్ కుమార్ యాదవ్ కూడా చివరివరకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే లోకల్-నాన్ లోకల్ కారణంతో అధిష్ఠానం నవీన్ వైపు మొగ్గుచూపింది. ఈ విషయాన్నే అంజన్ మాట్లాడుతు ఉపఎన్నిక సమయంలోనే లోకల్-నాన్ లోకల్ అనే అంశం ఎందుకు చర్చకు వచ్చిందని తీవ్రంగా ప్రశ్నించారు. ఉపఎన్నికలో పోటీకి తనకు అర్హతలేదా అన్నది తేల్చాలని డిమాండ్ చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు పనిచేసిన తనను ఎందుకు విస్మరించారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.
కామారెడ్డిలో పోటీచేసినపుడు లోకల్-నాన్ లోకల్ గుర్తుకురాలేదా అని అడిగారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఎనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పోటీచేసిన విషయం తెలిసిందే. కొడంగల్ నియోజకవర్గానికి స్ధానికుడు అయిన రేవంత్ కామారెడ్డికి నాన్ లోకలే కదా అన్నది ఇపుడు అంజన్ లాజిక్. అయితే పీసీసీ అధ్యక్షుడి హోదాలో, కేసీఆర్ ను ఓడించే వ్యూహంతోనే అప్పట్లో రేవంత్ కామారెడ్డిలో పోటీచేశాడు. అప్పట్లో రేవంత్ టార్గెట్ రీచయ్యాడు కూడా. కామారెడ్డిలో రేవంత్ గెలవకపోయినా కేసీఆర్ ఓడిపోయారు. తాను గెలవటం కన్నా కేసీఆర్ ఓడిపోవటమే అప్పట్లో రేవంత్ కు కావాల్సింది.
ఇపుడు అంజన్ లాజిక్ ఏమిటంటే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తాను కూడా ఏ నియోజకవర్గంలో అయినా పోటీచేయచ్చట. ఎక్కడినుండైనా పోటీచేయచ్చు కాని అధిష్ఠానం టికెట్ ఇవ్వాలికదా ? అప్పట్లో పీసీసీ అధ్యక్షుడైనా కామారెడ్డిలో రేవంత్ పోటీకి అధిష్ఠానం అంగీకరించింది కాబట్టే టికెట్ ఇచ్చింది. లేకపోతే ఒక్క కొడంగల్లో మాత్రమే పోటీచేసుండే వాడు. ఇపుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ ను పోటీచేయించాలని అనుకున్నది కాబట్టే అధిష్ఠానం అంజన్ ను పక్కకుపెట్టింది. ఏదేమైనా ఇపుడు అంజన్ చేసిన ప్రకటన ఎంత కలకలం రేపిందంటే వెంటనే మంత్రి గడ్డం వివేక్, ఇంచార్జి మీనాక్షి పరిగెత్తుకుంటు అంజన్ ఇంటికి వెళ్ళారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.