ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు.. కేటీఆర్‌పై మరో ఫిర్యాదు..
x

ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు.. కేటీఆర్‌పై మరో ఫిర్యాదు..

ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజు టెండర్ల విషయంలో భారీ అవకతవకలు జరిగాయంటూ బీసీ రాజకీయ ఐకాస అధ్యక్షుడు యుగంధర్ గౌడ్.. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజు టెండర్ల విషయంలో భారీ అవకతవకలు జరిగాయంటూ బీసీ రాజకీయ ఐకాస అధ్యక్షుడు యుగంధర్ గౌడ్.. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆర్ లీజు అంశంపై విచారణ జరిపి అవినీతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే ఫార్ములా ఈ-కార్ రేసు అంశంతో సతమవుతున్న కేటీఆర్‌కు ఈ ఫిర్యాదు మరో ఎదురుదెబ్బగా మారనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ పాపాలు పండాయని, అందుకే అన్నీ బయటకు వచ్చి చేసిన తప్పులు ఆయన మెడకు చెట్టుకుంటున్నాయంటూ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాగా తమ నేతను ఎదుర్కొనే దమ్ము, సత్తా లేకనే కాంగ్రెస్ కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. మరి ఓఆర్ఆర్ అంశంపై ఏసీబీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఫిర్యాదులో ఏముందంటే..

‘‘ఫార్ములా కేసుతోపాటు ఓఆర్ఆర్ అక్రమాలపై కూడా దర్యాప్తు జరపాలి. సీఎం‌, సీఎస్, ఈడీలతో పాటు ఈ రోజు ఏసీబికి ఫిర్యాదు చేశాం. ఓఆర్ఆర్ చుట్టూ మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా హెచ్ఎండీఏ చూసుకుంటుంది. ఆదాయం వచ్చే రోడ్డును మాత్రం కంపెనీలకు ఇచ్చారు. ఐఆర్బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 2023 ఏప్రిల్ నుండి ముపైఏళ్ళ పాటు ఓఆర్ఆర్‌ను లీజ్‌కు ఇచ్చారు. ఆ కంపెనీ 25 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. కైటెక్స్ గార్మెన్స్ సైతం ఎక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది. కైటెక్స్‌కు సైతం హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డలో భూకేటాయింపులు జరిగాయి. క్విడ్ ప్రోకో ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హెచ్ఎండీఏ నిధులపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. నిధులు దుర్వినియోగంలో అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాలి’’ అని యుగంధర్ తన ఫిర్యాదులో కోరారు.

ఇదిలా ఉంటే ఓఆర్ఆర్ విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. కేంద్రం తరహాలోనే తాము కూడా టోల్‌ను లీజుకు ఇచ్చి లాభం అర్జిస్తున్నామని చెప్పారు. ‘‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టివోటి విధానంలోనే అవుటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులను సేకరించాం. ప్రయివేట్ కంపెనీకి లబ్ది చేకూర్చినట్టు అరోపిస్తున్న రేవంత్ అ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయడం లేదు. గతంలో ఔవుటర్ రింగ్ రోడ్డు లీజుపైన రేవంత్ రెడ్డి మాట్లాడిన రూ.లక్ష కోట్ల అవినీతి అడ్డగోలు మాటలుపైన హెచ్ఎండిఏ పరువు నష్టం కేసు వేసింది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి పైన హెచ్ఎండిఏ వేసిన కేసు అలాగే ఉంది. ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్డు పైన అనేకసార్లు కుంభకోణం అని మాట్లాడారు. మరి ఎందుకు కుంభకోణం అంటున్న ఔవుటర్ రింగ్ రోడ్డు లీజ్‌ను రద్దు చేయడం లేదు. రేవంత్ రెడ్డి.. మున్సిపల్ శాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన కింద ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి. తన సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ చెప్పాలి’’ అని కేటీఆర్ కోరారు. ఈ అంశంపై ఆ తర్వాత పెద్దగా చర్చలు జరగలేదు. కాగా ఇప్పుడు రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరుకానున్న క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా మరో ఫిర్యాదు నమోదు కావడం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది.

Read More
Next Story