బీజాపూర్ అడవుల్లో మళ్లీ ఎన్ కౌంటర్
x
Another encounter in Bijapur Forest

బీజాపూర్ అడవుల్లో మళ్లీ ఎన్ కౌంటర్

బుధ, గురువారాల్లోజరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది మావోయిస్టులు మృతి


చత్తీస్ గడ్- బీజాపూర్ అడవుల్లో గురువారం మరో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనాస్థలిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత ఇదే భారీ ఎన్ కౌంటర్. బుధవారం ప్రారంభమైన ఎన్ కౌంటర్ గురువారం నాటికి భారీ ఎన్ కౌంటర్ గా మారిపోయింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గంగులూరు ప్రాంతంలోని అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.


ఈ నేపథ్యంలోనే బీజాపుర్‌-దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బుధవారం ఇరువర్గాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌) జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇద్దరు డిఆర్జీ జవాన్లు గాయపడ్డారు .మొత్తంగా బుధ, గురువారాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 19 మంది మావోయిస్టులు చనిపోయినట్టు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్దఎత్తున ఆయుధ, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.


మావోయిస్టు నేత మోడియం వెల్లా చనిపోయాడు: బస్తర్ రేంజ్ ఐజీ


బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు వెంబడి ఉన్న అడవిలో ఈ ఎదురుకాల్పులు జరిగాయని బస్తర్ రేంజ్ ఐజీ తెలిపారు. దంతెవాడ, బీజాపూర్ కు చెందిన డీఆర్జీ సిబ్బంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్, చత్తీస్ గడ్ పోలీసు విభాగాలు, కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్- సీఆర్పీఎఫ్ ఎలైట్ యూనిట్ ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించాయి.


ఎన్ కౌంటర్లో చనిపోయిన 12 మంది మావోయిస్టుల్లో మోడియం వెల్లాను మాత్రం గుర్తించినట్లు ఐజీ చెప్పారు. మిగిలిన మృతుల గుర్తింపు ప్రక్రియ సాగుతోందన్నారు. వెల్లా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ నెం.2 కమాండర్ గా పని చేస్తున్నాడు. 2020లో సుక్మాలో భద్రతా దళాలపై జరిగిన దాడుల్లో కూడా ఉన్నాడు. గెరిల్లా యుద్దంలో సిద్దహస్తుడని పోలీసులు తెలిపారు

గాయపడిన జవాన్లకు వెంటనే ప్రథమ చికిత్స అందించామని వారికి ప్రాణ భయం లేదని ఐజీ తెలిపారు. పశ్చిమ బస్తర్ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు.

చత్తీస్ గడ్ లో 275 మంది చనిపోయారు

ఈ ఏడాది ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లలో 275 మంది నక్సలైట్లు చనిపోయినట్టు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. వీరిలో బీజాపూర్, దంతెవాడ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్ లో 246 మంది చనిపోతే రాయ్ పూర్ డివిజన్ పరిధిలోని గరియాబంద్ జిల్లాలో మరో 27 మంది మృతి చెందినట్టు భద్రతాబలగాలు పేర్కొన్నాయి. దుర్గ్ డివిజన్ లోని మొహ్లామన్పూర్- అంబాగఢ్ చౌకీ జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఏడాది మావోయిస్టు కాల్పుల్లో 23 మంది భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెప్పారు.

ఘటనా స్థలం నుంచి ఒక లైట్ మెషిన్ గన్, సింగిల్ లోడింగ్ రైఫిల్స్ (ఎస్ఎల్ఆర్), ఇన్సాస్ రైఫిల్స్, .303 రైఫిల్స్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో బీజాపూర్ డీఆర్జీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మోను వడాడి, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేష్ సోధి మృతి చెందారు.

ఆపరేషన్ కగార్ తో కకావికలం

2026 మార్చి కల్లా మావోయిస్టు రహిత దేశంగా ప్రకటిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటిచించిన తర్వాత మావోయిస్టులు కకావికలం అవుతున్నారు. కేంద్ర ప్రకటించిన ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టుల లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లు పెరిగిపోయాయి.

దండకారణ్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సంభాల కేశవరావ్ తో పాటు ఎనిమిది మంది కేంద్ర కమిటీ సభ్యుల ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది.40 సంవత్సరాలు అడవుల్లో ఉన్నమల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి నేతలు జనజీవన స్రవంతిలో కల్సిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో నష్టాన్ని పూడ్చటానికి ఆయుధాలను త్యజించి ప్రజా జీవితంలో కలవాలని పార్టీ కేడర్ కు వారు పిలుపునిచ్చారు. మరో అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీని పోలీసుల అదుపులో ఉన్నట్టు ప్రజా సంఘాలు చెబుతున్నాయి. అతన్ని కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం విధించిన డెడ్ లైన్ కంటే నాలుగు నెలలముందే మావోయిస్టు పార్టీ తుది దశకు చేరుకుందని ప్రచారం జరుగుతోంది. మావోయిస్టు పార్టీ కూడా జనవరి నుంచి ఆయుధాలను త్యజించాలని నిర్ణయించుకోవడం దీనికి తార్కాణం అని చెప్పొచ్చు.

Read More
Next Story