Food Poison | తెలంగాణలో మళ్ళీ ఫుడ్ పాయిజన్.. కారణం ఏంటో చెప్పిన కలెక్టర్..
x

Food Poison | తెలంగాణలో మళ్ళీ ఫుడ్ పాయిజన్.. కారణం ఏంటో చెప్పిన కలెక్టర్..

తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఇటీవల ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్(Food Poison) కలకలం రేపింది. ఇటీవల ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టు(High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ కమిటీలు, టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అయినప్పటికీ తాజాగా నల్లగొండ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ ఘటనకు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్.. ఫుడ్ పాయిజన్‌ను ప్రభుత్వ పాఠశాలలో పెట్టిన ఆహారం కారణం కాదని తెలిపారు. దీంతో మరి ఫుడ్ పాయిజన్‌కు కారణం ఏంటనేది కీలకంగా మారింది.

నల్లగొండ జిల్లా దుగ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలోని విద్యార్థినిలు ఫుడ్ పాయిజన్ బారినపడ్డారు. మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థినిలు వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారికి హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వసతి గృహం యాజమాన్యులు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెళ్లి.. విద్యార్థినిలను పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను ఆరా తీశారు. అంతేకాకుండా విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘హాస్టల్ ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ జరగలేదు. రెండు మూడు రోజుల నుంచి విద్యార్థులు సరిగా ఆహారం తీసుకోలేదు. దాంతో వారు నీరసంగా ఉన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది’’ అని చెప్పారు. కానీ బాలికలు మాత్రం.. అలా ఏమీ కాదని, తమకు పెట్టిన ఆహారం వల్లే అస్వస్థతకు గురయ్యామని చెప్తున్నారు.

ప్రభుత్వ చర్యలేవి..

తెలంగాణ వ్యాప్తంగా వరుస ఫుడ్ పాయిజన్(Food Poison) ఘటనలు సంభవించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పాఠశాలలు, అంగన్వాడీలు, గురుకులాలు, వసతిగృహాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సీఎస్ శాంతకుమారి(Santhakumari).. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఆహారం వికటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లల జీవితాలంటే లెక్కలేదా అంటూ అధికారులపై మండిపడింది. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి వడ్డించే ఆహారం విషయంలో నాణ్యత లోపించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ విషయంలో తుది నిర్ణయం కేవలం పాఠశాల యాజమాన్యాలకే వదిలేది లేదని, ఎప్పటికప్పుడు పాఠశాలల్లో ఆహార నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో బాగంగానే పాఠశాలల్లో అందించే ఆహార నాణ్యతను తనిఖీ చేయడం కోసం ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ కమిటీ విద్యా సంస్థల్లో అందించే ఆహార పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే చర్యలు చేపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

దీంతో పాటుగానే విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా చూసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారి ఉంటారు. ఈ బృందాలు అన్ని విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వసతిగృహాలు, అంగన్వాడీల్లో ఆహార నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ జరిగినట్లు తేలితే వెంటనే అక్కడకు చేరుకుని అందుకు గల కారణాలను కనుగొంటుంది. అంతేకాకుండా బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు చేపడుతుందని కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాల్లో సీఎస్ శాంతకుమారి తెలిపారు. ఇన్ని ఆదేశాలు విడుదల చేసిన తర్వాత కూడా ఇప్పుడు మరో ఫుడ్ పాయిజన్ ఘటన సంభవించడం సంచలనంగా మారింది. కానీ ఇప్పుడు నల్గొండలో ఫుడ్ పాయిజన్ ఘటన జరగడం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. మరి ఫుడ్ పాయిజన్‌పై ఇన్ని రోజులు ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఫుడ్ పాయిజన్‌పై సీఎం ఏమన్నారంటే..

‘‘విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌషికాహారం అందించాలి. వారికి మంచి విద్యా అందించాలన్న ఉద్దేశంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేశాం. అదే విధంగా విద్యార్థులకు ఆహారం కూడా నాణ్యమైనది అందించాలని డైట్ ఛార్జీలు పెంచాం. ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై కలెక్టర్ వేటు వేయాలి. వదంతులతో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఈ విషయంలో నిర్లక్ష్యం, అలసత్వం కనబరిచినట్లు రుజువైతే సదరు అధికారులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తరచూ తనిఖీలు చేయండి. విద్యార్థులకు పెట్టే ఆహారం తయారు చేస్తున్న పరిసరాలు, సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అదే విధంగా విద్యార్థులకు అందించే తాగు నీరు కూడా కలుషితం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Read More
Next Story