
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి..
బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు.
అమెరికాలో దుండగుల కాల్పులకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతుండటం ఉన్నత చదువుల కోసం అమెరికాకకు వెళ్తానంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాదిలోనే దుండగులు జరిపిన కాల్పులకు దాదాపు ముగ్గురు తెలంగాణ విద్యార్థులు బలయ్యారు. అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చార్ అధికంగా ఉండటమే ఇందుకు కారణమని కొందరు అంటున్నారు. అయితే తాజాగా మరో తెలంగాణ విద్యార్థి.. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన డల్లాస్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీడీఎస్ పూర్తి చేసిన హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్.. ఉన్నత చదువులు కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడే అతడు ఓ పెట్రోల్ బంక్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలానే ఉద్యోగానికి వెళ్లాడు చంద్రశేఖర్. అప్పుడే ఓ వ్యక్తి పెట్రోల్ కోసం వచ్చి కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో చంద్రశేఖర్ అక్కడిక్కడమే మరణించాడు.
అయితే తెలంగాణలో బాధిత విద్యార్థి కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ‘‘బీడీఎస్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీష్ రావు తెలిపారు.
పార్ట్‌టైమ్ జాబ్ చేస్తుండగా దారుణం..
ఈ ఏడాది మర్చి నెలలో తెలంగాణ రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్ అనే 27 ఏళ్ల యువకుడు మరణించాడు. ప్రవీణ్.. విస్కాన్సిన్ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ మిల్వాకీలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతడు ఓ మాల్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ స్టోర్ లో దుండగులు దోపిడీకి యత్నించిన క్రమంలో… ప్రవీణ్ కుమార్ కాల్పులకు గురయ్యాడు. ఈ ఘటనలో ప్రవీణ్ మరణించాడు.
ఇటీవల గత నెల సెప్టెంబర్‌లో కూడా ఇండియాకు చెందిన ఓ ఇంజినీర్.. కాలిఫోర్నియాలో జరిగిన పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణకు చెందిన మహ్మద్ నిజాముద్దీన్(29) అమెరికాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 3న అతనికి తన రూమ్‌మేట్‌తో గొడవ జరిగింది. ఆ తర్వాత శాంటాక్లారా పోలీసులు అతడిని కాల్చి హతమార్చారు. అయితే నిజాముద్దీన్ ఉన్నత విద్యా కోసం 2016లో అమెరికాకు వెళ్లాడు. అక్కడే ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. సెప్టెంబర్ 3న రూమ్‌మేట్‌తో జరిగిన గొడవ.. కత్తిపోట్లకు వరకు వెళ్లింది. పోలీసులు వచ్చే సమయానికి నిజాముద్దీన్.. తన రూమ్‌మేట్‌పై కత్తితో దాడి చేస్తున్నాడు. దాంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. నాలుగు బుల్లెట్లు తగలడంతో నిజాముద్దీన్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.