ఘట్‌కేసర్ కేసులో మరో ట్విస్ట్.. వేధింపులు తట్టుకోలేకే..
x

ఘట్‌కేసర్ కేసులో మరో ట్విస్ట్.. వేధింపులు తట్టుకోలేకే..

ఘట్‌కేసర్ పరిధిలోని ఘన్‌పూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో జనవరి 6న ఘోర ప్రమాదం జరిగింది.


ఘట్‌కేసర్ పరిధిలోని ఘన్‌పూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో జనవరి 6న ఘోర ప్రమాదం జరిగింది. ఒక కారు దగ్దమైంది. అందులో ఇద్దరు సజీవదహనమయ్యారు. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. ముందుగా దీనిని తీవ్ర ప్రమాదంగా భావించినప్పటికీ దర్యాప్తు చేసే కొద్ది నమ్మలేని విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాగా కారులో సజీవదహనమ ఇద్దరూ ప్రేమికులుగా పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్ది విస్తుపోయే నిజాలు బహిర్గతమవుతున్నాయి. మృతుల్లో 16ఏళ్ల బాలిక కూడా ఉందని, ఆ అమ్మాయికి అన్న వరుస అయ్యే వ్యక్తి వేధింపులు తట్టుకోలేకనే వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వారి ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడని, డబ్బులు కూడా వసూలు చేశాడని, అయినా వేధింపులు ఆపకపోవడంతో మనస్థాపానికి గురయ్యే సదరు జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం.. ఈ ఘటనలో మరణించిన అమ్మాయిని ఘట్‌కేసర్ మండలం నారపల్లికి చెందిన బాలిక(16) అని, ఇంటర్ తొలి సంవత్సరం చదువుతుందని చెప్పారు. అదే విధంగా అబ్బాయి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం జమిలాపేట్‌కు చెందిన శ్రీరాములు(25)గా చెప్పాడు. అబ్బాయి తండ్రి సైకిల్ షాపు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా శ్రీరాములు, బాలిక ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ విషయంలో ముంత మహేష్ అనే వ్యక్తికి తెలిసింది. అతడు బాలికకు అన్న వరుస అవుతాడు. దీనిని మంచి అదునుగా భావించిన మహేష్.. వీరిద్దరి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇద్దరినీ వేధిస్తూ వారి దగ్గర నుంచి దాదాపు రూ.1.35 లక్షలు వసూలు చేశాడు. అయినా తన వేధింపులు ఆపలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో తీవ్ర నిరాశకు గురై సూసైడ్ చేసుకోవాలని నిశ్చయించుకున్నారని పోలీసులు తెలిపారు.

జనవరి 6న జరిగిందిదే..

జనవరి 6న బాలికను తండ్రి నారపల్లి సమీపంలోని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్లాడు. కొద్దిసేపటికే శ్రీరాములు అక్కడకు కారులో వచ్చాడు. శ్రీరాములతో కలిసి బాలిక బయటకు వెళ్లింది. వారిద్దరూ ఆరోజు సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో కలిసి తిరిగారు. సాయంత్రం 5 గంటల సమయంలో అన్నోజిగూడలోని ఓ దుకాణంలో 20లీటర్ల వాటర్ క్యాన్ కొనుగోలు చేశారు. ఆ బాటిల్‌ను ఖాళీ చేసి అందులో సుమారు 15 లీటర్ల పెట్రోల్ కొట్టించారు. అనంతరం అక్కడి నుంచి జనసంచారం లేని ఘట్‌కేసర్ సర్వీసులోకి వెళ్లారు. అక్కడే కారులోనే సూసైడ్ చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందే బాలిక శ్రీరాములు ఫోన్ నుంచి తమ లొకేషన్‌ను తన తండ్రికి పంపింది. మూడు పేజీల సూసైడ్ నోట్‌ను కూడా వాట్సాప్‌లో తండ్రికి పంపింది. ఆ మెసేజ్ చూసి తీవ్ర ఆందోళనకు గురైన బాలిక తండ్రి ఆగమేఘాలపై సదరు లొకేషన్‌కు చేరుకున్నారు. కాగా అప్పటికే కారు, కారులో వారిద్దరు సజీవదహనమయ్యారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిద్దరి మృతికి కారణమైన మహేష్ అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకి కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

Read More
Next Story