హైదరాబాద్ శివార్లలో మరో జూ పార్క్
x

హైదరాబాద్ శివార్లలో మరో జూ పార్క్

హైదరాబాద్ శివార్లలో మరో జంతుప్రదర్శనశాల రానుంది.కొత్త జూ పార్కును ఏర్పాటు చేయాలని సీఎం ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.జంతుప్రేమికులు సంతోషపడుతున్నారు.


హైదరాబాద్ నగరంలోని జంతుప్రేమికులకు శుభవార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో హైదరాబాద్ నగర శివార్లలో మరో జూపార్కు ఏర్పాటు కానుంది. నగర శివార్లలో వెయ్యి ఎకరాల్లో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ కొత్త జూపార్కును నిర్మించాలని సీఎం కోరారు.

- కొత్త జంతుప్రదర్శనశాలకు ఇతర ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకురావాలని, దాని చుట్టూ అర్బన్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.
- గుజరాత్‌ రాష్ట్రంలోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ ఏర్పాటు చేసిన వంటరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి పొందిన స్ఫూర్తితో ఈ ప్రాజెక్టుకు సహకరించాలని పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పురాతన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, అటవీ ప్రాంతాలను సందర్శకులకు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను నిర్వహించడంతోపాటు ఎంపిక చేసిన ప్రదేశాల్లో రాత్రిపూట కాటేజీలను అభివృద్ధి చేసే అవకాశాలను అన్వేషించాలని సీఎం సూచించారు.
- హైదరాబాద్ నగరంలోని పాత బస్తీ బహదూర్‌పురాలోని మీర్ ఆలం ట్యాంక్ సమీపంలో 380 ఎకరాల్లో ఉన్న నెహ్రూ జూ పార్క్ 1963వ సంవత్సరంలో ప్రారంభించారు. పబ్లిక్ గార్డెన్స్ నుంచి పూర్వపు జూ ఎన్‌క్లోజర్‌లను మార్చిన మీరాలం ట్యాంకు చెంత జంతుప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. జూ పార్క్ మీరాలం ట్యాంక్ బండ్‌కు ఆనుకుని ఉంది.

ఎన్నెన్నో జంతువులు
హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌లో ప్రస్తుతం 55 జాతులకు చెందిన 664 క్షీరదాలు, 97 జాతులకు చెందిన 1227 పక్షులు, 38 జాతులకు చెందిన 341 సరీసృపాలు, రెండుజాతులకు చెందిన 8 ఉభయచరాలు సహా మొత్తం 2,240 జంతువులు ఉన్నాయి.జూ పార్కు సహజ ప్రకృతి రమణీయతతో పలు వలస పక్షులను ఆకర్షిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల సంరక్షణ సంస్థలతో పాటు జంతుప్రేమికులు జంతువులను దత్తత తీసుకోవడాన్ని జూ అనుమతిస్తుంది.

నెహ్రూ జూ పార్కులో ఖడ్గమృగాల కోసం సర్వో నైట్ హౌస్
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతుప్రదర్శనశాలలో ఖడ్గ మృగాల కోంస సర్వో నైట్ హౌస్ నిర్మించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఖడ్గమృగాల కోసం క్రాల్ సదుపాయంతో కూడిన సర్వో నైట్ హౌస్‌ను నిర్మించారు. సామాజిక బాధ్యత కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ఖడ్గ మృగాల సంతానోత్పత్తికి ఉపయోగపడేలా నైట్ హౌస్ నిర్మించారు. ఈ నైట్ హౌస్ ను జూ పార్క్స్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరేమత్‌కు అందజేశారు.


Read More
Next Story