హైదరాబాద్ గర్వకారణమే, కాని, కాపాడుకోవడం ఎట్లా?
x

హైదరాబాద్ గర్వకారణమే, కాని, కాపాడుకోవడం ఎట్లా?

దేశానికి రెండో రాజధాని చేయాలని చాలా మంది అరుస్తున్నారు. బాగుంది. కాని హైదరాబాద్ చుట్టూర సాగుతున్న విధ్వంసం గురించీ మాట్లాడాలి. పరిస్థితి చేజారి పోయేలా ఉందంటున్నారు రమణా చారి


-రమణాచారి


హైదరాబాద్ ప్రజలు భుజాలకు ఆక్సిజన్ సిలిండర్లను తగిలించుకుని తిరగవలసి రావడం అనివార్య మేనా? రెండు దశాబ్దాల క్రితం వరకు మంచినీళ్లు బాటిళ్లలో కొనుక్కొని తాగుతామని అనుకున్నామా? కానీ నిజమైంది కదా! ఇప్పుడు మౌనం వహిస్తే మాత్రం త్వరలో ఆక్సిజన్ కోసం, సిలిండర్ గాలి పీల్చుకోవడమే. వేగంగా విస్తరిస్తున్న జంట నగరాల ప్రజల పరిస్థితి అలాగే ఉండబోతుంది.

అభివృద్ధి పేరిట ఏర్పాటు అవుతున్న పరిశ్రమలు, ఆధునీకరణలతో హైదరాబాద్ కాలుష్య కాసారం అవుతుంది. అడవుల ధ్వంసం, రింగ్ రోడ్లు, ఫిలిం సిటీ లు,SEZ ఏర్పాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఇందులో భాగమే. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి హైదరాబాద్ ప్రజలు పూర్తిగా మాస్కులతోనే తిరగవలసి ఉంటుందన్నది నిష్టూర సత్యం. హైదరాబాద్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ 3000 ఎకరాలలో విస్తరించి ఉంది. దీనిలో 2900 ఎకరాల ఫారెస్ట్ ను లోఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ఇండియన్ నేవీ కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిలో రాడార్ ఆంటినా పార్క్ తో పాటు, టౌన్షిప్ ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే రియల్ ఎస్టేట్ రాబందులు వాలి మరింత ధ్వంసానికి పాల్పడతాయి. దీనికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ కూడా ప్రమాదంలోపడే అవకాశం ఉంది. ఇప్పుడు పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం, త్వరలో కాంక్రీట్ జంగల్ గా మారుతుంది. దీనివలన 20 గ్రాములు,60 వేల అమాయక ప్రజల జీవితాలు అగమ్య గోచరమవుతాయి. దీనిపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. గతంలో తిరునల్వేలి లో నిర్మించిన కట్ట బొమ్మన్ రాడారు స్టేషన్ తో ప్రజలకు ఇబ్బంది కలగనందున ఎలాంటి వ్యతిరేకత రాలేదు. దీనికంటే 100 రేట్లు శక్తివంతమైన రాడార్ స్టేషన్ ను ఇక్కడ నిర్మించాలనుకుంటున్నారు. జరగబోయే నష్టం ఏస్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టం. ఈ రిజర్వ్ ఫారెస్ట్ 12 లక్షల పచ్చని చెట్లతో విస్తరించి, రాష్ట్ర రాజధాని ప్రజానీకంతో పాటు, పరిసర జిల్లాలకు ఆక్సిజన్ అందిస్తున్నది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఊపిరితిత్తులలా ఉపయోగ పడుతుంది. నిజానికి ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూమి అటు ప్రభుత్వానికి కానీ , ఇటు అటవీ శాఖకు కానీ చెందినది కాదు. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయ భూములు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం అన్యాక్రాంతం చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడచూస్తుందని అర్థం అవుతుంది.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. గాలి కాలుష్యం, రహదారుల కాలుష్యం, ఫ్యాక్టరీల కాలుష్యం, వ్యర్ధాలను తగలబెట్టడం ద్వారా విడుదలయ్యే కాలుష్యం, వాహనాల కాలుష్యం, నిర్మాణాల కాలుష్యం, నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దేశంలోని కాలుష్య నగరాలలో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండగా, హైదరాబాదు నాలుగో స్థానంలో ఉంది. WHO నివేదిక ప్రకారం గాలి కాలుష్యం రేటు 1.7 రేట్లు అధికంగా ఉంది. దీనివలన భూతాపం కూడా పెరిగింది. మోసీ నది ప్రక్షాళన కోసం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. చెరువుల దురాక్రమణకు వ్యతిరేకంగా హైడ్రాను తీసుకొచ్చారు. హరితహారం, వన మహోత్సవం నినాదాలతో హోరెత్తిస్తూ ఇంకొక ప్రక్క అడవుల ధ్వంసానికి అనుమతిలిస్తూ పాలకులు ద్వందనీతి పాటిస్తున్నారు.

రామోజీ ఫిలిం సిటీకి వందల ఎకరాల రాచకొండ అటవీ భూములను కట్టబెట్టి నాశనం చేయ చూస్తున్నారు. ఫార్మా సిటీ పేరిట వందలాది ఎకరాల భూములు కాలుష్యం కానున్నాయి. ప్రస్తుత హైకోర్టుకు పార్కింగ్ స్థలం చాలడం లేదనే నెపంతో రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టు కొత్త భవనానికి కేటాయించి శంకుస్థాపన చేశారు. రింగురోడ్ల నిర్మాణాలతో వ్యవసాయ భూములు, చెట్లు ధ్వంసం అవుతాయి. పట్టణీకరణ కారణంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దాహార్తికి ఇప్పటికే వేలాది ఎకరాలు సిమెంట్ కమ్యూనిటీలుగా మారాయి. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఈ ప్రమాద బారిన పడతాయి. ఈ కారణంగా నిర్వాసిత్వ సమస్యకూడా తలెత్తుతుంది

అటవీ భూముల ఆక్రమణలతో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులు, మైనింగ్, గుట్టల తవ్వకాల అనుమతులతో పర్యావరణ కాలుష్యం, వలన ఏర్పడిన నిర్వాసిత్వ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దామగుండం రిజర్ ఫారెస్ట్ను రాడార్ స్టేషన్ కు అప్పగిస్తే మూసీ నది జన్మస్థలం అంతర్దానం అయ్యే ప్రమాదం ఉంది. చత్తీస్గడ్ అడవిలో అదాని ప్రాజెక్టు పూర్తయితే,హస్డియో నది కనుమరుగవుతుంది.పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంతో లక్షలాది ఆదివాసీ నిర్వాసితులయ్యారు. శబరి నది ఉనికిలో లేకుండా పోతుంది.ప్రజలు ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా శతాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. పాలకుల అనాలోచిత నిర్ణయాలు కార్పొరేట్ శక్తులకు సంపదను చేకూరుస్తున్నాయి. ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఇప్పుడైనా పర్యావరణవేత్తలు, బుద్ధి జీవులు,న్యాయవాదులు,విద్యార్థులు, ప్రజాసంఘాలు, పౌర ప్రజాస్వామికవాదులు కలిసికట్టుగా ఉద్యమిస్తే తప్ప ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడం సాధ్యపడదు. ఈ విధ్వంసక అభివృద్ధికి వ్యతిరేకంగా నోరు విప్పకపోతే భవిష్యత్ తరాలు తీవ్ర ప్రమాదం లో పడడం ఖాయం. కనీసం తరాల మనుగడ కోసమైనా పోరాటాలకు నడుం కట్టి ముందుకు కదలడం అనివార్యం. కేవలం 300 చెట్ల పరిరక్షణ కోసం జరిగిన చిప్కో ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం , స్ఫూర్తి పొందడం ఈ సందర్భంలో ఎంతైనా అవసరం. రాజకీయాలకతీతంగా పాలకులను ఎక్కడికక్కడ నిలదీసి ప్రశ్నించే చైతన్యం కొరబడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ప్రజలారా! పారాహుషార్!!


Read More
Next Story