ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎన్నారైలు ప్రేమతో..అదిరిపోయే బహుమతి
x
పవన్ కల్యాణ్ కోసం చేనేత దుస్తులు నేస్తున్న హరి దంపతులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎన్నారైలు ప్రేమతో..అదిరిపోయే బహుమతి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇద్దరు ఎన్నారై అభిమానులు ఆగస్టు 7వతేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అదిరిపోయే బహుమతి అందించనున్నారు. ఏమా బహుమతి? ఏమా కథ...


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్‌కు చేనేత వస్త్రాలంటే ఎంతో ఇష్టం. అందుకే అమెరికా దేశంలోని అట్లాంటా నగరానికి చెందిన పవన్ వీరాభిమాని మహారాణా ఆగస్టు 7వతేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయనకు విశిష్ఠ బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

- హైదరాబాద్ నగరానికి చెందిన మహారాణా, ఎనగంటి కిరణ్ అమెరికా దేశంలోని అట్లాంటాలో నివాసముంటూ ఐటీరంగంలో పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్ వీరాభిమానులు అట్లాంటాలో జనసేన విభాగాన్ని ఏర్పాటు చేసి నిత్యం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మహారాణా స్వస్థలం ఏపీలోని తాళ్లపుడి గ్రామం, ఈయన పవన్ అభిమాని.
- పవన్ కల్యాణ్ కు చేనేత వస్త్రాలన్నా, చేనేత కార్మికుల సంక్షేమం అన్నా ఎంతో ఇష్టం. తమ ఆరాధ్య నాయకుడు పవన్ ఇష్టాన్ని తెలుసుకున్న ఎన్నారైలు సిరిసిల్ల చేనేత కార్మికులతో ప్రత్యేకంగా రెండు జతల చేనేత దుస్తులు తయారు చేయించారు.
- జనసేన లోగోతోపాటు చేనేత మగ్గంపై మూడు నెలల పాటు శ్రమించి నేసిన చేనేత వస్త్రంతో డ్రెస్సులు సిద్ధం చేయించి, వాటిని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వతేదీన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అందజేయనున్నారు.

సిరిసిల్ల చేనేత కార్మికుడికి ఎన్నారైల ఆర్డర్
సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ దంపతులు చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జ్ఞాపికను తయారుచేశారు. దాన్ని చూసిన అమెరికాలోని అట్లాంటాకు చెందిన పవన్ అభిమానులు మహారాణా, ఎనగంటి కిరణ్ తన చేనేత కళను చూసి పవన్ కళ్యాణ్ గారికి చేనేత మగ్గంపై నేసిన వస్త్రాలు తయారు చేయమని ఐదు లక్షల రూపాయల విలువగల ఆర్డర్ ను ఇచ్చారని వెల్ది హరిప్రసాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఆర్డర్ తీసుకున్న హరిప్రసాద్ దంపతులు 25 రోజులపాటు శ్రమించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా డ్రస్సులు నేసి వారికి పంపించారు.

రాట్నంపై దారపుకండ సిద్ధం చేస్తున్న చేనేత కార్మికురాలు వెల్లండి రేఖ

చేనేత మగ్గంపై నేసిన వస్త్రాల వివరాలు
వెల్ది హరిప్రసాద్, రేఖ దంపతులు 25 రోజులపాటు శ్రమించి పవన్ కోసం దుస్తులు నేశారు. ఇందులో జనసేన లోగో రావడానికి డిజైన్ ప్రకారం తాళ్లు కట్టుకోవడానికి ఐదు రోజుల సమయం పట్టిందని హరిప్రసాద్ చెప్పారు.దీని కోసం వార్పు కాటన్ 100 నంబర్ దారం లడీలుగా తీసుకొని వార్పు తయారు చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. లెనిన్ దారం ఉపయోగించి పేక మాలను రాట్నంతో ఊసలపై తన భార్య రేఖ చుట్టిచ్చిన దారపు కండలతో చేనేత మగ్గం పై నేశానని చెప్పారు.

చేనేత మగ్గంపై లెనిన్ దుస్తులు
పవన్ షర్టుపై జనసేన లోగో కు పట్టు దారం రెడ్ కలరు, బ్లాక్ కలరు ఉపయోగించి లోగో అయిపోయే వరకు పూర్తిగా చేతులతో ఈ దారాలు పెట్టి నేశానని హరిప్రసాద్ వివరించారు. పవన్ కల్యాణ్ కోసం ఒక షర్ట్ నేయడానికి 15 రోజుల సమయం పట్టిందని ఆయన తెలిపారు. లెనిన్ డ్రెస్ ను చేనేత మగ్గంపై నేసిన హరి ప్రసాద్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఈ సంవత్సరం సిరిసిల్లలోనే మొట్టమొదటిసారిగా చేనేత మగ్గంపై లెనిన్ వస్త్రాల ఉత్పత్తిని హరిప్రసాద్ దంపతులు ప్రారంభించారు.


పవన్ కల్యాణ్ దుస్తుల ప్యాక్ చూపిస్తున్న చేనేత కార్మికుడు హరిప్రసాద్


ఎంతో సంతృప్తినిచ్చింది : మహారాణా, ఎనగంటి కిరణ్

మా ఆరాధ్య దైవం పవన్ కల్యాణ్ కోసం సిరిసిల్ల చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చేనేత దుస్తులు తయారు చేయించడం మాకెంతో సంతృప్తి అభించిందని మహారాణా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అమెరికాలోని అట్లాంటాకు చెందిన వారితో ఫెడరల్ తెలంగాణ ప్రతినిధి మాట్లాడారు. ప్రజల కోసం సేవలు చేస్తున్న పవన్ కోసం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత దుస్తులు అందించడం మాకెంతో షంతోషంగా ఉందని ఆయన చెప్పారు.

జాతీయ చేనేత దినోత్సవం ఎందుకంటే...
జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 7 వతేదీన భారతదేశం అంతటా జరుపుకుంటారు. చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రాథమిక లక్ష్యం చేనేతను ప్రోత్సహించడం, చేనేత ఈ రంగంలో నిమగ్నమైన నేత కార్మికుల ప్రయత్నాలను నైపుణ్యాలను గుర్తించడం ప్రధాన ఉద్ధేశం.పూర్వ వైవిధ్య సంస్కృతి చేనేత వస్త్రాలను మనం ఆదరించాలి.

చేనేత ఛాలెంజ్ స్వీకరించిన పవన్
గతంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అప్పటి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను జనసేనాధిపతి పవన్ కల్యాణ్ స్వీకరించారు.పవన్ చేనేత వస్త్రాలు ధరించి, ఆ ఫొటోలను ఎక్స్ పోస్టులో పోస్టు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో అహింసాయుత ఆయుధంగా చేనేత ఉపయోగపడిందని పవన్ కల్యాణ్ చెప్పారు. అర్ధాకలితో జీవనం సాగిస్తున్న చేనేత కార్మికులకు తాను జీవితంతం బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని పవన్ గతంలో ప్రకటించారు.

పవన్ కల్యాణ్ కోసం నేసిన దుస్తులు


చాలా సంతోషంగా ఉంది : చేనేత కార్మికుడు హరిప్రసాద్ దంపతులు

‘‘లెనిన్ చేనేత వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం చేనేత మగ్గంపై నేయడం మాకెంతో సంతోషంగా ఉంది. లెనిన్ చేనేత వస్త్రాలు తయారు చేయడానికి మాకు ఆర్డర్ ఇచ్చిన మహారాణా,కిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’అని హరిప్రసాద్, రేఖ దంపతులు చెప్పారు.


Read More
Next Story