తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల్లో  ఆంధ్రోళ్లదే హవా
x

తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల్లో ఆంధ్రోళ్లదే హవా

సరిహద్దు నియోజకవర్గాలు అయిన కోదాడ, హుజుర్నగర్, ఖమ్మం నియోజక వర్గాలపై ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయాలు ప్రభావం చూపుతూ వస్తున్నాయి.


సరిహద్దు నియోజకవర్గాలు అయిన కోదాడ, హుజూర్ నగర్, ఖమ్మం నియోజకవర్గాలపై ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు ప్రభావం చూపుతూ వస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా ఇది రుజువైంది. దీనికి కారణం భౌగోళిక సామీప్యత, సాంస్కృతిక సారూప్యత.

ఇదే ఒరవడి రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది అనటంలో సందేహం లేదు. నల్గొండ లోక్ సభ స్థానం పరిధిలోకి కోదాడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ శాసనసభ స్థానాలు వస్తాయి. నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఏడు శాసనసభ స్థానాలలో దాదాపు సగం ఆంధ్రా రాజకీయ ప్రభావం చూపేవి ఉండటంతో ఎన్నికల ఫలితంపై ప్రభావం పడనుంది.

2018 లో జరిగిన హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్యాడర్ బాహాటంగానే బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కి మద్దతు ప్రకటించి, ప్రచారంలో సైతం పాల్గొన్నారు. ఈ ఉపఎన్నికల్లో సైది రెడ్డి 43,358 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

టీడీపీ నాయకుడు బొల్లం మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్ లో చేరి కోదాడ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 2018 ఎన్నికల్లో 756 ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ క్యాడర్ రహస్య మద్దతు లేకుంటే ఆ ఎన్నికల్లో పరాభవం పొందేవారు.

2003 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఈ నియోజకవర్గాలలో కాంగ్రెస్ కు మద్దతు తెలిపి, ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకి కృషి చేశారు. 2009, 1994, 1989, 1985 లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోదాడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కోదాడ నియోజకవర్గం గతంలో టీడీపీకి పెట్టని కోట గా ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా టీడీపీ క్యాడర్ బలమైన ఉనికిని చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల పొత్తు కూడా కోదాడ నియోజకవర్గంలో లోక్ సభ ఎన్నికలలో పోలింగ్ సరళిపై ప్రభావం చూపుతుండటం విస్పష్టం.

హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభిమానులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. కోదాడ, హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు వివిధ అవసరాలకు ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ రాకపోకలు సాగిస్తారు. వారి భాష, ఆచార వ్యవహారాలు కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలను పోలి ఉంటుంది. దీంతో ఈ నియోజవర్గాల ప్రజలు సహజంగానే ఏపి వ్యవహారాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఇది ఈ నియోజకవర్గాలలో లోక్ సభ ఎన్నికల్లో గతంలోలా ప్రభావం చూపవచ్చు.

బీఆర్ఎస్ ప్రవాస భారతీయల శాఖ నేత, కోదాడకు చెందిన జలగం సుధీర్ మాట్లాడుతూ.. "కుల సమీకరణాలు కూడా, కోదాడలో ఆంధ్ర ప్రాంతంతో పోలి ఉంటాయి. కోదాడ వారి వివాహ సంబంధాలు కూడా ఏపీ ప్రాంతం వారితో ఎక్కువ ఉంటాయి. వ్యాపార, ఇతర అవసరాల కోసం కూడా కోదాడ ప్రజలు హైదరాబాద్ కంటే విజయవాడ, గుంటూరుల పై ఎక్కువ ఆధారపడతారు".

సామాజిక సేవా కార్యకర్త, టైపింగ్ మాస్టర్ గా కోదాడ ప్రజలకు సుపరిచితుడు అయిన హుస్సేన్ మాట్లాడుతూ "స్వాతంత్య్రానికి ముందు కోదాడ ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉన్న ఆంధ్రా ప్రాంతంతో కలిసిన ఉండేది. మానసికంగా ఈ ప్రాంతం వారు ఆంధ్రా ప్రాంతంతో దగ్గరగా ఉంటారు. ఇదే రాజకీయాలలో కూడా ప్రతిబింబిస్తుంది" అని అన్నారు.

Read More
Next Story