శ్రీవారి లడ్డులో జంతు కొవ్వు: నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలి
x
IYR Krishna Rao

శ్రీవారి లడ్డులో జంతు కొవ్వు: నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలి

కూటమిలోని బీజేపీ నేత, టీటీడీ ఈవోగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఇపుడు కలకలం సృష్టిస్తున్నాయి.


తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో నాసిరక వస్తువులు వాడటంతో పాటు జంతు కొవ్వును ఉపయోగించినట్లు చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలు దేశంలో సంచలనం సృష్టిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా చంద్రబాబు ఆరోపణలు చేశారుకాని అందుకు తగ్గ ఆధారాలను మాత్రం చూపించలేకపోయారు. అయితే చంద్రబాబు ఆరోపణలకు మద్దతుగా టీడీపీలోని కొందరు నేతలు మాత్రం మీడియా ముందుకొచ్చి నానా గోల చేస్తున్నారు. స్పందించాల్సిన టీటీడీ అధికారులేమో మౌనవ్రతంలో ఉన్నారు. ఇదే సమయంలో కూటమిలోని బీజేపీ నేత, టీటీడీ ఈవోగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఇపుడు కలకలం సృష్టిస్తున్నాయి.

ఐవైఆర్ ఏమన్నారంటే చంద్రబాబు ఆరోపణలు చేసినట్లుగా జరిగే అవకాశాలు లేవట. చంద్రబాబు ఆరోపణలను తాను నమ్మటంలేదన్నారు. అయినా ఆరోపణలు చేసింది చంద్రబాబే కాబట్టి నిరూపించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు మీదే ఉంటుందన్నారు. ఒకవేళ తన ఆరోపణలను గనుక చంద్రబాబు నిరూపించలేకపోతే వెంటనే తప్పయిపోయిందని ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే తిరుమల శ్రీవారి దేవాలయం, ప్రసాదాలు కోట్లమంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టే అన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో రాజకీయాలు కూడదన్నారు. అలాగే కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని సూచించారు.

ఎలాగూ చంద్రబాబు ఆరోపణలు చేశారుకాబట్టి పూర్వపరాలను విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పారు. ఆరోపణలు రావటమే చాలా బాధాకరమన్నారు. ఆరోపణలు వచ్చాయి కాబట్టి భక్తులకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి మీదే ఉందన్నారు. వెంటనే ఈ విషయమై సీరియస్ గా స్పందించి వివాదానికి ముగింపు పలకాలని ఐవైఆర్ కోరారు.

Read More
Next Story