వాగులు దాటి గిరిజనులకు వైద్యం,ఆదిలాబాద్ వైద్య ఉద్యోగుల ఆదర్శం
x
ఇంద్రవెల్లిలో వాగు దాటుతున్న వైద్య సిబ్బంది

వాగులు దాటి గిరిజనులకు వైద్యం,ఆదిలాబాద్ వైద్య ఉద్యోగుల ఆదర్శం

భారీవర్షాలు కురుస్తుండటంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నా ఆదిలాబాద్ జిల్లా వైద్య ఉద్యోగులు మాత్రం వాగులు దాటి తండాలకు వచ్చి వైద్యం అందించి ఆదర్శంగా నిలిచారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారి రెండున్నర దశాబ్దాల క్రితం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరుగా పనిచేసినపుడు వర్షాకాలంలో ఆమె స్వయంగా వాగులు దాటి గిరిజన గ్రామాలను సందర్శించి ఉద్యోగుల్లో స్ఫూర్తినింపారు.

- గతంలో ఆదిలాబాద్ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యం సరిగా అందక గిరిజనులు మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలతో మరణిస్తుండే వారు.ఈ నేపథ్యంలో అప్పటి కలెక్టరు అయిన శాంతికుమారి వైద్యఆరోగ్య శాఖ పనితీరు మెరుగునకు విశేష క‌ృషి చేశారు.
- ప్రస్థుతం శాంతికుమారి చీఫ్ సెక్రటరీగా ఉన్నా ఆదిలాబాద్ జిల్లా వైద్యరంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దీనికితోడు ప్రస్థుత ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కూడా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల మెరుగుపై దృష్టి సారించారు.
- వాగులు పొంగి ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా, విధి నిర్వహణే పరమావధిగా భావించిన కొందరు వైద్య ఉద్యోగులు వాగులు దాటి తండాలకు వచ్చి వైద్యం అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
- ఇంద్రవెల్లి, ఇచ్చోడ మండలాలకు చెందిన వైద్య ఉద్యోగులు వాగులు దాటి, బురద రోడ్లపై కాలినడకన వచ్చి వైద్య సేవలు అందించి శెభాష్ అనిపించుకున్నారు.

వాగులు దాటి వచ్చి టీకాలు వేసిన ఉద్యోగులు
భారీవర్షాలు కురుస్తుండటంతో ఇంద్రవెల్లి మండలంలోని జెండాగూడ, జైతారం తండా, మామిడిగూడ, చిత్తభట్ట గిరిజన గూడెలకు వెళ్లే వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.దీంతో ఈ నాలుగు తండాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయా గిరిజన తండాల్లో గర్భిణులకు ఇంజక్షన్లు, గోలీలు ఇవ్వాలి. దీంతో మారుమూల వాల్గొండ ఆరోగ్య ఉప కేంద్రం ఏఎన్ఎం కనక సుందరి, వడ్ గాం ఆశా వర్కర్ ఆత్రం అనసూయ వాగులు దాటి గిరిజన తండాలకు వచ్చి వైద్యం అందించారు.ఆమె జెండాగూడ గ్రామంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇంద్రవెల్లి మండలంలో వాగు దాటుతున్న ఏఎన్ఎం, ఆశా వర్కర్

ఏఎన్ఎం ఆదర్శం
2007వ సంవత్సరంలో ఇంద్రవెల్లి మండలంలోని మారుమూల వాల్గొండ గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో సహాయక నర్స్‌ మిడ్‌వైఫ్‌ (ఏఎన్‌ఎం)గా కనక విజయ సుందరి వచ్చారు. గత 17 ఏళ్లుగా ఏఎన్ఎంగా పనిచేస్తున్న విజయసుందరి బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్లాలనుకున్నా గిరిజనులు ఆమె బదిలీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో ఆమె తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.విజయ సుందరి వర్షాకాలంలో వాల్గొండ సబ్‌సెంటర్‌ పరిధిలోని గ్రామాలకు తన భర్తతో కలిసి వాగులు దాటి వచ్చి గిరిజన కుగ్రామాల గిరిజనులకు సకాలంలో వైద్య సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.

వైద్యం అందించడంలోనే నాకు సంతృప్తి
‘‘నేను వాగులు దాటి, కాలినడకన మారుమూల గిరిజన గ్రామానికి చేరుకోవడానికి నాలుగు గంటలు పట్టింది.గిరిజనులు నాపై చూపిస్తున్న అప్యాయతతోనే వాగులు దాటడం కష్టమైనా తండాలకు వెళ్లి గర్భిణులు, పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు వేసి, గోలిలు ఇచ్చి వచ్చాను. గిరిజనులకు వైద్య సేవలు అందించడంలోనే నాకు సంతృప్తి’’ అని విజయ సుందరి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

రాజులగూడ తండాలో వైద్య శిబిరం
ఇచ్చోడ మండలంలో బురద రోడ్డుపై కాలినడకన వచ్చి గిరిజనులకు వైద్యం అందించారు. ఏఎన్‌ఎం రేణుకతో పాటు హెల్త్‌ అసిస్టెంట్‌ కృష్ణ, ఎంఎల్‌హెచ్‌ఓ సంగీత, ఆశా వర్కర్లు గంగామణి, లక్ష్మితో కలిసి ఇచ్చోడ మండలం మారుమూల రాజులతండాకు బురదలో కాలినడకన వచ్చి రాజులగూడ తండాలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ తండాలోని బురద రోడ్లపై 2 కిలోమీటర్ల మేర పాదరక్షలు లేకుండా నడుస్తూ గ్రామంలోని 95 మంది గిరిజనులకు మందులు ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు టీకాలు వేశారు.


Read More
Next Story