బీఎల్ఎన్ రెడ్డి బాటలోనే అరవింద్ కుమార్..!
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణను ఈడీ శరవేగంగా కొనసాగిస్తోంది. ఈడీ విచారణకు మరింత సమయం కావాలన్న అరవింద్.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణను ఈడీ శరవేగంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే జనవరి 2వ తేదీ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని, జనవరి 3న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను విచారణకు పిలుపుస్తూ వారికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే జనవరి 7న మాజీ మంత్రి కేటీఆర్‌ను కూడా విచారించనుంది. కాగా ఈరోజు తాను విచారణకు రాలేనంటూ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ అధికారులను మెయిల్ చేశారు. అందుకు అంగీకరించిన ఈడీ.. విచారణకు మళ్ళీ ఎప్పుడు రావాలో అతి త్వరలోనే చెప్తానని ఈడీ అధికారులు చెప్పారు. దీంతో సీనియర్ ఐపీఎస్ అరవింద్ కుమార్ విచారణకు వస్తారా అనేది కీలకంగా మారింది. కాగా తాను కూడా విచారణకు రాలేనంటూ ఈడీ అధికారులకు లేఖ రాశారాయన. విచారణకు హాజరుకావడానికి మరింత సమయం ఇవ్వాలని ఆయన కోరారు. కాగా అరవింద్ కుమార్ లేఖపై ఈడీ ఇంకా స్పందించలేదు. మరి ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
కేటీఆర్ ఏం చేస్తారు?
ఈడీ విచారణకు రావాల్సిన బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇద్దరూ కూడా విచారణకు రాలేమంటూ ఈడీకి లేఖలు రాశారు. ఈ క్రమంలో జనవరి 7న విచారణకు రావాల్సిన కేటీఆర్ వస్తారా? రారా? అనేది ప్రస్తుతం కీలక అంశంగా మారింది. రాష్ట్రమంతా ఇదే చర్చ మొదలైంది. కొందరుమాత్రం కేటీఆర్ విచారణకు తప్పకుండా హాజరవుతారని అంటున్నారు. మాజీ మంత్రి కన్నా ముందు ఉన్నతాధికారులను విచారించాలని ఈడీ భావిస్తోందని, ఆ దిశగా నోటీసులు జారీ చేసిందని, కానీ దానిని మార్చడం కోసమే పక్కా ప్లాన్ ప్రకారం బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విచారణకు హాజరవడానికి సమయం కోరారన్న వాదన కూడా జోరుగా వినిపిస్తోంది. అదే నిజమయితే దీనిని ఈడీ ఎలా ట్యాకిల్ చేస్తుందో చూడాలి. బహుశా జనవరి 5, 6, 7 తేదీల్లో వీరిని వరుసగా విచారించే అవకాశం ఉందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.