
హైదరాబాద్ చరిత్రలోకి ‘కిటికి’ తెరిచిన సాలార్ జంగ్ మ్యూజియం
అప్పట్లో హైదరాబాద్ ఎలా ఉండేదంటే
171 సంవత్సరాల కుతుబ్ షాహీల పాలన, 224 ఏళ్ల అసఫ్‌జాహీల పాలనలోనూ హైదరాబాద్ వ్యాపార పరంగా, సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా ఇతర ప్రాంతాల కన్నా ఆనాడే ఎంతో అగ్రగామిగా ఉండేది. ఇండో పర్షియన్, ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలితో అద్భుతమైన భవనాలు ఉన్నాయి ఇక్కడ. అద్భుతమైన వారసత్వ సంపదను, నగర గత వైభవాన్ని చూడాలంటే సాలార్‌జంగ్ మ్యూజియంను సందర్శించాల్సిందే. హెరిటేజ్ వీక్ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఫొటో ప్రదర్శన సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది. "మన వారసత్వ సంపదను ఇలా ఫొటోస్ లో చూస్తూ అప్పటి వైభోగాన్ని తలచుకుంటేనే గర్వంగా ఉంది. కుతుబ్‌షాహీ, నిజాం షాహీల కాలం నాటి అరుదైన ఫొటోలను సాలార్‌జంగ్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టాం". అని సృష్టి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఎస్.రమేష్ కుమార్ పెడరల్ తెలంగాణాకు తెలిపారు.
మహబూబ్ మాన్షన్
"ఆరవ నిజాం నవాబ్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీద ఈ రాజభవనంకు మహబూబ్ మాన్షన్ గా పేరు వచ్చింది. 19వ శతాబ్దం చివరలో నిర్మించబడిన ఆ భవనం సాంప్రదాయ ఐరోపా, మొఘల్ శైలిలో నిర్మించబడింది. మహబూబ్ అలీ ఖాన్ భార్య సర్దార్ బేగం రాజభవనం నుండి బయటికి చూడడం కోసం కిటీకీలకు బంగారు దారంతో తయారు చేసిన పరదాలను ఏర్పాటుచేశారు. బంగారు పరదాలపై సూర్యరశ్మి ప్రతిబింబిస్తుండడంవల్ల బయటి నుంచి ఎవరినైనా రాణి వైపు చూడడానికి అసాధ్యమయ్యేది. ఈ ప్యాలెస్‌కు ఉన్న పెద్ద గేట్‌ను 8వ నిజాం ముక్రంఝా చిరాన్ ప్యాలెస్ పెట్టుకున్నాడు. ఇలాంటి గేట్లు ప్రపంచంలో కేవలం 8 మత్రమే ఉన్నాయి" . అని హెరిటేజ్ కన్సర్వేషన్, మాన్యుమెంట్స్ అండ్ టూరిజం వ్యవస్థాపకుడు మహ్మద్ గైసుద్దీన్ అక్బర్ తెలిపారు.
హాతి బౌలి
హైదరాబాద్ ప్రసిద్ధ బావులకు ప్రసిద్ధి చెందింది, వాటిలో చాలా వరకు అంతరించి పోయాయి, 'కాంక్రీట్' బావి (గచ్చి బౌలి), 'ఇసుక బావి' (రేతి బౌలి), 'పాల బావి' (దూద్ బౌలి), 'డీజిల్-శక్తితో నడిచే బావి' (ఇంజిన్ బౌలి). ప్రస్తుతం హైదరాబాదీలు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, నగరంలో 'ఏనుగు బావిస (హాతి బౌలి) కూడా ఉంది. యాదృచ్ఛికంగా, హయత్‌నగర్‌లోని హయత్ బక్ష్ బేగం మసీదు-కారవాన్‌సెరాయ్ కాంప్లెక్స్‌లో వున్న హాతి బౌలి శిథిలావస్థకు చేరుకుంది. బావి నుండి భారీ నీటి తొట్టిని లాగడానికి ఏనుగులను ఉపయోగించేవారు. ఆ బకెట్‌లో చాలా ఎక్కువగా నీరు వుండటంతో బావి నుండి నీటిని ఒకేసారి లాగడానికి ఏనుగును ఉపయోగించడం వల్ల దీనిని హాతి బౌలి అనే పేరు వచ్చింది. బావి చుట్టూ ఉన్న భవనంలోకి ఏనుగులు ఎక్కడానికి ఒక నిబంధన ఉంది" అని అక్బర్ అన్నారు, ప్రస్తుతం ఏనుగు రాంప్, అలాగే మెట్లు కూడా ఆక్రమణకు గురైయ్యాయి. అప్పట్లో బావుల నుంచి నీటిని లాగడానికి ఒంటెలు, ఎద్దులు, గుర్రాలను ఉపయోగించారు.
పైగా టూంబ్స్
హైదరాబాద్ ఆర్కిటెక్చర్ అద్భుతాలకు పైగా టూంబ్స్ అద్దం పడ్తాయి. పైగా టూంబ్స్ ను లైమ్, మోర్టార్‍లతో మార్బుల్స్ తో నిర్మించారు. ఈ సమాధులు సుమారుగా 200 ఏళ్ళ క్రితం నాటివి. మొజాయిక్ టైల్స్ ను ఎంతో సున్నితంగా చెక్కారు. అక్కడి మార్బుల్ ఫకేడ్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. లతలను చెక్కారు. స్టక్కో వర్క్, జాలీ వర్క్ అప్పటి నిర్మాణశైలిని ప్రతిబింబిస్తాయి. వీటిలో కొన్ని వరుసలుగా ఉంటే, కొన్ని అందంగా చెక్కిన స్క్రీన్‍లుగా, కానోపీస్‍గా ఉంటాయి. ఇండో-ఇస్లామిక్ నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది. అసఫ్ జాహీ, రాజ్‍పుఠానా ఆర్కిటెక్చర్ మిశ్రమశైలిలో ఇవి నిర్మితమయ్యాయి. మొఘల్, పర్షియన్, దక్కన్ నిర్మాణ శైలులకు ప్రాతినిథ్యం వహించే కట్టడాల్ని ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్ నగరంలో పైగా కుటుంబీకులు ఎన్నో గొప్ప భవనాలను నిర్మించారు. అస్మాన్ జాహీ ప్యాలెస్, ఖుర్షీద్ జాహీ ప్యాలెస్, వికార్-ఉల్-ఉమ్రాహి ప్యాలెస్ లాంటివెన్నో వీటిలో ఉన్నా యి. ప్రపంచప్రఖ్యాతి గాంచిన ఫలక్‍నుమా ప్యాలెస్ వీరు నిర్మించిందే. ఇక్కడి నిర్మాణాల్లోని డిజైన్లలో ఉన్న ఒక విశిష్టత ఏమిటంటే ఒక చోట ఉన్న డిజైన్ తిరిగి మరోచోట కన్పించదు. ప్రతీది విభిన్నం గా, విశిష్టంగా, విలక్షణంగా ఉంటుంది.
తొలినాటి నిర్మాణాలకు నవాబ్ సర్ అస్మాన్ జా బహదూర్, సర్ ఖుర్షీద్ జా, సర్ వికార్ ఉల్ ఉమ్రా మరిన్ని జోడింపులు చేశారు. ఈ తరహా నిర్మాణశైలి ఎంతో ప్రత్యేక మైందని, ప్రపంచంలోనే మరెక్కడా కానరాదని చెబుతారు.సీజన్‍ను బట్టి రంగు మారే రాళ్ళతో వీటిని అలంకరిచినట్లుగా చెబుతారు. సమాధుల చుట్టూరా ఉండే గోడలపై లతలు, రేఖాగణిత చిత్రాలు ఉంటాయి. ప్రతీది విభిన్నంగా పండ్లు, పూలు, డ్రమ్స్, పాములు లాంటివాటితో అలంకృతమై ఉంటాయి" . అని హెరిటేజ్ కన్సర్వేషన్, మాన్యుమెంట్స్ అండ్ టూరిజం వ్యవస్థాపకుడు మహ్మద్ గైసుద్దీన్ అక్బర్ తెలిపారు.
ఆస్మాన్ మహల్
లక్డీకాపూల్ సమీపంలోని చిన్న కొండమీద ఈ భవనం ఉంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీఖాన్ కాలంలో జాగీర్దార్‌గా ఉన్న నవాబ్ అఫ్సర్ ఉల్ ముల్క్ అల్లుడు ముంతాజ్ యారుద్దౌలా దీనిని 1911లో నిర్మించాడు కనుకే దీనిని ‘ముంతాజ్ మాన్షన్’గా పిలుస్తున్నారు. ఇండో యూరోపియన్ వాస్తు శైలిలో విశాలంగా నిర్మితమైన ఈ భవనం రెండస్థులతో అలరారుతోంది. ‘ఆస్మాన్ మహల్’ అనే బాలీవుడ్ చిత్రాన్ని ఇక్కడ షూటింగ్ చేయడంతో దీన్ని ‘ఆస్మాన్ మహల్’ అని కూడా పిలుస్తారు.
క్లాక్ టవర్లు
నిర్లక్ష్యానికి గురవుతున్న చారిత్రక కట్టడాల్లో క్లాక్ టవర్లు కూడా ఉన్నాయి. నిజాం కాలంలో ఈ ఐకానిక్ నిర్మాణాలు వారసత్వ చిహ్నాలుగా విరాజిల్లాయి. నాటి చరిత్రకు ఇవే కీలకమైన మైలురాళ్లు. సమయ పాలనతో పాటు నగరంలోని రద్దీ వీధుల్లో దిక్సూచిగా నిలిచేవి. హైదరాబాద్‌లో 22 టవర్ క్లాక్‌లు ఉన్నాయి. చార్మినార్, సికింద్రాబాద్, మొజాంజాహి మార్కెట్ గడియారాలు బాగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో కొన్ని 18వ శతాబ్దానికి చెందినవి. ‘‘1850లో మొట్టమొదటి క్లాక్ టవర్‌ను ముర్గీచౌక్‌లో మొదటి సాలార్‌జంగ్ నిర్మించారు. సుల్తాన్ బజార్‌లోని టవర్ క్లాక్ స్వాతంత్రోద్యమ కార్యక్రమాలకు వేదికగా నిలిచింది.. ఇప్పుడు ఇవి మన నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా మిగిలాయి’’ అని అక్బర్ తెలిపారు. మూడో నిజాం సికిందర్ జా ఆస్థానంలో దఫ్తార్దార్ (రెవెన్యూ అధికారి) శాలిబండ ప్యాలెస్‌లో 1904లో ఈ క్లాక్ టవర్‌ను నిర్మించారు. యూరోపియన్ శైలిలో హిందు–అరబిక్, రోమన్, హిందీ, తెలుగు అంకెలు దీనిలో ఉంటాయి. ఈ గడియార స్థంభాన్ని రాజా రాయ్ రాయన్ ఘడియాల్ అని కూడా పిలుస్తారు" . అని అక్బర్ తెలిపారు.
బాలాహిసార్
గోల్కొండ కోట నిర్మాణం జరిగి 500 సంవత్సరాలు గడిచింది. ఇన్ని సంవత్సరాలలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని రాజ్యాలు దండెత్తినా తట్టుకుని నిలబడి నవాబుల పాలనకు, చరిత్రకు సాక్ష్యంగా గోల్కొండ నిలిచింది. కోట లోపల ఎన్నో విశేషమైన కట్టడాలు ఉంటాయి. పారశీక, పఠాన్, హిందూ సంప్రదాయాలు సమ్మిళితమైన మిశ్రమశైలిలో కుతుబ్‌షాహీలు నిర్మాణాలు చేశారు. "గోల్కొండ బాలాహిసార్ ద్వారం మీద హిందూ పురాణ కథల చిత్రాలు, సంకేతాలున్నాయి. బాలాహిసార్‌లో కూర్చొని కులీ కుతుబ్‌షా తారామతి నృత్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాడు. ఆమె గోల్కొండ కోట సమీపంలో వున్న తారామతి బరదారి డాన్స్ చేసేది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో నిర్మించిన ఇటువంటి కోటను మరలా పున:నిర్మించడం అసాధ్యం. ఇందులో ప్రతి కట్టడంలో ఇటలీ, పర్షియన్ నైపుణ్యం కనిపిస్తుంది. అప్పటి ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, నిర్మాణ విలువలు చూస్తే మతిపోతుంది. ఆ రోజుల్లోనే ఇంత టెక్నాలజి ఉండేది," అని హెరిటేజ్ కన్సర్వేషన్, మాన్యుమెంట్స్ అండ్ టూరిజం వ్యవస్థాపకుడు మహ్మద్ గైసుద్దీన్ అక్బర్ తెలిపారు.
గడి కోట ఫోర్ట్
"అబుల్ హసన్ కుతుబ్ షా (తానా షా) దర్బారులో మంత్రులుగా అక్కన్న, మాదన్నలుండేవారు. వారి జాగిర్‌గా మహేశ్వరం వుండేది. గడి కోట ఫోర్ట్ ఈ జాగిర్ పేరు పొందింది. దీన్ని డిఫెన్స్ అవసరాల కోసం వాడేవారు. ఇక్కడే మహేశ్వరం సరాయి కూడా ఉండేది. ఔరంగజేబు దాడిలో గడికోట ఫోర్ట్ ధ్వంసం అయింది." అని టాగూర్ నేషనల్ స్కాలర్ డాక్టర్ జి.జయరామ్ తెలిపారు.
చౌమహల్ల ప్యాలెస్
చౌ'అంటే నాలుగు, 'మహాల్లా' అంటే రాజభవనాలు. చౌమహల్ల అంటే నాలుగు రాజభవనాలను కలిగినది అని అర్థం. చౌమహల్ల ప్యాలెస్ ఇరాన్ లోని ట్రెహ్రాన్ షా ప్యాలెస్‌ను పోలి ఉంటుంది. ఈ భవన నిర్మాణం 1857 -1869 మధ్య ఐదవ నిజాం పాలనలో ఆఫ్జల్-ఉద్-దౌలా, అసఫ్ జాహీ కాలంలో పూర్తి చేశారు. అప్జల్ మహల్, తహ్నియత్ మహల్, మహతాబ్ మహల్, అప్తాబ్ మహల్ నాలుగు రాజభవనాలు దర్శనం ఇస్తాయి. అప్తాబ్ మహల్ మిగిలిన వాటి కంటే పెద్దదయిన రెండు అంతస్తుల నిర్మాణం. అలాగే ఉత్తర ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలు, తూర్పు వైపు అనేక గదులు సుదీర్ఘ కారిడార్ కలిగిన పరిపాలనా విభాగం వున్నాయి. ఈ ప్రాంగణంలో అతిథులు, ముఖ్యమైన వ్యక్తుల కోసం ఓ అందమైన ఫీచర్ అలట్ ఉంది. అలాగే ప్యాలెస్ ఆవరణంలో ఒక క్లాక్ టవర్, ఓ కౌన్సిల్ హాల్ ఉన్నాయి. ప్యాలెస్‌లో కళాత్మకంగా చెక్కిన స్తంభాలు, ప్యాలెస్ ముందు భారీ నీటి ఫౌంటెన్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. రాజభవనం గోడలు, పై కప్పుపై గాజుతో సున్నితంగా చెక్కిన చెక్కడాలు చాలా కళాత్మకంగా వుంటాయి.
హిల్ ఫోర్ట్ ప్యాలెస్
నౌబత్ పహాడ్ సమీపంలో 6 ఎకరాల్లో హిల్ ఫోర్ట్ ప్యాలెస్ ఉంది. "కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కళాశాల శైలిలో దీని నిర్మాణం జరిగింది. నిజాం ప్రభుత్వంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన నవాబ్ సర్ నిజామాత్ జంగ్ తన కోసం 1915లో కట్టుకున్నాడు. ఈ ప్యాలెస్ లోనే ఆయన 15 సంవత్సరాలు జీవించాడు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన కుమారుడైన ప్రిన్స్ మోజాం జాహ్ కోసం దీనిని కొనుగోలు చేశాడు". అని ఉస్మానియా రిటైర్డ్ ఫ్రొఫెసర్ డాక్టర్ ఎ.విజయ్ కుమార్ బాబు తెలిపారు. 1955లో ఆపరేషన్ పోలో తర్వాత భారత ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. 1980లో స్టార్ హోటల్ నడపడంకోసం ది రిట్జ్ హోటల్ కంపెనీకి లీజుకు ఇచ్చింది. 1997 వరకు హోటల్ గా ఉంది. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్ లు కూడా జరిగేవి.
పురానీ హవేలీ ప్యాలెస్
"మహ్మద్ కులీ కుతుబ్ షా పీష్వా మీర్ మోమెన్ తాను నివాసం వుండటానికి పురానీ హవేలీ ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఆ తర్వాత, ఈ రాజ భవనాన్ని హైదరాబాద్ రెండవ నిజాం, అసఫ్ జా II స్వాధీనం చేసుకుని పునరుద్ధరించారు. మూడవ నిజాం సికందర్ జా కొన్ని సంవత్సరాలు నివాసం వుండి, ఆ తరువాత చౌమహల్లా ప్యాలెస్‌లోని ఖిల్‌వత్ కాంప్లెక్స్‌కు తన నివాసాన్ని మార్చుకున్నాడు. ఆ తరువాత ఈ ప్యాలెస్ శిథిలావస్థకు చేరుకుంది. 6వ నిజాం, మీర్ మహబూబ్ అలీ ఖాన్ సింహాసనాన్ని అధిరోహించిన తరువాత పురానీ హవేలీని అధికారిక నివాసంగా మార్చుకోవడంతో ఈ ప్యాలెస్ పూర్వ వైభవం పొంది మరోసారి ఆకర్షణీయంగా మారింది. కొన్నేళ్లపాటు ఈ ప్యాలెస్ పాడుబడినందున, దీనిని పురానీ హవేలీ అని పిలుస్తారు". అని సాలార్‌జంగ్ మ్యూజియం రిటైర్డ్ డిప్యూటీ కీపర్ ఎం.వీరేందర్ తెలిపారు. ప్రధాన భవనం 18 వ శతాబ్దపు యూరోపియన్ నిర్మాణశైలికి ప్రతీకగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన బర్మా టేకుతో తయారు చేయబడిన అతిపెద్ద వార్డ్ రోబ్. ఆయినా ఖానా (దర్పణాల భవనం), చీనీ ఖానా (చైనా గాజు భవనం) నిర్మించబడినాయి. ఈ ప్యాలెస్‌లోని మ్యూజియం నిజాంల రాజరిక జీవనశైలి గురించి తెలుసుకునే గొప్ప కళాఖండాలను ప్రదర్శిస్తుంది.
రాష్ట్రపతి నిలయం
సుమారు 97 ఎకరాల విస్తీర్ణంలో, దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాచరికపు తీపి గుర్తుగా నిలుస్తుంది. బ్రిటీషు వారి పాలనలో అప్పటి వైస్రాయ్ నివాసంగా ఈ భవనాన్ని నిర్మించారు. మొత్తం ప్రాంగణంలో సుమారు 20 గదులకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అతిథుల కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. ఒక చక్కని వనమూలికా తోటను అభివృద్ధి చేశారు. అనేక అరుదైన ఆయుర్వేద మొక్కలసాగు ఇక్కడ జరుగుతోంది.
బ్రిటీషు రెసిడెన్సీ
కోఠిలో ఉన్న బ్రిటీషు రెసిడెన్సీ భవనాన్ని 1798లో నిర్మించారు. ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలగా మార్చారు. "1798-1805 మధ్యకాలంలో హైదరాబాదులో 5వ బ్రిటీషు రెసిడెంట్ గా ఉన్న జేమ్స్ అఖిలీస్ కర్క్‌పాట్రిక్ తన హోదాకు సరిపడ భవన నిర్మాణం కోసం మూసీ నది సమీపంలో 60 ఎకరాల స్థలం కావాలని నిజాంను కొరాడు. ఆ కోరికను మన్నించి నిజాం ప్రభువు, తన సొంత ఖర్చుతో ఈ భవనాన్ని నిర్మించాడు. క్లాసికల్ పోర్టికోతో ఉన్న ఈ భవనం జార్జియన్ పల్లాడియన్ విల్లా శైలిలో, యునైటెడ్ స్టేట్స్ లోని వైట్ హౌజ్ ను పోలి ఉంది. రెసిడెన్సీలోని ప్రధాన హాలుకు ముందు సుమారు 60 అడుగుల పొడవు గల 22 పాలరాతి మెట్లు ఉన్నాయి. రెసిడెన్సీ పోర్టికో ముందు భాగంలో సుమారు 50 అడుగుల ఎత్తులో ఎనమిది పిల్లర్లు నిర్మించబడ్డాయి. అలాగే ప్రధాన ద్వారానికి ఇరు వైపులా సింహాల విగ్రహాలు, దర్బార్ హాల్లో శిల్పాలు, 60 అడుగుల ఎత్తైన పైకప్పుపై చిత్రించిన తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి". అని అక్బర్ తెలిపారు.
జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్
జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్ అప్పట్లో 300 ఎకరాల్లో ఉండేది. లెదర్‌పైన గోల్డ్ వర్క్ తో డైనింగ్ హాల్ ఎంతో ఆకర్షణీయంగా వుండేది. రాకుమారీ ఇందిరాదేవి ధనరాజ్ గిరి ఈ ప్యాలెస్‌లోనే నివాసముంటున్నారు.
బెల్లా విస్టా
"10 ఎకరాల విస్తీర్ణంలో ఇండో-యూరోపియన్ శైలీలో ఈ బెల్లా విస్టా భవన నిర్మాణం జరిగింది. బెల్లా విస్టా అనగా అందమైన దృశ్యం అని అర్థం. ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ పద్ధతిలో రూపొందిన ఈ భవనం నుండి హుస్సేన్ సాగర్ చూడవచ్చు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కుమారుడైన ఆజమ్ జా తన భార్య యువరాణి దుర్రూ షెవార్ తో కలిసి ఈ భవనంలో నివసించాడు". అని సాలార్‌జంగ్ మ్యూజియం రిటైర్డ్ డిప్యూటీ కీపర్ వేణుగోపాల్ తెలిపారు.
పైగా ప్యాలెస్
ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో పైగా ప్యాలెస్ ను నిర్మించుకున్నాడు. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇచ్చాడు.రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, రెండు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలీలో ఈ ప్యాలెస్ రూపొందింది. ఈ ప్యాలెస్ కు 22 అడుగుల ఎత్తైన పెకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులు ఉన్నాయి. వాటి బాతురూం గదులు ఒక్కోటి 300 అడుగుల్లో ఉన్నాయి. రెండవ అంతస్తుకు చేరుకోడానికి కలపతో చేసిన మెట్లు ఏర్పాటు చేయబడ్డాయి" . అని హెరిటేజ్ కన్సర్వేషన్, మాన్యుమెంట్స్ అండ్ టూరిజం వ్యవస్థాపకుడు మహ్మద్ గైసుద్దీన్ అక్బర్ తెలిపారు.

