అగ్రనేతల ఎన్ కౌంటర్లకు బాడీ గార్డులే కారణమా ?
x
Maoist encounters

అగ్రనేతల ఎన్ కౌంటర్లకు బాడీ గార్డులే కారణమా ?

కోవర్టులుగా మారిపోయి అగ్రనేతలు, కీలకనేతల మరణాలకు కారణమవుతుండటాన్ని పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతున్నది


మావోయిస్టుపార్టీని కోవర్టుల సమస్య బాగా పట్టిపీడిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా మావోయిస్టుపార్టీలో చాలామంది అగ్రనేతలు ఎన్ కౌంటర్లలో చనిపోతున్నారు. మావోయిస్టుపార్టీ(Maoist Party) సుప్రింకమాండర్ నంబాల కేశవరావు కూడా ఎన్ కౌంటర్లోనే(Maoist Encounters) చనిపోయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత కేంద్రకమిటి సభ్యులు, రాష్ట్రస్ధాయిలో కీలకనేతలు చాలామంది చనిపోయారు. కేంద్రకమిటిలోని 17మంది సభ్యుల్లో ఎనిమిదిమంది ఎన్ కౌంటర్లలో చనిపోగా మరోసభ్యురాలు సుజాత పోలీసులముందు లొంగిపోయారు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఏడాదికాలంలోనే ఇంతమంది ఆపరేషన్ కగార్లో(Operation Kagar) భాగంగా భద్రతాదళాల కాల్పుల్లో చనిపోవటానికి కారణాలు ఏమిటి ? ఇపుడీ విషయమే మావోయిస్టుపార్టీ నేతలను పట్టిపీడిస్తోంది. పార్టీలో ఏమిజరుగుతోందనే విషయమై మావోయిస్టుపార్టీ నేతలు విశ్లేషణలు మొదలుపెట్టారు.



పౌరహక్కుల సంఘంలోని విశ్వసనీయవర్గాల సమాచారం ఏమిటంటే కోవర్టుల కారణంగానే పార్టీ అగ్రనేతలు భద్రతాదళాల ఎన్ కౌంటర్లలో చనిపోయినట్లు తేలింది. కోవర్టులు అంటే అగ్రనేతలు, కీలకనేతలకు సంవత్సరాల తరబడి బాడీగార్డులుగా ఉన్నవాళ్ళల్లో కొందరు కారణమని పార్టీలో కీలకనేతలు గుర్తించారు. దీనికి పౌరహక్కుల సంఘాలనేతలు ఉదాహరణలను కూడా చూపిస్తున్నారు. మావోయిస్టు కేంద్రకమిటి ప్రధానకార్యదర్శి, సుప్రింకమాండర్ నంబాల కేశవరావు మే 21వ తేదీన ఎన్ కౌంటర్లో చనిపోయారు. ఎన్ కౌంటర్ జరగటానికి నాలుగురోజుల ముందు అంటే మేనెల 17వ తేదీన నంబాల బాడీగార్డుల దళంలోని ఒక జంట అదృశ్యమైపోయింది. కేంద్రకమిటి ప్రధానకార్యదర్శి కాబట్టి నంబాలకు చాలా సెక్యూరిటి ఉంటుంది. పదులసంఖ్యలో బాడీగార్డులు 24 గంటలూ కాపలాగా ఉంటారు.


నంబాల ఎక్కడుంటే అక్కడ మూడువలయాలుగా మావోయిస్టుదళాలు కాపలాకాస్తుంటాయి. 17వ తేదీన బాడీగార్డులోని ఒక జంట డ్యూటీలో నుండి మాయమైపోయిన రెండురోజుల తర్వాత అంటే 19వ తేదీన భద్రతాదళాలు నంబాల క్యాంపును చుట్టుముట్టాయి. భద్రతాదళాలు తమను చుట్టుముట్టినట్లు నంబాలకు బాడీగార్డులు వెంటనే చెప్పాయి. దాంతో అందరూ అడవుల్లో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దాదాపు 24 గంటలకు పైగా 40 కిలోమీటర్ల పరిధిలో వేలాదిమంది భద్రతాదళాలు నంబాలను వెంటాడాయి. చివరకు నంబాల ఎక్కడ దాక్కున్నాడన్న విషయాన్ని కచ్చితంగా తెలుసుకున్న భద్రతాదళాలు సడెన్ గా దాడిచేసి నంబాలతో పాటు మరో 25 మందిని ఎన్ కౌంటర్లో చంపేశాయి.


నంబాల ఎక్కడుంటాడు అన్నవిషయం మావోయిస్టుల్లోనే చాలామందికి తెలీదు. అలాంటిది నంబాల క్యాంపు చేసిన స్ధలం, హైడ్ అవుట్ వివరాలు భద్రతాదళాలకు అంతకచ్చితంగా ఎలా తెలిసింది ? ఎలా తెలిసిందంటే నంబాల బాడీగార్డుల్లో అదృశ్యమైపోయిన జంట పోలీసుల అదుపులో ఉన్నట్లు మావోయిస్టుపార్టీకి తర్వాత తెలిసింది. బాడీగార్డుల జంట ఇచ్చిన సమాచారంతోనే భద్రతాదళాలు అంతకచ్చితత్వంతో అడవిలో నంబాలను చుట్టుముట్టి ఎన్ కౌంటర్లో చంపేసినట్లు అర్ధమైంది. అంతకుముందు ఏప్రిల్ లో కర్రిగుట్టల అడవుల్లో భద్రతాదళాలు మావోయిస్టుల కదలికలపై గాలింపుచర్యలు జరిపాయి. పార్టీలోని కీలకనేతల్లో ఒకడైన మాడ్వి హిడ్మా ఉన్నట్లు సమాచారం అందటంతోనే సుమారు 20వేలమంది పోలీసులు ఆపరేషన్ కగార్లో భాగంగా గాలింపు జరిపారు. అయితే ఈ విషయం ముందుగా తెలియటంతోనే హిడ్మాతో పాటు కీలకనేతలు అక్కడినుండి దుర్గంగుట్టలవైపు పారిపోయారు. దాదాపు 20రోజులు ద్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతాదళాలు రాత్రుళ్ళు కూడా అడవులను జల్లెడపట్టాయి.


అయితే అదేసమయంలో ఆపరేషన్ సింధూర్ మొదలవ్వటంతో భద్రతాదళాలను అడవుల నుండి ఉన్నతాధికారులు ఉపసంహరించుకున్నారు. దాంతో మావోయిస్టుపార్టీ నేతలు సేఫ్ గా దండకారణ్యంలోని అబూజ్ మడ్ అడవుల్లో భాగమైన నేషనల్ పార్క్ ప్రాంతానికి వెళ్ళిపోయారు. కర్రిగుట్టల్లోని అడవుల్లో హిడ్మాతో పాటు మరికొందరు కీలకనేతలు క్యాంపు వేసిన సమాచారం భద్రతాదళాలకు ఎలా తెలిసిందనే విషయమై పార్టీ ఆరా మొదలుపెట్టింది. అయితే భద్రతాదళాల కూంబింగ్ ఒత్తిడి పెరిగిపోవటంతో ఆ విషయం మరుగునపడిపోయింది.


అల్లూరి సీతారామరాజు జిల్లాలో జూలైలో జరిగిన ఎన్ కౌంటర్లో కేంద్రకమిటి సభ్యుడు గాజర్ల గణేష్ అలియాస్ ఉదయ్ చనిపోయాడు. ఈ ఎన్ కౌంటర్ జరగటానికి రెండువారాల ముందే ఉదయ్ భద్రతలోని ఇద్దరు సీనియర్ గార్డులు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. గాజర్లకు సంబంధించిన సమస్త సమాచారాన్ని వీళ్ళు పోలీసులకు చెప్పేసినట్లు సమాచారం. అర్ధరాత్రుళ్ళు తనసహచర మవోయిస్టు కీలకనేతలతో గాజర్ల ఒక ట్యాబ్ ద్వారా కమ్యూనికేషన్ జరుపుతాడని లొంగిపోయిన ఇద్దరు పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం ఆధారంగా భద్రతాదళాలు కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉదయ్ ఉపయోగిస్తున్న ట్యాబ్ సిగ్నల్స్ ను ట్రాక్ చేయగలిగారు. సిగ్నల్ ఆధారంగా ఉదయ్ ఎక్కడుంటున్నాడో తెలుసుకున్నారు. ఒకరోజు సడెన్ గా భద్రతాదళాలు ఉదయ్ క్యాంపుమీద దాడిచేసి ఎన్ కౌంటర్ చేశారు. ఆ దాడిలో ఉదయ్ తో పాటు మరో కీలక నేత చైతో కూడా చనిపోయింది.

జార్ఖండ్ లో ఏప్రిల్ లో జరిగిన ఎన్ కౌంటర్లో కేంద్రకమిటి సభ్యుడు ప్రయాగ్ మాంఝీతో పాటు ఇద్దరు డివిజన్ సభ్యులు, సెప్టెంబర్ ఎన్ కౌంటర్లో సహదేవ్ సోరేన్ తో పాటు మరో ఇద్దరు డివిజన్ సభ్యులు పోలీసు కాల్పుల్లో చనిపోయారు. వీరి మరణాలు కూడా కోవర్టు ఆపరేషన్ల కారణంగానే జరిగినట్లు పార్టీ అనుమానిస్తోంది. ఇంద్రావతి నేషనల్ పార్కులో కేంద్రకమిటిసభ్యుడు తెంటు లక్ష్మీనరసింహాచలం అలియాస్ సుధాకర్, మైలారపు ఆదెల్లుతో పాటు మరో ఎనిమిదిమంది కూడా ఎన్ కౌంటర్లో చనిపోయారు. చలపతి, బాలన్న ఎన్ కౌంటర్లు కూడా కోవర్టుల కారణంగాణే జరిగినట్లు పౌరహక్కుల సంఘాల నేతలు అనుమానిస్తున్నారు. మూడురోజుల క్రితం ఛత్తీస్ ఘడ్, నారాయణ పూర్ అడవుల్లో ఎన్ కౌంటర్లో కేంద్రకమిటి సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి చనిపోయిన విషయం తెలిసిందే. ఇద్దరు కేంద్రకమిటిసభ్యులు ఒకేసారి ఎన్ కౌంటర్లో చనిపోవటం పార్టీలో సంచలనంగా మారింది.



ఎందుకంటే పార్టీలో టాప్ ర్యాంకింగ్ నేతలు ఇద్దరు ఒకచోట ఉండరు. అలాగే జరిగిన ఎన్ కౌంటర్లో కేవలం ఇద్దరు కేంద్రకమిటిసభ్యులు మాత్రమే చనిపోయారు. వీళ్ళతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు ? వారిలో ఎవరైనా చనిపోయారా ? ఎవరికైనా గాయాలు అయ్యాయా అన్న విషయం తెలీదు. ఎన్ కౌంటర్లో ఇద్దరు కేంద్రకమిటిసభ్యులు చనిపోయినట్లు మాత్రమే పోలీసులు ప్రకటించారు. వీళ్ళ ఎన్ కౌంటర్ వెనుక కూడా కోవర్టుల హస్తముందా అనే విషయాన్ని పార్టీ ఇపుడు విశ్లేషిస్తున్నట్లు పౌరహక్కుల సంఘం నేతలు చెబుతున్నారు.


ఇపుడు సమస్య ఏమిటంటే పార్టీలోని అగ్రనేతలు, కీలకనేతలకు రక్షణగా ఉన్న మావోయిస్టుల్లో ఎవరిని నమ్మాలో ? ఎవరిని అనుమానించాలో కూడా పార్టీ తేల్చుకోలేకపోతోంది. ఎవరెప్పుడు మాయమైపోతారో ? ఫలితంగా ఎవరెప్పుడు ఎన్ కౌంటర్లలో చనిపోతారో అనేటెన్షన్ పార్టీలో పెరిగిపోతోంది. ఈమధ్యనే కేంద్రకమిటి సభ్యురాలు సుజాత లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత సుజాత పార్టీకి సంబంధించి ఎలాంటి సమాచారం అందించింది అనే విషయంలో పార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి అదనంగా ఈమధ్యవరకు పార్టీ అధికారప్రతినిధిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ కొంతకాలంగా ఎక్కడా కనబడటంలేదు. అభయ్ తో పాటు ఈయన అనుచరుల దగ్గర అధునాతన ఆయుధాలున్నాయి. అందుకనే అభయ్ లొంగిపోయేముందు తనదగ్గరున్న ఆయుధాలను సరెండర్ చేయాలని పార్టీ అల్టిమేటమ్ జారీచేసింది. బాడీగార్డుల్లోని కొందరు మావోయిస్టులే కోవర్టులుగా మారిపోయి అగ్రనేతలు, కీలకనేతల మరణాలకు కారణమవుతుండటాన్ని పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతున్నది. అభయ్ కారణంగా పార్టీకి ఎలాంటినష్టం జరగబోతుందో చూడాలి.

Read More
Next Story