బీఆర్ఎస్ చీలికకు ఏలేటి మహేశ్వరరెడ్డి ముహూర్తం ఫిక్స్ ?
x
BJLP Leader Alleti Maheswar Reddy

బీఆర్ఎస్ చీలికకు ఏలేటి మహేశ్వరరెడ్డి ముహూర్తం ఫిక్స్ ?

ఈనెలాఖరులోగా కాని లేదా వచ్చే నెల మొదటివారంలో పార్టీ చీలిపోవటం ఖాయమని ఏలేటి బల్లగుద్ది మరీ చెప్పారు


ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను చీలికలు, పీలికలు చేసేంతవరకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు ఊరికే ఉండేట్లు లేవు. ఎలాగైనా సరే కారుపార్టీలో చీలికలు తీసుకురావాలని పై రెండుపార్టీల నేతలు విడివిడిగానో లేకపోతే జాయింటుగానో గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నట్లున్నారు. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వరరెడ్డి(Alleti Maheswar Reddy) మీడియాతో మాట్లాడుతు బీఆర్ఎస్(BRS Divisions) లో నాలుగుస్తంభాలాట జరుగుతోందన్నారు. మాజీమంత్రి హరీష్ రావు(Harish Rao) నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చీలికలదిశగా అడుగులు వేస్తోందని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పదిమంది ఎంఎల్ఏలు హరీష్ నేతృత్వంలో చీలికకు సిద్ధంగా ఉన్నారన్న అర్ధమొచ్చేట్లుగా ఏలేటి కామెంట్లు చేశారు. పార్టీ వ్యవహారాల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ మధ్య తీవ్రస్ధాయిలో విభేదాలున్నట్లు చెప్పారు.

ఈమధ్యనే జరిగిన పార్టీరజతోత్సవసభలో కవిత, హరీష్ ను దూరంగా పెట్టేసి మొత్తం పెత్తనమంతా కేటీఆరే(KTR) చూసుకున్నారని ఏలేటి గుర్తుచేశారు. కేసీఆర్ యాక్టివ్ గా లేనికారణగా మొత్తం వ్యవహారాలను కేటీఆరే చూసుకుంటున్నట్లు ఎంఎల్ఏ చెప్పారు. పార్టీలో నిర్ణయాలు ఏకపక్షంగా సాగుతున్న కారణంగానే హరీష్, కవితలు మండిపోతున్నట్లు ఎంఎల్ఏ బయటపెట్టారు. కవిత(Kavitha) టేకప్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, పూలే విగ్రహం ఏర్పాటు అంశాలకు పార్టీ నుండి ఏమాత్రం మద్దతు దొరకలేదన్నారు. మహిళా సమానత లేదని, సామాజిక తెలంగాణా సాకారంకాలేదన్న కవిత వ్యాఖ్యలు వ్యూహాత్మకమే అని ఏలేటి స్పష్టంచేశారు. ఎంఎల్ఏ చెప్పారని కాదుకాని కవిత మాటలు విన్నవాళ్ళందరికీ పరోక్షంగా తండ్రి కేసీఆర్ ను తప్పుపడుతున్నట్లు లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ ను కేసీఆర్ పైకి రెచ్చగొట్టినట్లుగానే అనిపించింది.

పదవులు, ఆస్తులు అన్నీ కేటీఆర్ కేనా అని కేసీఆర్ కు రాసిన లేఖలో నిలదీసినట్లు ఏలేటి బయటపెట్టారు. కేసీఆర్(KCR) కు కవిత కొన్ని అంశాలపై లేఖలు రాశారనే ప్రచారం జరుగుతోంది. అయితే లేఖల్లో ప్రస్తావించిన అంశాలు ఏమిటనేది మాత్రం ఎవరికీ తెలీదు. అలాంటిది తాజాగా ఏలేటి మాత్రం కవిత రాసిన లేఖల్లో ఆస్తులు, పదవులపై తండ్రిని నిలదీసినట్లు చెప్పి కొత్తవివాదానికి తెరతీశారు. పదవులు, ఆస్తులన్నింటినీ కొడుకు కేటీఆర్ కే కేసీఆర్ కట్టబెడుతుండటాన్ని తట్టుకోలేని కవిత తొందరలోనే తిరుగుబాటు జెండా ఎగరేస్తారని ఏలేటి జోస్యంచెప్పారు. రాజకీయంగా పదవులు రాకుండా తనను అన్న, కేటీఆర్ తొక్కేస్తున్నారన్న ఆగ్రహం కవితలో కనబడుతోందని ఎంఎల్ఏ చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి)YS Jagan) విషయంలో షర్మిల(YS Sharmila) ఎలా వ్యవహరిస్తున్నారో కేటీఆర్ కు కవిత అలాగే తయారవుతున్నట్లు ఏలేటి అనుమానం వ్యక్తంచేశారు. పార్టీలో ఒకే పవర్ సెంటర్ ఉండాలని కేటీఆర్ అనుకుంటుంటే తనకు కూడా పవర్లో షేర్ కావాలని కవిత పట్టుబడుతున్నట్లు ఎంఎల్ఏ బయటపెట్టారు. బీఆర్ఎస్ ను చీల్చాలని రేవంత్ రెడ్డి(Revanth) చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదని ఎంఎల్ఏ చెప్పారు. అందుకనే తనప్రయత్నాలకు హరీష్ ను రేవంత్ మద్దతుగా వాడుకుంటున్నట్లు ఎంఎల్ఏ బయటపెట్టారు. కేటీఆర్ విదేశాలకు వెళ్ళగానే పార్టీలో చీలికలకు ముహూర్తం రెడీగా ఉందన్నారు. ఈనెలాఖరులోగా కాని లేదా వచ్చే నెల మొదటివారంలో పార్టీ చీలిపోవటం ఖాయమని ఏలేటి బల్లగుద్ది మరీ చెప్పారు. చీలిక కోసం అవసరమైన పనులను రేవంత్ సహకారంతో హరీష్, కవితలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఏలేటి అన్నారు.

అచ్చంగా ఇలాంటి వ్యాఖ్యలు, జోస్యాలే పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma) కూడా చేశారు. పార్టీలో నాలుగుస్తంభాలాట జరుగుతోందన్నారు. పార్టీలో తొందరలోనే చీలికలు ఖాయమన్నారు. పార్టీ అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరిపై కవితలో తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోతోందన్నారు. ఇద్దరు నేతల వ్యాఖ్యలు, జోస్యాలు చూస్తుంటే బీఆర్ఎస్ ను చీల్చేంతవరకు బొమ్మ, ఏలేటి నిద్రపోయేట్లు లేరనే అనిపిస్తోంది.

Read More
Next Story