
కేటీఆర్ శతృవులను తయారుచేసుకుంటున్నారా ?
కొత్తగా తయారుచేసుకున్న శతృవులు ఎవరయ్యా అంటే సొంత చెల్లెలు కల్వకుంట్ల కవిత, తాజాగా బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్
క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎనుముల రేవంత్ రెడ్డితో ఆజన్మవైరం ఉన్నట్లుగా కనబడుతోంది కాబట్టి అదేమి కొత్తది కాదు. అలాగే బీజేపీ నేతలతో పాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో కూడా కేటీఆర్ కు మొదటినుండి పడదు. అయితే కొత్తగా తయారుచేసుకున్న శతృవులు ఎవరయ్యా అంటే సొంత చెల్లెలు కల్వకుంట్ల కవిత, తాజాగా బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. వీరిలో కవిత, రమేష్ ను కేటీఆరే శతృవులుగా తయారుచేసుకున్నట్లు అర్ధమవుతోంది.
ఎవరైనా శతృవుల సంఖ్యను తగ్గించుకునేందుకు చూస్తారు. అదేమిటో విచిత్రంగా కేటీఆర్(KTR) మాత్రం వెతుక్కుని మరీ కొత్త శతృవుల సంఖ్యను పెంచుకుంటున్నారు. చెల్లెలుతో ఆస్తుల వ్యవహారం, పార్టీలో ఆధిపత్యం కోసమే వివాదం ముదిరి పాకానపడిందన్న విషయం అర్ధమవుతోంది. జరుగుతున్నది చూస్తుంటే అన్నా-చెల్లెళ్ళ మధ్య వివాదం చాలాకాలంగానే ఉన్నప్పటికీ నివురుగప్పిన నిప్పులాగ ఉండేది. కవిత(Kavitha) తండ్రి కేసీఆర్(KCR) కు రాసిన లేఖ ఆమె అమెరికాలో(America) ఉన్నపుడు లీక్ అవటంతోనే ఇద్దరి మధ్య విభేదాలు రోడ్డునపడ్డాయి. అప్పటినుండి ఇద్దరి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగే ఉన్న విషయం అందరు చూస్తున్నదే.
ఇక తాజాగా సీఎం రమేష్ తో వ్యవహారం అనవసరంగా గోక్కున్నదే అనిపిస్తోంది. ఎందుకంటే ఒకపుడు ఈ ఇద్దరు అత్యంత సన్నిహితులు. అలాంటిది రేవంత్ మీదున్న కోపాన్ని రమేష్ మీద కేటీఆర్ చూపిస్తున్నట్లు అనిపిస్తోంది. రేవంత్ ను కేటీఆర్ ఎంతగా టార్గెట్ చేస్తున్నా ఉపయోగం కనబడటంలేదు. ఎందుకంటే రేవంత్(Revanth) మీద కచ్చకొద్ది కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. రేవంత్ మీదచేస్తున్న కించపరిచే వ్యాఖ్యలు కూడా ఇందులో భాగమే. మంత్రుల ఫోన్లను రేవంత్ ట్యాపింగ్ చేయిస్తున్నాడు, రేవంత్ కు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అపాయిట్మెంట్ కూడా ఇవ్వటంలేదు, తొందరలోనే పదవి ఊడిపోతుంది లాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు ఇందులోభాగమే.
ఫ్యూచర్ సిటీలోని రోడ్డు కాంట్రాక్టు సీఎం రమేష్ కంపెనీ దక్కించుకుంది. దాంతో వెంటనే రేవంత్ బావమరిదికి కేంద్ర పథకం అమృత్ లో కాంట్రాక్టు ఇప్పించుకుని, రాష్ట్రంలోని ఫ్యూచర్ సిటిలో కాంట్రాక్టు రమేష్ కంపెనీకి రేవంత్ ఇచ్చాడని కేటీఆర్ ఆరోపించాడు. అయితే తన కుమారుడికి అమృత్ పథకంలో టెండర్లు దక్కలేదని, తన కుమారుడు రేవంత్ కు బావమరిది కాదని స్వయంగా ఉపేంద్రరెడ్డే ప్రకటించారు. అమృత్ పథకంలో కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలో తన కొడుకు భాగస్వామి అని మాజీ ఎంఎల్ఏ ఉపేంద్ర చెప్పారు. ఇంతకీ ఉపేంద్రరెడ్డి ఎవరంటే బీఆర్ఎస్ నేతే. రేవంత్ కారణంగానే తన కొడుక్కు అమృత్ పథకంలో కాంట్రాక్టు వచ్చిందన్న కేటీఆర్ ఆరోపణలో నిజంలేదని ఉపేంద్రే ఖండించారు. అయినా సరే కేటీఆర్ అవే ఆరోపణలను పదేపదే చేస్తున్నాడు.
ఇందులో భాగంగానే ఇపుడు సీఎం రమేష్ ను కూడా కలిపి ఇద్దరిపైనా ఆరోపణలు చేశారు. దానికి రమేష్ స్పందించి కేటీఆర్ బాగోతాలన్నీ తవ్వితీస్తున్నాడు. ‘సూదికోసం సంతకు వెళితే’ అన్న సామెతలో చెప్పినట్లు కేటీఆర్ పాత వ్యవహారాలన్నీ ఇపుడు రమేష్ ద్వారా బయటపడుతున్నాయి. పైగా కమ్మ సామాజికవర్గానికి కేటీఆర్ వ్యతిరేకి అనే విషయం కూడా కొత్తగా బయటపడింది. పార్టీని వదిలేసిన తుమ్మల నాగేశ్వరరావు గురించి తన దగ్గర కేటీఆర్ మాట్లాడుతు కమ్మ సామాజికవర్గాన్ని బూతులు తిట్టాడనే విషయాన్ని బయటపెట్టాడు.
నిజానికి రమేష్ తో శతృత్వం పెట్టుకోవాల్సిన అవసరం కేటీఆర్ కు లేదు. అయితే రేవంత్ మీద ఆరోపణలు చేయటం, విమర్శలుచేయాటంలో సంబంధంలేని ఎవరెవరినో కేటీఆర్ పిక్చర్లోకిలాగి మరీ శతృవులుగా తయారుచేసుకుంటున్నారు. కేటీఆర్ వైఖరి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇంకెంతమంది కొత్తశతృవులు పుట్టుకొస్తారో చూడాలి.