
‘నాడు విషం చిమ్మే ఫార్మాకంపెనీలు నేడు సువాసనలు వెదజల్లుతున్నాయా?’
ప్రభుత్వాన్ని నిలదీసిన ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ
ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తున్నారని పత్రికలలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డితో సహా ఇతర కాంగ్రెస్ పెద్దలు విషం చిమ్మేలా కనిపించిన ఫార్మా కంపెనీలు, నేడు సువాసన వెదజల్లే కంపెనీలుగా కనిపిస్తున్నయా?’ అని పలువురు రైతులతో కూడిన ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నిలదీసింది.
‘నాడు ఫార్మా అంటేనే భూతం, ఒక సిరీస్ కంపెనీతోనే 30 ఏండ్ల తర్వాత కూడా కాలుష్యం పోలేదు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వొద్దు. మేం అధికారంలోకి వస్తే ఫార్మా రద్దు, భూసేకరణ రద్దు’ అని చెప్పారని గుర్తు చేసింది. నేడు అదే ఫార్మాసిటీ కోసం రైతుల భూములు గుంజుకొంటున్నారని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆయన క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు ఫార్మాసిటీని రద్దు చేయకపోవడం వల్ల రైతులు భూములు కోల్పోవల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
యాచారం మండలం రైతులకి ఫార్మా సిటీ రద్దు చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని మేనిఫెస్టో లో పెట్టిందని, కానీ ఇప్పుడు ఫార్మా సిటీని రద్దు చెయ్యలేదని కమిటీ సభ్యులుగా ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ఇక్కడ ఫ్యూచర్ సిటీ కడతాం అంటూ, కోర్టులో మాత్రం మేము ఫార్మా సిటీ ని కొనసాగిస్తున్నామని ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చినట్లు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆరోపించింది. గత ఎన్నికల ముందు రైతుల భూములు కాపాడుతాం అని మాట ఇచ్చి ఇప్పుడు రైతులని మీ భూములు ఇయ్యాల్సిందే అని బెదిరిస్తున్నారు అని కమిటీ వాపోయింది.
భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలి
‘‘చట్ట ప్రకారం ఇక్కడ వేరే ప్రాజెక్ట్ కట్టాలంటే ఇప్పుడు ఉన్న భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చెయ్యాలి. మళ్ళీ ప్రతీ గ్రామంలో కొత్త ప్రాజెక్ట్ రిపోర్టు తెలుగులో ఇచ్చి, ప్రజా అభిప్రాయసేకరణ చెయ్యాలి. మళ్ళీ కొత్త పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాలి’ అని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ పేర్కొంది. ఇవేవి చెయ్యకుండా ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో మేము ఫ్యూచర్ సిటీ కడతాం అంటే అది చట్ట ప్రకారం చెల్లదని కమిటీ అంటోంది. అంతే కాదు, యాచారం మండలంలో నాలుగు గ్రామాల్లో మేడిపల్లి, నానాక్నగర్, తాటిపర్తి, కురమిద్ద లో తీసుకున్న భూములని స్వాధీనపర్చుకోకూడదని హై కోర్టు ఇచ్చిన స్టేలు కూడా ఉన్నాయి అని కమిటీ వెల్లడించింది. ఈ భూములని చూపించి ఇక్కడ మేము ఫ్యూచర్ సిటీ కడతాం అని ప్రపంచ దేశాల అధినేతలకి, పారిశ్రామిక సంస్థలని నమ్మిచటం ప్రభుత్వం చేస్తున్న మోసం అని కమిటీ వాపోయింది.
‘‘మేము ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొంటున్న అతిథులకి తెలియచేసేది ఒక్కటే. ఈ ప్రభుత్వం మాట ఇచ్చి మమల్ని మోసం చేసి, ఈ రోజు "ప్రజా పాలన" చేస్తున్నాం అని మీ ముందు ప్రగల్భాలు పలుకుతున్నారు. వీళ్ళని నమ్మి మీరు ఇక్కడ పెట్టుబడులు పెడితే మీరు కూడా మోస పోతారు’ అని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ హెచ్చరించింది.
యాచారం మండలంలో ఐదువేల ఎకరాల అసైన్డ్ భూమి, రెండువేల ఎకరాల పట్టాభూమిని ప్రభుత్వం లాక్కుందని కమిటీకి చెందిన కార్యకర్త కావుల సరస్వతి ‘ఫెడరల్ తెలంగాణ’ తో చెప్పారు. రైతులతో ప్రభుత్వం చర్చించకుండానే భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తుందని విమర్శించారు. ఈ భూములు కోర్టు వివాదాల్లో ఉన్నప్పుడే రేవంత్ ప్రభుత్వం ప్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తానని ప్రగల్బాలు పలకడం శోచనీయమన్నారు. రాజ్యాంగం, చట్టాల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ అంశంపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

