Maoists Party | ఒకరొకరే నెలకు ఒరుగు తెలుగు మావోయిస్టు నేతలు
x
Maoists encounter

Maoists Party | ఒకరొకరే నెలకు ఒరుగు తెలుగు మావోయిస్టు నేతలు

అంతర్థానం అంచుల్లో మావోయిస్టు పార్టీ


మావోయిస్టు కేంద్రకమిటిలో తెలుగు నేతలే కీలకంగా ఉన్నట్లు నిఘావర్గాలు పసిగట్టాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సుమారు 30 మంది మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ములుగుజిల్లా వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవపేటకు చెందిన తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కేంద్రకమిటీ సభ్యుడుగా ఉన్నారు. హనుమకొండ జిల్లా తరాళపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య కూడా కేంద్ర కమిటి సభ్యుడే. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన గాజర్లరవి ఏవోబీ కార్యదర్శి. ములుగుజిల్లా తాడ్వాయ్ మండలం కాల్వపల్లిగ్రామానికి చెందిన బడేచొక్కారావు అలియాస్ దామోదర్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన కొయ్యడసాంబయ్య కూడా కేంద్రకమిటీలో కీలకంగా ఉన్నారు. హనుమకొండ జిల్లా తరాలపల్లికి చెందిన మోడెంబాలకృష్ణ రాష్ట్రకమిటిలో కీలకంగా ఉన్నారు. పైన చెప్పిన వాళ్ళు కాకుండా మరో 25 మంది కేంద్ర, రాష్ట్రకమిటీల్లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు.

ఈమధ్యకాలంలో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టుల చరిత్రలోనే ఎప్పుడూ లేనట్లుగా 2024-25 సంవత్సరంలో పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. గడచిన ఏడాదిలో సుమారు 300 మందికిపైగా మావోయిస్టులు(Maoists) పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. ఛత్తీస్ ఘడ్(Chhattisgarh), ఝార్ఖండ్(Jharkhand),దండకారణ్యం అనే తేడాలేకుండా భద్రతాదళాలు మావోయిస్టులపై వరుసగా విరుచుకుపడుతున్నాయి. ఈదాడుల్లో పోలీసులు గాయపడుతు, చనిపోతున్నా వెనక్కు తగ్గకుండా మావోయిస్టులపై వ్యూహాత్మకంగా దాడులు చేస్తునేఉన్నారు. భద్రతాదళాలు, పోలీసులదాడులతో మావోయిస్టులు విలవిల్లాడిపోతున్నారనే చెప్పాలి. గతంలో ఎప్పుడూలేనంతగా ఈమధ్యనే మావోయిస్టులకు ఎందుకింతగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి ?

"కొద్ది మంది జార్ఖండ్ నాయకులు తప్ప మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుల్లో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలు వాళ్లే. అందున తెలంగాణ వారే. వాళ్లే సైద్దాంతికంగా పార్టీకి అండ. వాళ్లలో ఇపుడు కొంత చనిపోయారు. మిగిలినవాళ్లలో వృద్ధులవుతున్నారు. ఇలా వీళ్లు పార్టీని నడప లేని పరిస్థితి వస్తే, మిగిలేదంతా తుపాకిని ధరించిన సైనికులు. వాళ్లుకు అంత సైద్ధాంతిక విజ్ఞానం లేదు. ఇది పార్టీని సైద్ధాంతిక బలహీనపరుస్తుంది. సైద్ధాంతిక నాయకత్వంలేని పార్టీ కింది స్థాయి వాళ్లను ఉత్తేజపరచలేదు. అపుడు పార్టీ బలహీనపడుతుంది. ఈ పరిస్థితి చూస్తే, మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతమొందించాలన్న ప్రభుత్వం లక్ష్యం గుర్తొస్తుంది," అని ఒక రిటైర్డు పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. 2025 మొదటి 21 రోజుల్లో48 నక్సలైట్లను సెక్యూరిటీ దళాలు చంపేశాయి. 2024లో మొత్తంగా 290 మందిని చంపేశారు. 2023లో అంతమయిన నక్సలైట్లు కేవలం 50 మందే.

దీని పరిణామం ఎలా ఉంటుంది?

మావోయిస్టు పార్టీ ఈ స్థితికి రావడానికి నాలుగుకారణాలున్నాయి. అవేమిటంటే ఎక్కువమందికి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. రాష్ట్ర, కేంద్ర కమిటీల్లోని కీలక నేతలంతా వృద్ధాప్యంతో బాధలుపడుతున్నారు. మూడో సమస్య ఏమిటంటే కొత్త రిక్రూట్మెంట్ దాదాపు ఆగిపోవటం. నాలుగో కారణం ఏమిటంటే వివిధ కారణాలతో లొంగుబాట్లు పెరిగిపోవటం. ఒకపుడు మావోయిస్టులకు ఏవోబీ అంటే ఆంధ్రా ఒడిస్సా బార్డర్ పెట్టని కోటగా చెప్పాలి. అలాంటి ఏవోబీ(AOB)లో మావోయిస్టుల కోసం భద్రతాదళాలు, పోలీసులు అంగుళంఅంగుళం జల్లెడపడుతున్నారు. నమ్మకమైన ఇన్ఫార్మర్ల వ్యవస్ధతో మావోయిస్టుల ఆచూకీ కనుక్కుని దాడులు చేసి హతమార్చేస్తున్నారు. దాంతో ఏవోబీ ఎంతమాత్రం సేఫ్ కాదన్న ఉద్దేశ్యంతో మావోయిస్టులు దండకారణ్యం, ఛత్తీస్ ఘడ్ లో తలదాచుకుంటున్నారు.

ఛత్తీస్ గఢ్ లోని అబూజ్ మడ్ (Abhujmad) లో మావోయిస్టు అగ్రనేతలు క్యాంపువేసినట్లుగా సమాచారం తెలుసుకున్న భద్రతాదళాలు వరుసబెట్టి దాడులు చేస్తున్నాయి. దాంతో షెల్టర్ జోన్ గా ఎక్కడికివెళ్ళాలో మావోయిస్టు అగ్రనేతలకు దిక్కుతోచటంలేదు. అందుబాటులోని సమాచారం ప్రకారం చాలామంది మావోయిస్టు కీలకనేతలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులుపడుతున్నారు. మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోయిన కేంద్రకమిటి సభ్యుడు చలపతి కూడా రెండుకర్రల సాయంతోనే నడుస్తున్నారు. కర్రలసాయం లేకుండా చలపతి ఒక్కఅడుగు కూడా ముందుకు కదల్లేని పరిస్ధితిలో ఉన్నారు. ఈ విషయం నిఘావర్గాలకు పక్కాగా తెలిసింది. మావోయిస్టు రథసారథి నంబాళ్ళ కేశవరావు, మాజీ కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణరావు(గణపతి Ganapathi), మల్లోజుల వేణుగోపాల్ వయసు 70 దాటిపోయింది. వయసుపైనబడటంతో పాటు వీళ్ళంతా జ్ఞాపకశక్తి కోల్పోయారని సమాచారం. వీళ్ళముగ్గురు తమతో ఉన్నవాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోతున్నారని చెబుతున్నారు.

ఇక మిగిలిన కీలక నేతలు కడారి సత్యనారాయణరెడ్డి, మోడెం బాలకృష్ణ, తెంటు లక్ష్మీనర్సింహాచలం, వుల్లూరి ప్రసాదరావు కూడా తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నారు. మావోయిస్టుల భావజాలంపై నమ్మకాలు తగ్గిపోవటంతోనే కొత్త రిక్రూట్మెంట్ కావటంలేదు. రిక్రూట్మెంట్ జరగకపోగా ఉన్న వాళ్ళు ఎన్ కౌంటర్లలో చనిపోవటం లేదా లొంగిపోతుండటంతో మావోయిస్టుపార్టీ తీవ్రమైన క్యాడర్ సమస్యతో ఇబ్బందులుపడుతోంది. కేంద్రకమిటీసభ్యుల్లో పోతుల కల్పన, తిప్పిరి తిరుపతి, గాజర్లరవి, కట్టా రామచంద్రారెడ్డి, బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, పసునూరి నరహరి లాంటి అతికొద్దిమంది మాత్రమే కాస్త యాక్టివ్ గా ఉన్నారు. ఈమధ్యనే కాంకేర్ లో అరెస్టయిన కీలకనేత ప్రభాకరరావు ద్వారానే భద్రతాదళాలు మిగిలిన కీలకనేతల ఆచూకీని తెలుసుకుంటున్నట్లు మావోయిస్టులు అనుమానిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగానే కేంద్రకమిటి సభ్యులు ఎక్కడున్నారనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత భద్రతాదళాలు దాడులు చేస్తున్నాయి.

వరుసదెబ్బలు

గడచిన ఏడాదిగా మావోయిస్టులకు దారుణమైన ఎదురుదెబ్బలు తగులున్నాయనే చెప్పాలి. 2024లో సుమారు 300 మందికి పైగా మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో చనిపోయారు. భద్రతాదళాలు 450 మందిని అరెస్టుచేస్తే మరో 850 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. 2025 ఆరంభంలోనే మావోయిస్టులకు ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ఈనెల 5వ తేదీన బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు, 15వ తేదీన బీమారంపాడు అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో 12 మంది, తాజాగా గరియాబాద్ అడవుల్లోని ఎన్ కౌంటర్లో సుమారు 30మంది చనిపోయారు.

కొనఊపిరితో నక్సలిజం: అమిత్ షా వాఖ్య

నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్ సందర్భంగా కేంద్రహోం మంత్రి అమిత్ షా ఒక ఆసక్తికరమయిన ట్వీట్ చేశారు. ఈ రోజు నక్సలిజం కొన వూపరితో కొట్టుమిట్టాడుతున్నదని అన్నారు.

"నక్సలిజానికి మరొక భారీ దెబ్బ తగిలింది. నక్సల్స్ లేని భారతదేశాన్ని నిర్మించడంలో మన సెక్యూరిటీ దళాలు మరొక విజయం సాధించాయి. ఒదిశా చత్తీస్ గడ్ సరిహద్దుల్లో సిఆర్ పిఎప్ దళాలు, ఒదిశా ఎస్ వొ జి, చత్తీష్ గడ్ పోలీసులు కలసి 14 మంది నక్సలైట్లను హతమార్చారు. నక్సల్ రహిత భారత్ ఏర్పాటుచేసే దృఢ సంకల్పంతో, సెక్యూరిటీ దళాల ఉమ్మడి వ్యూహాలతో నక్సలిజం ఈరోజు కొనవూపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంది," అని అమిత్ షా అన్నారు.




Read More
Next Story