BCs and Localbody Elections|బీసీలతో బంధుత్వానికి ప్రయత్నిస్తున్నాయా ?
బంధుత్వం అంటే కేవలం బీసీలను ఆకర్షించి ఓట్లేయించుకుని రాజకీయ ప్రయోజనం పొందటం అనే గమనించాలి.
రాజకీయపార్టీలన్నీ ఒక్కసారిగా బీసీల జపం మొదలుపెట్టేశాయి. రాజకీయ అవసరాలకోసం బీసీలతో బంధుత్వం కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లున్నాయి. ఇక్కడ బంధుత్వం అంటే కేవలం బీసీలను ఆకర్షించి ఓట్లేయించుకుని రాజకీయ ప్రయోజనం పొందటం అనే గమనించాలి. ఏ పార్టీవైపు బీసీ(BCs)లు మెజారిటి మొగ్గుచూపుతారో ఆపార్టీయే రాబోయేఎన్నికల్లో గరిష్టంగా లబ్దిపొందుతుందన్న విషయం అందరికీతెలిసిందే. అందుకనే బీసీలను ఆకర్షించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ(Congress), ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) తో పాటు ప్రతిపక్ష బీజేపీ(BJP)లు తెగ ప్రయత్నిస్తున్నాయి. 3వ తేదీన మూడుపార్టీల నేతలు పోటాపోటీగా సావిత్రీబాయ్ పూ(Savitribai Pule)లే జయంతి కార్యక్రమాలను నిర్వహించటమే దీనికి ఉదాహరణ. రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Maheshkumar goud) పాల్గొన్నారు.
అలాగే ఇందిరాపార్క్ దగ్గర బీసీలసంఘాలతో కేసీఆర్(Kavitha) కూతురు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఆందోళన జరిగింది. బీజేపీ కార్యాలయంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సావిత్రీబాయ్ పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఒక్కసారిగా వీళ్ళందరికీ సావిత్రీబాయ్ పూలే జయంతి మీద ఎందుకింత ప్రేమవచ్చేసింది ? ఎందుకంటే తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో మ్యాగ్జిమమ్ లబ్దిపొందాలని. పార్టీలు ఎన్నికల్లో లబ్డిపొందాలంటే అందుకు బీసీ సామాజికవర్గాల మెజారిటి మద్దతు తప్పనిసరి. బీసీల మద్దతులేకపోతే ఏపార్టీ కూడా ఎన్నికల్లో మంచిఫలితాలు సాధించే అవకాశంలేదన్నది వాస్తవం. అందుకనే పార్టీలు పోటాపోటీగా సావిత్రీబాయ్ పూలే జయంతిని వేదికగా ఉపయోగించుకున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయంఏమిటంటే మూడుపార్టీలు కూడా బీసీలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వటంలేదన్నది వాస్తవం.
బీఆర్ఎస్ విషయాన్ని తీసుకుంటే పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు కేటీఆర్(KTR) లేదా కవిత ఏనాడూ బీసీల ప్రాధాన్యతగురించి పెద్దగా మాట్లాడిందిలేదు. పైగా స్ధానికసంస్ధల ఎన్నికల్లో కేసీఆర్ హయాంలోనే బీసీల రిజర్వేషన్ 34 శాతం నుండి 22 శాతానికి తగ్గిపోయింది. బీసీల రిజర్వేషన్ శాతం తగ్గిపోవటంపై కేటీఆర్, కవిత ఒక్కసారి కూడా కేసీఆర్ ను ప్రశ్నించలేదు. రిజర్వేషన్ల శాతం తగ్గటంపై ఒక్కసారికూడా జనాలకు సంజాయిషీ ఇచ్చుకోలేదు. బీసీ సంఘాల నేతలతో మీటింగు పెట్టి రిజర్వేషన్ ఎందుకు తగ్గించాల్సొచ్చిందో వివరించలేదు. జ్యోతీరావుపూలే(Jyotirao Pule) విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటుచేయాలని కవిత ఇపుడు గోల చేస్తున్నారు. మరి పదేళ్ళఅధికారంలో పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించాలని కేసీఆర్ ను కవిత ఎందుకుఅడగలేదు ? పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటుచేయాలన్న ఆలోచన కూడా కవితకు రాలేదు.
స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీపరంగా బీఆర్ఎస్ అధికశాతం బీసీలకు అవకాశాలు కల్పించాలని కవిత, కేటీఆర్ ఏనాడూ కేసీఆర్ ను డిమాండ్ చేయలేదు. తాము అధికారంలో ఉన్నపుడు బీసీల ప్రయోజనాలగురించి పట్టించుకోని కేటీఆర్, కవిత ఇపుడు మాత్రం తమప్రభుత్వంలో బీసీలకు బ్రహ్మరథం పట్టినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదేసమయంలో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసంచేస్తోందని పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. బీసీల హక్కుల కోసం బీసీసంఘాల నేతలు కవిత నాయకత్వంలో ఆందోళనచేయటంపైన కూడా బీసీల్లో మిశ్రమస్పందన ఉంది. ఇక కాంగ్రెస్ విషయంతీసుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికలసమయంలో కామారెడ్డిలో బీసీల సదస్సుజరిగింది. ఆ సదస్సులో పాల్గొన్న రేవంత్(Revanth) స్ధానికసంస్ధలఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని కమిట్ అయ్యారు. నిజానికి అప్పట్లో బీసీల రిజర్వేషన్ పై రేవంత్ ఇచ్చిన హామీ ఆచరణసాధ్యంకాదని అందరికీ తెలుసు. సుప్రింకోర్టు తీర్పుప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు పదిశాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అంటే మొత్తం రిజర్వేషన్లలో 28 శాతం ఎస్సీ, ఎస్టీలకే అయిపోయింది. మిగిలింది 22 శాతం రిజర్వేషన్లు మాత్రమే.
22 శాతం మాత్రమే రిజర్వేషన్ క్యాటగిరీల్లో భర్తీ చేసే అవకాశం ఉన్నదని బాగా తెలిసి కూడా రేవంత్ 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం అంటే బీసీలను మోసంచేయటమే. రాజ్యాంగం ప్రకారమో లేకపోతే చట్టం ప్రకారమో బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42శాతం రిజర్వేషన్ అమలుచేయటం ఎప్పటికీ సాధ్యంకాదు. అయితే బీసీలకు రేవంత్ ఇచ్చిన హామీని అమలుచేసేందుకు ఒక అవకాశం ఉంది. అదేమిటంటే గతంలో ఏపీలో(Jaganmohan Reddy) జగన్మోహన్ రెడ్డి అమలుచేసిన మార్గమే. రాజ్యాంగాన్ని, చట్టాన్ని పక్కనపెట్టేసి జగన్ చేసింది ఏమిటంటే పార్టీ పరంగా బీసీలకు పెద్దపీట వేశారు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించటంలో భాగంగా ఓపెన్ క్యాటగిరి సీట్లలో మెజారిటి పదవులు బీసీలకే కేటాయించారు. దీనివల్ల ఏమైందంటే మిగిలిన సామాజికవర్గాలను జగన్ గాలికి వదిలేసి కేవలం బీసీలను మాత్రమే నెత్తినపెట్టుకుంటున్నారనే నెగిటివ్ ప్రచారం పెరిగిపోయింది. ఇపుడు తెలంగాణాలో కూడా రేవంత్ ఇచ్చిన హామీ 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలంటే అనధికారికంగా పార్టీపరంగా ఓపెన్ కేటగిరి సీట్లలో కూడా బీసీలకే ప్రాధాన్యతివ్వాలి. ఏపీలో జగన్ అంటే ఆపని చేయగలిగారు కాని తెలంగాణాలో రేవంత్ చేయగలరా ? అన్నది అనుమానమే.
చివరగా బీజేపీ విషయం చూస్తే కేంద్రప్రభుత్వం జనగణన చేయబోతోంది. ఈ సమయంలో జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్లు చేస్తున్నాయి. కులగణన చేస్తే ఏ కులంజనాభా ఎంతనే విషయంలో స్పష్టత వస్తుందని మొత్తుకుంటున్నాయి. అయితే నరేంద్రమోడి(Narendra Modi) మాత్రం ప్రతిపక్షాల డిమాండును ఏమాత్రం పట్టించుకోవటంలేదు. జనగణనతో పాటు కులగణన కూడా చేయటంలో కేంద్రప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటో అర్ధంకావటంలేదు. బీసీల గురించి ప్రతిపక్షాలు ఎప్పుడు మాట్లాడినా బీసీ అయిన నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేసిన ఏకైక పార్టీ అని బీజేపీ ఊదరగొడుతోంది. మోడీ ప్రధాని అయితే బీసీలందరు ప్రధానమంత్రులు అయినట్లే అన్న అర్ధం వచ్చేట్లుగా కమలంపార్టీ నేతలు మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ నేతల ఎదురుదాడి
కేటీఆర్, కవిత డిమాండ్ విషయంలో కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుచేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్న కేటీఆర్, కవిత తమ ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పాలని వేములవాడ ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ రాజీనామా చేసి ఆస్ధానంలో బీసీనేతను నియమించగలరా ? అని నకిరేకల్ ఎంఎల్ఏ వేముల వీరేశం చాలెంజ్ విసిరారు. అధికారంలోఉన్నపుడు జ్యోతీరావుపూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఎందుకు ఏర్పాటుచేయలేదో చెప్పాలని కవితను డిమాండ్ చేశారు. అయితే పై మూడు ప్రశ్నలకు అన్నా, చెల్లెళ్ళు నోరిప్పటంలేదు. బీసీ సామాజికవర్గాలు, సంఘాల నేతలు పైమూడుపార్టీల ప్రయాసలను గమనిస్తున్నారు. తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా నిలుస్తారన్నది ఆసక్తిగా మారింది.