ఫిరాయింపు ఎంఎల్ఏలు పిచ్చెక్కిస్తున్నారా ?
బీఆర్ఎస్ ఎంఎల్ఏనే అని కాంగ్రెస్ లో చేరలేదని కౌంటర్ ఇవ్వటంతో బీఆర్ఎస్ నేతలకు ఒక్కసారిగా షాక్ తగిలింది.
ఫిరాయింపు ఎంఎల్ఏలు ఏకకాలంలో రెండు పార్టీల్లోను పిచ్చెక్కిస్తున్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏలు అంటే అచ్చంగా బీఆర్ఎస్ ఫిరాయింపు(BRS Defected MLAs) ఎంఎల్ఏలు అనే అర్ధం. బీఆర్ఎస్(BRS) నుండి ఇప్పటివరకు పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్(Congress) లోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే. వీళ్ళంతా రేవంత్ ను తమ మద్దతుదారులతో కలిసి కండువాలు కప్పుకుని తాము కాంగ్రెస్ లో చేరినట్లు ప్రకటించిన వారే. పదిమంది ఫిరాయింపుల్లో శేరిలింగంపల్లి(Serilingampalli) ఎంఎల్ఏ అరెకపూడి గాంధి, జగిత్యాల(Jagityal) ఎంఎల్ఏ రూటే సపరేటుగా ఉంది. విషయం ఏమిటంటే వీళ్ళిద్దరిలో గాంధిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పబ్లిక్ అకౌంట్స్ కమిటి (Public Accounts Committee) (పీఏసీ) ఛైర్మన్ గా నియమించారు. అప్పటినుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), హరీష్ రావు(Harish Rao), పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పెద్దఎత్తున గొడవ చేశారు.
ఎందుకంటే అధికారపార్టీలోకి ఫిరాయించాడు కాబట్టి ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ పోస్టును గాంధీకి ఎలాగ ఇస్తారని గోలగోల చేస్తున్నారు. దీనిపై గాంధీ(Arekapudi Gandhi) మాట్లాడుతు తాను బీఆర్ఎస్ ఎంఎల్ఏనే అని కాంగ్రెస్ లో చేరలేదని కౌంటర్ ఇవ్వటంతో బీఆర్ఎస్ నేతలకు ఒక్కసారిగా షాక్ తగిలింది. గాంధీ ప్రకటనపైనే కౌశిక్ రెడ్డి నానా గలబా చేసింది. గాంధీ ప్రకటనతో శేరలింగంపల్లి బీఆర్ఎస్ లో ఉన్నాడా ? లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నాడా అనే క్లారిటీలేక అందరిలో అయోమయం పెరిగిపోతోంది. తనను ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎంఎల్ఏగా గుర్తించే స్పీకర్ పీఏసీ ఛైర్మన్ పోస్టు ఇచ్చారని గాంధీ సమర్ధించుకుంటున్నారు. దాంతో ఏమిచేయాలో కేటీఆర్, హరీష్ కు దిక్కుతోచటంలేదు.
గాంధీ విషయాన్ని పక్కనపెట్టేస్తే జగిత్యాల ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్ (Jagityla MLA SanjayKumar) కూడా అదే బాటలో వెళుతున్నారు. ఈమధ్యనే జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంఎల్సీ తటిపర్తి జీవన్ రెడ్డి( Congress MLC Jeevan Reddy) ప్రధాన మద్దతుదారుడు గంగిరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న తగాదాల కారణంగానే తన మద్దతుదారుడిని ఎంఎల్ఏ సంజయ్ అనుచరుడు దాడిచేసి హత్య చేసినట్లు జీవన్ రెడ్డి పదేపదే ఆరోపించారు. సంజయ్ కు కాంగ్రెస్ నేతలు, క్యాడర్ ఎవరూ మద్దతుగా నిలబడటంలేదని కూడా ఎంఎల్సీ మండిపోయారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరటమే నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ ఇష్టంలేదని కూడా అన్నారు. హత్య వివాదాం బాగా పెరిగి పెద్దదయిపోవటంతో స్పందించిన సంజయ్ తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరనేలేదని కూడా స్పష్టంచేశారు. గంగిరెడ్డి హత్యకు తనకు ఎలాంటి సంబంధంలేదని కూడా ప్రకటించారు.
దాంతో సంజయ్ కాంగ్రెస్ లో చేరకపోతే మరి రేవంత్ ను కలిసి కప్పుకున్న కండువా ఏమిటని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలు ఆశ్చర్యపోయారు. వీళ్ళిద్దరు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీ తరపున. కాని ఇపుడు అంటకాగుతున్నది ఏమో కాంగ్రెస్ తో. కాని వీళ్ళు ప్రకటిస్తున్నది మాత్రం తాము బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ లో చేరలేదని. వీళ్ళిద్దరికి లాగే ఆరుగురు ఎంఎల్సీలు కూడా కారుపార్టీలో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. వీరిలో పట్నం మహేందర్ రెడ్డిని విప్ గా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నియమించారు. పట్నంను విప్ గా గుత్తా ఏ పార్టీ తరపున నియమించారో ఎవరికీ అర్ధంకావటంలేదు. బీఆర్ఎస్ తరపున నియమిస్తే సమాచారం రావాల్సింది పార్టీ అధినేత కేసీఆర్ దగ్గర నుండి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి పట్నం ఫిరాయించారు కాబట్టి కేసీఆర్ దగ్గర నుండి ప్రతిపాదన రాదు. బీఆర్ఎస్ ఎంఎల్సీని మండలి విప్ గా నియమిస్తు రేవంత్(Revanth Reddy) ప్రతిపాదించినా మరొక కాంగ్రెస్ నేత ప్రతిపాదించినా సాంకేతికంగా చెల్లదు. ఎందుకంటే ఒకపార్టీ ఎంఎల్సీని మరోపార్టీ ప్రతిపాదించేందుకు లేదు. మరలాంటపుడు పట్నంను మండలిలో విప్ గా నియమించింది ఎవరు ? గుత్తా ఎలా ప్రమాణస్వీకరం చేయించారు అన్నది ఎవరికీ అర్ధంకావటంలేదు. ఎందుకో తెలీటంలేదు కాని పట్నం విషయంలో బీఆర్ఎస్ నుండి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తంకాలేదు ఇంతవరకు. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.