Revanth l రేవంత్ నియోజకవర్గంలో గ్రామాలు ఖాళీ అయిపోయాయా ?
అరెస్టుల భయంతో పోలీసులు ఎప్పుడొచ్చి ఇళ్ళ మీదపడి లాక్కుని పోతారో అని భయపడిపోయిన గ్రామస్తులు తమ ఊర్లను ఖాళీచేసి వెళ్ళిపోతున్నారు.
రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లోని మూడు గ్రామాల జనాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అరెస్టుల భయంతో పోలీసులు ఎప్పుడొచ్చి ఇళ్ళ మీదపడి లాక్కుని పోతారో అని భయపడిపోయిన గ్రామస్తులు తమ ఊర్లను ఖాళీచేసి వెళ్ళిపోతున్నారు. కొడంగల్(Kodangal Constituency) నియోజకవర్గం దుద్యాల మండలంలోని లగచర్ల(Lagacharla), రోటిబండతండా, పులిచెర్లకుంట గ్రామాల్లో చాలా ఇళ్ళకు తాళాలు కనబడుతున్నాయి. మంగళవారం ఉదయం నుండి గ్రామస్తులు ఇళ్ళకు తాళాలు వేసుకుని ఎవరికి వారు ఊర్లను వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నారు. దాంతో పోలీసులు కూడా అలర్టయ్యారు.
ఇంతకీ ఏమి జరిగిందంటే సోమవారం మధ్యాహ్నం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్(Vikarabad Collector Pratik Jain), అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి లగచర్ల గ్రామంలో సమావేశానికి వచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా యూనిట్ల(Pharma Units) ఏర్పాటుకు ప్రభుత్వం 3 వేల ఎకరాలను సేకరించబోతోంది. ఈ విషయమై నియోజకవర్గంలోని కొందరు గ్రామస్తులతో రేవంత్ తరపున ఉన్నతాధికారులు ఇప్పటికే మాట్లాడారు. ఫార్మా యూనిట్ల ఏర్పాటుకు సానుకూలంగా కొందరు రైతులు స్పందిస్తే మరికొందరు రైతులు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్న రైతుల గ్రామాలు లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంటలోని గ్రామస్తులు, రైతులతో మాట్లాడి కన్వీన్స్ చేసేందుకు కలెక్టర్ తన అధికారులతో గ్రామసభను ఏర్పాటుచేశారు.
ఒకవైపు గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతుండగానే గ్రామస్తులు అడ్డుకున్నారు. కలెక్టర్ ను మాట్లాడనీయకుండా గ్రామస్తులు పదేపదే అడ్డుపడుతుండటాన్ని అడిషినల్ కలెక్టర్ తప్పుపట్టారు. ముందు కలెక్టర్ ఏమి చెబుతున్నారో విని ఆ తర్వాత గ్రామస్తులు మాట్లాడాలని గట్టిగా చెప్పారు. గ్రామస్తులకు మండిపోయి ఒక్కసారిగా చుట్టుముట్టారు. దాంతో అక్కడ ఏమి జరుగుతోందో అర్ధంకాలేదు. ఈ నేపధ్యంలోనే కలెక్టర్(Attack on Collector) పైన ఎవరో చేయిచేసుకున్నారు. ఇదే అదునుగా గుంపులోని మరికొంతమంది అడిషినల్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ పైన పిడిగుద్దులు కురిపించారు. అంతేకాకుండా వీళ్ళని గ్రామస్తులు తరిమి తరిమి కొట్టారు. కలెక్టర్ తో పాటు అధికారులు కార్లు ఎక్కి వెళ్ళిపోదామని ప్రయత్నించినా విడిచిపెట్టకుండా వెంటపడి కార్లను ధ్వంసంచేశారు. జరిగినదంతా గమనించిన పోలీసులకు ఇదంతా ప్రీప్లాన్డ్ అని అర్ధమైపోయింది.
సీన్ మారిపోయింది
అందుకనే సోమవారం అర్ధరాత్రి వందలసంఖ్యలో పోలీసులు పై మూడు గ్రామాలను చుట్టుముట్టారు. ఉదయం జరిగిన దాడి ఘటనల వీడియోలను విశ్లేషించిన పోలీసులు గ్రామస్తులందరినీ గుర్తించారు. దాడిచేసిన గ్రామస్తులు పైమూడు గ్రామాలవారుగా తెలుసుకున్నారు. అందుకనే రాత్రివరకు వెయిట్ చేసి అర్ధరాత్రి దాడిచేసి చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి తలపుతట్టడంతో బయటకు వచ్చిన ఇళ్ళ యజమనుల్లో వచ్చిన వారిని వచ్చినట్లే పోలీసులు ఎత్తి లోపలేసుకుని వాహనాల్లో తీసుకెళ్ళిపోయారు. తర్వాత కాసేపటికి కాని తమ ఇంట్లో వాళ్ళని పోలీసులు అరెస్టులు చేసి తీసుకెళ్ళినట్లు ఇంట్లో వాళ్ళకి అర్ధంకాలేదు. దాంతో అప్పటికప్పుడు గ్రామాల్లోని జనాలందరు సమవేశాలు పెట్టుకున్నారు. జరిగిందానిపై చర్చించుకుని ఏమి జరగబోతోందనే విషయాలను కూడా మాట్లాడుకున్నారు. దాంతో ఉదయం అవటం ఆలస్యం పై మూడు గ్రామాల్లోని జనాలు తమ ఇళ్ళకు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు.
పై మూడు గ్రామాల్లోని గ్రామస్తులు చాలామంది ఇళ్ళకు తాళాలు వేసుకుని మాయమైపోయారు. తమ ఇళ్ళపైన పడి పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అనేభయంతోనే చాలామంది గ్రామస్తులు ఊర్లను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు సుమారు 60 మందిని అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం అంతా వీరిని విచారించి జరిగిన దాడితో ఎలాంటి సంబంధంలేదని నిర్ధారించుకుని 45 మందిని వదిలిపెట్టేశారు. మిగిలిన 15 మందిని మంగళవారం సాయంత్రం కోర్టులో ప్రవేశపెట్టి రిమండుకు తరలించారు. మొత్తానికి రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మా యూనిట్ల ఏర్పాటు విషయం ఏమో కాని నియోజకవర్గంలోని గ్రామాలను గ్రామస్తులు ఖాళీ చేసి వెళ్ళిపోవటం సంచలనంగా మారింది. లగచర్లలోని ఒక రైతు మాట్లాడుతు కలెక్టర్ మీద దాడికి సంబంధించి తమను ఎక్కడ అరెస్టు చేస్తారో అని భయపడి చాలామంది ఇళ్ళని ఖాళీచేసి వెళ్ళిపోయినట్లు చెప్పారు. కలెక్టర్ మీద జరిగిన దాడితో గ్రామస్తుల్లో రైతుల్లో ఎవరికీ సంబంధంలేదన్నాడు.
కలెక్టర్ పై దాడి వెరీ సీరియస్
కలెక్టర్ పై దాడిని ప్రభుత్వం వెరీ సిరియస్ గా తీసుకుంది. కలెక్టర్ అంటే జిల్లాలో మొదటి పౌరుడే కాకుండా జిల్ల మెజిస్ట్రేట్ కూడా. ప్రధమ పౌరుడు, జిల్ల మెజిస్ట్రేట్ మీద జనాలు దాడిచేస్తే ప్రభుత్వం పోనీలెమ్మని ఊరుకోదు కదా. దాడిచేసిన వారిపై యాక్షన్ తీసుకోకపోతే ప్రభుత్వం చేతకానిదిగా ముద్రపడిపోతుంది. రేపు మరో జిల్లా కలెక్టర్ మీద కూడా ఇలాగే దాడి జరుగుతుంది. అందుకనే ఇపుడు జరిగిన దాడి ఇదే మొదటిదిగా ఇదే చివరిదిగా అణిచివేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దానికి తగ్గట్లే జరిగిన దాడిలో మూడు గ్రామాల జనాలను గుర్తించిన పోలీసులు వెంటపడి, వేటాడి మరీ అరెస్టులు చేస్తున్నారు.