జూబ్లీహిల్స్ ఎన్నికలో పార్టీలకు ఓటర్ల షాక్
x
Slow polling in Jubilee Hills by poll

జూబ్లీహిల్స్ ఎన్నికలో పార్టీలకు ఓటర్ల షాక్

ఉపఎన్నికలో కూడా ఓటర్లకు చురుకు పుట్టలేదా ?


జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓటర్లు అన్నీపార్టీలకు కలిపి పెద్ద షాకిచ్చారు. ఓటింగ్ చాలా చాలా మందకొడిగా సాగుతోంది. ఏమిచేస్తే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓటర్లకు చురుకుపుడుతుందో అర్ధంకావటంలేదు. ఓటింగ్ సరళిని చూసి ఎన్నికల కమీషన్ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 12 గంటలకు కేవలం 20 శాతం పోలింగ్ మాత్రమే నమోదవ్వటం ఆశ్చర్యంగా ఉంది. ఉపఎన్నికలో గెలుపుకోసం కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నీవన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి గట్టిగా ప్రచారం చేసుకున్నారు. వీళ్ళ తరపున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు గడచిన మూడువారాలు హోరాహోరీగా ప్రచారం చేశారు. రోడ్డుషోలు, కార్నర్ మీటింగులు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తించేశారు.

ఉపఎన్నికలో గెలుపు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు పెద్ద సవాలుగా నిలిచింది. అందుకనే రెండుపార్టీలు గెలుపును ఇంత ప్రతిష్టగా తీసుకున్నాయి. నియోజకవర్గంలోని కాలనీలు, 70 బస్తీల్లోని 4.01 లక్షల ఓటర్లను ఒకటికి రెండుసార్లు ప్రచారంలో అభ్యర్ధులు, అభ్యర్ధుల తరపున పార్టీల నేతలు కలిశారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించుకునేందుకు రెండుపార్టీలు ప్రత్యేకంగా యంత్రాంగాలను ఏర్పాటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అయితే ప్రతి వందమంది ఓటర్లకు ఒక ఇంచార్జిని నియమించింది. పార్టీలతో సంబంధంలేకుండా జూబ్లీహిల్స్ ఆటో యూనియన్ పోలింగ్ శాతం పెంచేందుకు మంచినిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళదలచుకున్న వృద్ధులు, గర్భిణీలు, వికలాంగులను ఉచితంగా తీసుకెళుతున్నాయి. ఉచితప్రయాణంకోసం నియోజకవర్గంలో యూనియన్ 400 ఆటోలను తిప్పుతున్నది.

పార్టీలు, ఆటో యూనియన్ ఓటర్ల రాకపోకల కోసం ఇన్ని ఏర్పాట్లుచేసినా ఓటర్లలో చురుకుపుట్టకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఓట్లేయటానికి ఓటర్లు ఎందుకనో పెద్ద ఆశక్తిచూటంలేదు. మధ్యాహ్నం 12 గంటలకు 20 శాతం మాత్రమే పోలైందంటే ఓటింగ్ ఎంత మందకొడిగా సాగుతున్నదో అర్ధమవుతున్నది. 7 గంటలకు మొదలైన పోలింగ్ మొదటిగంటలోనే 9శాతం ఓటింగ్ నమోదైంది. దీన్నిబట్టి ఓటర్లు క్యూలైన్లలో బారులుతీరటం ఖాయమని, ఉపఎన్నికలో భారీ ఓటింగ్ శాతం నమోదవుతుందనే అందరు అంచనాలు వేసుకున్నారు. తీరాచూస్తే మొదటి గంటలో మాత్రమే ఓటర్లు కనిపించారు. తర్వాత 8 గంటల నుండి 12 గంటలవరకు అంటే 4 గంటలు పోలింగ్ చాలా నీరసంగా జరిగిందనే చెప్పాలి.

ఈ నియోజకవర్గంలో పోలింగ్ ఎందుకనో మొదటినుండి మొక్కుబడిగానే సాగుతోంది. మొదటినుండి అంటే ఈ ఉపఎన్నికలో అనికాదు 2014 నుండీ ఇదేవిధంగా నమోదవుతోంది. 2014 ఎన్నికలో 50.18 శాతం, 2018లో 45.59శాతం, 2023లో 47.58శాతం ఓటింగ్ నమోదైంది. పార్లమెంటు ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ కూడా ఒకటి. 2019, 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 39.89, 2024 ఎన్నికల్లో 45.59 శాతం ఓట్లు మాత్రమే నమోదైంది. నియోజకవర్గంలో 70 బస్తీలున్నాయి. ఇంతపెద్దఎత్తున బస్తీలున్నాయి కాబట్టే ఓటింగ్ చాలా జోరుగా జరుగుతుందని పార్టీలతో పాటు ఎన్నికల కమీషన్ అధికారులు కూడా అంచనా వేశారు. రెగ్యులర్ ఎన్నికల్లో పోలింగ్ పెద్దగా జరగకపోయినా ఇపుడు ఉపఎన్నికలో పార్టీలు పోటాపోటీగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువస్తాయి కాబట్టి పోలింగ్ శాతం భారీగా నమోదవుతుందని అనుకున్నారు. తీరాచూస్తే 20శాతంగా పోలింగ్ నమోదవ్వటమే విచిత్రంగా ఉంది.

అందరినీ ఇపుడు తొలిచేస్తున్న ప్రశ్న ఏమిటంటే ఓటింగులో పాల్గొనటానికి ఓటర్లు ఎందుకింత నిరాసక్తత వ్యక్తంచేస్తున్నారని. ఉదయం మొదటిగంటలో పోలింగ్ చూసి చివరకు 60శాతం దాటిపోతుందని చాలామంది సంబరపడ్డారు. తీరాచూస్తే మొదటికే మోసం వచ్చేట్లుంది. గతఎన్నికల్లో నమోదైన 47.58శాతమైనా నమోదవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ‘‘ఓటు హక్కును వినియోగించుకోండి ఓటు వేయటం హక్కే కాదు బాధ్యత కూడా’’ అని సినీ నటుడు తనికెళ్ళభరణి ఓటింగ్ కు వచ్చినపుడు విజ్ఞప్తిచేశారు. ‘‘ఓట్లు వేయనపుడు అభివృద్ధి గురించి ఎంఎల్ఏని నిలదీసే హక్కుండదు’’ అని చురకలు కూడా అంటించారు. అయినా జనాల్లో చురుకుపుట్టకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. మధ్యాహ్నం పైన ఏమైనా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుతీరుతారేమో చూడాలి.

Read More
Next Story