
వరదనీటిలో ఆర్మీ దళం సహాయక చర్యలు
తెలంగాణ వరదల్లో సైన్యం అండ...
తెలంగాణలో వరదల్లో చిక్కుకున్న 30 మందిని ఇండియన్ ఆర్మీ రక్షించింది...
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. వేర్వేరు ప్రాంతాల్లో 30 మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకుపోయారు. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలు ప్రాణభయంతో విలవిల్లాడారు. మొత్తం మీద వరదల్లో చిక్కుకున్న 2వేల మందిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత సైనిక దళాలు, రెండు హెలికాప్టర్ల సాయంతో రక్షించామని తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్పారు.
వాయుసేన హెలికాప్టర్లతో రెస్క్యూ
వరదల్లో ప్రజలు చిక్కుకున్న విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫోన్ చేసి సహాయ చర్యల కోసం వాయుసేనను రంగంలోకి దించాలని విజ్ఞప్తి చేశారు. అంతే స్పందించిన కేంద్రమంత్రి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వాయుసేన హెలికాప్టర్లతో రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కాపాడిన కేంద్ర బలగాలు...
కామారెడ్డి జిల్లాలో వాగుపై వంతెన నిర్మాణ పనులు చేస్తున్న 8మంది కార్మికులు ఒక్క సారిగా వరద వెల్లువెత్తడంతో నీళ్ల ట్యాంకరుపైకి ఎక్కారు. చుట్టూ వరదనీటి మధ్య ట్యాంకరుపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. అంతలో కేంద్ర బలగాలు రంగంలోకి దిగి వరదల్లో ట్యాంకరుపైన ఉన్న కార్మికులను కాపాడారు.

కామారెడ్డిలో రంగంలోకి దిగిన ఆర్మీ ఫ్లడ్ రిలీఫ్ కాలమ్స్
కుండపోత వర్షాలు కురిసిన కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారత సైన్యానికి చెందిన ఫ్లడ్ రిలీఫ్ కాలమ్స్ బలగాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు.ఆర్మీ బోట్లు, పరికరాలతో వచ్చిన ఇండియన్ ఆర్మీ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేశారు. దెబ్బతిన్న రోడ్లకు ఆర్మీ ఇంజినీరింగ్ అధికారులు మరమ్మతులు చేశారు. ఆర్మీ వైద్య సిబ్బంది వరద బాధితులకు చికిత్స అందించారు.

రైతులను రక్షించిన ఆర్మీ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం నర్మాల వద్ద వ్యవసాయ పనుల కోసం వెళ్లిన ఐదుగురు రైతులు మానేరు వాగు ఉప్పొంగటంతో వరదనీటిలో చిక్కుకున్నారు. వారికి అధికారులు డ్రోన్ల ద్వారా ఆహారం మంచినీరు అందించి ధైర్యం చెప్పి ఆర్మీని సహాయం కోరారు.ఆర్మీ హెలికాప్టరు వచ్చి రైతులను క్షేమంగా ఒడ్డుకు చేర్చింది. ఒడ్డుకు చేరిన రైతులు వారి కుటుంబ సభ్యులను హత్తుకొని బోరున రోదించారు. ఆర్మీ తమ ప్రాణాలు కాపాడిందని వారు చెప్పారు.

ముగురిని కాపాడిన దళం...
మెదక్ జిల్లా భూంపల్లి-అక్బర్ పేట మండలం చిన్న నిజాంపేటకు చెందిన రైతులు శేర్ల రాజు, సుదర్శన్, గోపాల్ పోలాలకు వెళ్లారు. భారీవర్షం వల్ల పోతారెడ్డిపేట పెద్ద చెరువు, కూడవెల్లి వాగు పొంగి ప్రవహించడంతో వారు వరదనీటిలో చిక్కుకుపోయారు.కేంద్రం ఆధీనంలోని ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి ముగ్గురు రైతులను కాపాడారు.
భారత ఆర్మీ దళానికి తెలంగాణ సర్కారు కృతజ్ఞతలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరద విపత్తులో భారత ఆర్మీ, వాయుసేన దళాలు అందించిన సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. కుండపోతవర్షాలతో ఫ్లాష్ ఫ్లడ్ సంభవించి వరదల్లో వేలాదిమంది ప్రజలు చిక్కుకుపోయారని, సికింద్రాబాద్ నగరంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా కార్యాలయాల్లోని భారత ఆర్మీ దళాలు వెంటనే రంగంలోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడాయి. ఇండియన్ ఆర్మీ దళాలు అత్యంత వేగంగా రంగంలోకి దిగి సేవలు అందించాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అంరితభావం. నైపుణ్యంతో సాహసోపేతంగా పనిచేసి 8 మందిని కాపాడారని సర్కారు తెలిపింది. వరద విప్తు సమయంలో భారతసైన్యం, భారత వైమానిక దళం అందించిన సేవలను మరవలేమని తెలంగాణ డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఎక్స్ పోస్టులో వ్యాఖ్యానించారు.
Next Story