ఆరూరి హై డ్రామాకి బ్రేక్... బీజేపీ ఇచ్చిన హామీ ఏంటి?
తెలంగాణలో హైడ్రామాను తలపించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్ కి తెరపడింది.
తెలంగాణలో హైడ్రామాను తలపించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్ కి తెరపడింది. ఆదివారం హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, శనివారం ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరూరి రమేష్ వర్ధన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పార్లమెంటు ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. BRS నుంచి వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ టికెట్ ఆశించారు. అయితే కేసీఆర్ ఆ టికెట్ ని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య కి కేటాయించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆరూరి రమేష్ పార్టీ వీడాలనుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్ టికెట్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది.
హై డ్రామాని తలపించిన ఆరూరి ఎపిసోడ్
ఆరూరి పార్టీ మారతారని తెలియగానే అలర్ట్ ఐన బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తం ఓ హై డ్రామాను తలపించింది. ఆరూరి తన రాజీనామాను వెల్లడించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. ఎర్రబెల్లి వంటి సీనియర్ నేతలు అక్కడికి చేరుకుని ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు. అనంతరం ఆయనని హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి తీసుకెళ్లారు.
కేసీఆర్ స్వయంగా పార్టీ మారొద్దని కోరినప్పటికీ ఆరూరి వెనక్కి తగ్గలేదు. శనివారం పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఈరోజు ఉదయం కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. వరంగల్ లో సరైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్న బీజేపీ ఆ సీటుని ఆరూరి రమేష్ కి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రజారాజ్యంతో మొదలై బీజేపీ వరకు...
ఆరూరి రమేష్ 2009లో ప్రజా రాజ్యం పార్టీ నుండి స్టేషన్ ఘన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 86,349 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2015 జనవరి నుంచి 2018, సెప్టెంబరు వరకు తెలంగాణ లెజిస్లేచర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో హౌస్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు.
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీచేసి 99,240 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన జనవరి 26, 2022 లో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆరూరి రమేష్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున వర్ధన్నపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో 19,458 ఓట్ల తేడాతో ఓడిపోయారు.