అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వాయిదా.. ఇదే విడ్డూరమన్న హరీష్
x

అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వాయిదా.. ఇదే విడ్డూరమన్న హరీష్

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పలు అంశాలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ సమావేశం నిర్వహించింది.


తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పలు అంశాలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ సమావేశం నిర్వహించింది. కుల గణన, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ సహా పలు కీలక అంశాలపై చర్చించడం కోసం ప్రభుత్వం ఈ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయింది. సమావేశం మొదలైన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మంత్రివర్గ భేటీ దృష్ట్యా సమావేశాలను వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. ఆయన అభ్యర్థనను మన్నించిన స్పీకర్ సమావేశాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

కులగణన రిపోర్ట్, ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదికలు కేబినెట్ ఉపసంఘానికి అందిన క్రమంలో ఈ రెండు అంశాలపై చర్చించడానికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నివేదికలు వచ్చిన క్రమంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు చేయాల్సిందేనని ప్రతిపక్షాలు, ఎస్సీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నివేదికలను సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ కూడా తమ నివేదికను సోమవారం అందించిన క్రమంలో దానిపై కూడా ఈరోజు చర్చ జరగనుంది.

కాగా బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నిస్తోంది. కాకి లెక్కలు చెప్పడం కాదని, బీసీ రిజర్వేషన్లు చేస్తున్నట్లు బిల్లు ప్రవేశపెట్టాలని ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేలు డిమాండ్ చేశారు. కుల గణన విషయంలో బీసీల లెక్కల్లో తప్పులు ఉన్నాయని, కాబట్టి రివ్యూ కోసం 15 రోజులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చలు జరగనున్నాయి. కాగా అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడటంపై మాజీమంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్ తీరు హాస్యాస్పదం

‘‘అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటి? క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

Read More
Next Story