
ఫిరాయింపు నేతల విచారణ వాయిదా..
దసరా తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ జరుపుతామన్న స్పీకర్ గడ్డం ప్రసాద్.
ఫిరాయింపు నేతల విచారణను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దసరా తర్వాతకు వాయిదా వేశారు. మూడు రోజులుగా పార్టీలు మారిన నేతలను గడ్డం ప్రసాద్ కుమార్.. అసెంబ్లీలో విచారిస్తున్నారు. పార్టీ మారిన నేతల తరుపు న్యాయవాదులు, బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫిరాయింపుల నేతలపై యాక్షన్ తీసుకోవడానికి స్పీకర్ రెడీ అయ్యారు. అందులో భాగంగానే పార్టీ మారిన 10 మంది నేతలకు నోటీసులు జారీ చేశారు. వారి సమాధానాలు అందుకున్న తర్వాత.. తాజాగా వారిని అసెంబ్లీలో విచారించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం విచారణకు రావాలంటూ ఫిరాయింపు నేతలకు నోటీసులు ఇచ్చారు.
విచారణ షెడ్యూల్ ఇదే..
సోమవారం ఉదయం 11 గంటలకు రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణు జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఒంటిగంటకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ జరగనుంది. స్పీకర్/చైర్మన్ ఆధ్వర్యంలో 10 షెడ్యూల్ ప్రకారం విచారణ జరపనున్నారు. ఇరువైపుల ఎంఎల్ఏలు, వాళ్ళ లాయర్లు స్పీకర్ ఆఫీసులో విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్లో పాల్గొన్నారు. కోర్టులో వాద,ప్రతివాదనలు ఎలాగ జరుగుతాయో స్పీకర్ కార్యాలయంలో కూడా అచ్చంగా అలాగే జరిగింది.
విచారణ వాయిదా..
అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపు నేతల విచారణను స్పీకర్ చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యను పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. వారి విచారణ సుదీర్ఘంగా జరిగింది. దీంతో మరో ఇద్దరి ఎమ్మెల్యేల విచారణ జరగాల్సి ఉండటంతో, వారి విచారణను స్పీకర్.. దసరా తర్వాతకు వాయిదా వేశారు. దీంతో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను అక్టోబర్ 4న పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు.