మరొక బోగస్ కంపెనీ హెదరాబాదోళ్లను ముంచేసింది...
x

మరొక బోగస్ కంపెనీ హెదరాబాదోళ్లను ముంచేసింది...

హైదరాబాద్‌లో రోజుకో మోసం వెలుగుచూస్తోంది. పెట్టుబడి పెడితే ఉద్యోగాలిస్తామని, అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి పలు కంపెనీలు బోర్డు తిప్సేశాయి.


హైదరాబాద్ నగరంలో మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొందరు అక్రమార్కులు అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్నారు. ఇలా నగరంలో పలు ఘరానా మోసాలు జరుగుతున్నా, దీన్ని నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. కంపెనీల పేరిట ప్రజల నుంచి పెట్టుబడులు వసూలు చేసిన మోసగాళ్లు మాయమవుతున్నారు. ఈ మోసాలపై హైదరాబాద్ సిటీ క్రైం పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నా బాధితులకు మాత్రం డబ్బు తిరిగి రావడం లేదు.ఉద్యోగాల పేరుతో కొన్ని కంపెనీలు.. అధిక వడ్డీల పేరుతో మరికొన్ని సంస్థలు.. పేరు ఏదైనా.. మోసం మాత్రం కామన్‌ అయిపోతోంది.

- ఇటీవల ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం తీరా కొద్దినెలల తర్వాత బిచాణా ఎత్తేయడం పరిపాటిగా మారింది. మరికొందరు అధిక వడ్డీలు పేరు చెప్పి కొన్ని సంస్థలు ప్రజల్ని నిండా ముంచేస్తున్నాయి.మొన్నామధ్య హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసి వందలాది మంది నిరుద్యోగులను రోడ్డున పడేసింది. ఉద్యోగాల పేరుతో 10 కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించడంతో మోసపోయిన బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులను ఆశ్రయించారు.ఎన్ని మోసాలు వెలుగులోకి వచ్చినా,ప్రజల్లో మాత్రం మార్పు రావడంలేదు. ఈ ఘటన మరువకముందే హైదరాబాద్‌లో మరో ఘటన తెరపైకి వచ్చింది.

డీకేజెడ్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల మోసం
మాదాపూర్‌ కేంద్రంగా డీకేజడ్ టెక్నాలజీస్ పేరిట 2018 వ సంవత్సరంలో సంస్థను ఏర్పాటు చేసి, అధిక వడ్డీ ఆశ చూపించి ప్రజల నుంచి రూ.700కోట్లను వసూలు చేసి బోర్డు తిప్పేశారు.మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘరానా మోసంలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన 30,000 మందికి పైగా పెట్టుబడిదారులు రూ.700 కోట్లు నష్టపోయారు.బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసుస్టేషను ముందు ధర్నా చేశారు. కొందరు ఉద్యోగులు, ఏజెంట్లు కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టాలని కోరడంతో పలువురు తమ కష్టార్జితాన్ని ఈ కంపెనీలో పెట్టారు.

కంపెనీ కార్యాలయం మూసివేత
వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా తీసుకున్న డీకేజడ్ టెక్రాలజీ సంస్థ సెప్టెంబరు నెల ప్రారంభంలో మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయాన్ని మూసివేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.తాము పెట్టిన పెట్టుబడిపై 8,12 శాతం మధ్య వడ్డీ ఇస్తామని ఈ సంస్థ వాగ్దానం చేస్తూ ప్రజలను ఆకర్షించింది.మొదట్లో బాగానే వడ్డీ చెల్లించిన సంస్థ జూన్ నెల తర్వాత పెట్టుబడిదారులకు చెల్లింపులు చేయడం మానేసింది. నీలో సుమారు 30,000 మంది వ్యక్తులు కొన్ని లక్షల నుండి కొన్ని కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు.

పోలీసు కేసు నమోదు
డీకేజడ్ సంస్థ చేసిన మోసంపై బాధితుల ఫిర్యాదు మేరకు 403, 406, 420,120-బి సెక్షన్ల కింద (200/2024) కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసు ఫైల్‌ను హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇ జహంగీర్ యాదవ్‌కు అప్పగించినట్లు మోసం బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాది ఆశీర్ తెలిపారు.నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టోర్స్ ద్వారా ఈ కామర్స్ రూపంలో విక్రయిస్తున్నామని నిందితులు ప్రచారం చేసినట్లు బాధితులు తెలిపారు.

ఏజెంట్లను నమ్మి మోసపోయాం : బాధితులు
ఏజెంట్లను నమ్మి తాము కష్టపడి సంపాదించిన డబ్బును, జీవితకాల పొదుపును పెట్టామని పెట్టుబడిదారులు ఆవేదనగా చెప్పారు.యూట్యూబర్‌లు మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కంపెనీ పనితీరుపై తమకు నమ్మకం కలిగించారని బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ప్రభుత్వం మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని, తమ సొమ్మును వెనక్కి ఇచ్చేయాలని కోరారు.మహమ్మద్ ఇక్బాల్, రాహిల్ అనే వ్యక్తులు డీకేజడ్ సంస్థను నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.


ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటూ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఏర్పాటైన ఫ్రైడే అప్ కన్సల్ టెన్సీ కంపెనీ టోకరా ఇచ్చింది. ఉద్యోగం ఆశ చూపించి నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి లక్షన్నరరూపాయలను వసూలు చేసింది. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కంపెనీ బోర్డు తిప్పేసింది. బాధితుల ఫిర్యాదు మేర మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఐటీ జాబ్స్ ఇప్పిస్తామంటూ మోసం
కొండాపూర్ జూబ్లీ గార్డెన్ ప్రాంతంలో డాన్యోస్ ఐటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ప్రతాప్ అనే వ్యక్తి కంపెనీని ఏర్పాటు చేసి, బ్యాక్ డోర్ లో ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించాడు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.2లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి, మూడు నెలలు ఆన్ లైన్ లో శిక్షణ ఉంటుందని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బు దండుకున్నాడు. ఈ కేసు దర్యాప్తు పూర్తి కాకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

నకిలీ ఐటీ కంపెనీ పేరిట మోసం
కొండాపూర్ లోని యునైటెడ్ అలయన్స్ టెక్నాలజీ పేరిట నకిలీ ఐటీ కంపెనీని పెట్టి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇస్తామంటూ ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.1.5లక్షలు వసూలు చేసి మోసగించాడు. డబ్బు వసూలు చేసి, మూడు నెలలు శిక్షణ ఉంటుందని చెప్పి కార్యాలయాన్ని ఎత్తి వేశాడు.ముత్యాల ధీరజ్, విషశ్రీ, అఖిల్ అనే ముగ్గురు వ్యక్తులు తమకు ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.తమ బ్యాంక్ అకౌంట్ నుంచి నిందితులకు డబ్బులు పంపిన వివరాలను కూడా పోలీసులకు సమర్పించారు.

గచ్చిబౌలిలో ఘరానా మోసం
గచ్చిబౌలి కేంద్రంగా రైల్ వరల్డ్ పేరిట కంపెనీ ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరిట డిపాజిట్ ఫీజులు వసూలు చేసింది. రైల్ వరల్డ్ కంపెనీ రూ.5కోట్లు వసూలు చేసి మోసగించింది. బాధితుల ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసినా బాధితులకు డబ్బు అందలేదు.

కొండాపూర్ లో ఐటీ శిక్షణ పేరిట మోసం
కొండాపూర్ లో నిరుద్యోగులకు ఐటీలో శిక్షణ ఇచ్చిన ఉద్యోగం కల్పిస్తామని చెప్పి సూ ఇన్నోవేషన్స్ ఐటీ కంపెనీ ఘరానా మోసానికి పాల్పడింది. ఒక్కో నిరుద్యోగి నుంచి లక్షనుంచి లక్షన్నర రూపాయల దాకా వసూలు చేసి రాత్రికి రాత్రి కంపెనీ కార్యాలయం బోర్డు తిప్పేసింది. రూ.3కోట్లను కొల్లగొట్టిన ప్రేమ్ ప్రకాష్, లిఖిత్ లపై పోలీసులు చర్యలు తీసుకోలేదు.


Read More
Next Story