
కంటోన్మెంట్ ఎంఎల్ఏ శ్రీగణేష్ పై దాడి
తార్నాక నుండి మాణికేశ్వర్ ఆలయానికి వెళుతుండగా ఉస్మానియా యూనివర్సిటి(OU) ప్రాంతంలో యువకులు దాడిచేశారు
కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎంఎల్ఏ శ్రీగణేష్ పై గుర్తుతెలీని యువకులు దాడిచేయటం సంచలనంగా మారింది. బోనాలులో పాల్గొనేందుకు ఎంఎల్ఏ ఆదివారంరాత్రి తార్నాక నుండి మాణికేశ్వర్ ఆలయానికి వెళుతుండగా ఉస్మానియా యూనివర్సిటి(OU) ప్రాంతంలో యువకులు దాడిచేశారు. ఓయూ ప్రాంతంలో వెళుతున్న ఎంఎల్ఏ కారును గుర్తుతెలీని యువకులు కొందరు మోటారుసైకిళ్ళల్లో వచ్చి అడ్డుకున్నారు. ఎంఎల్ఏ(Cantonment MLA Sri Ganesh) కారును కొందరుయువకులు ఓవర్ టేక్ చేశారు. మరికొందరు యువకులు కారుకు వెనుకవైపు ఉన్నారు. కొందరుయువకులు ముందు అడ్డంగా తమ మోటారుసైకిళ్ళను నిలపటంతో డ్రైవర్ కారును నిలిపాడు.
విషయం ఏమిటో తెలుసుకునేందుకు ఎంఎల్ఏ బయటకు రావటానికి ప్రయత్నించగా గన్ మెన్ వారించి తాను దిగాడు. అయితే యువకులు మోటారుసైకిళ్ళ పైనుండి దిగి కారువద్దకు వచ్చి గన్ మెన్ ను పక్కకు నెట్టేసి ఎంఎల్ఏపై దాడికి ప్రయత్నించారు. అయినా గన్ మెన్ అడ్డుకోవటంతో అక్కడ పెద్ద వాగ్వాదం జరిగింది. ఇంతలో జనాలందరు గుమిగూడటంతో యువకులు అక్కడినుండి పరారయ్యారు. జరిగినవిషయాన్ని ఎంఎల్ఏ వెంటనే ఓయూ పోలీసుస్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదుచేశారు. దాడిఘటన తెలియగానే సంక్షేమశాఖల మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) కేసు నమోదుచేసుకుని యువకులను వెంటనే పట్టుకుని శిక్షించాలని మంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు. తనమీద దాడికి కొందరుయువకులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం తనకు ఉందని ఎంఎల్ఏ చెప్పటం కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చెప్పారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. దాడికి ప్రయత్నించిన తర్వాత యువకులు అడిక్ మెట్ వైపు వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తుచేస్తున్నారు.