
కేటీఆర్ పై కాంగ్రెస్ ఎదురుదాడి
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 35 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నపుడు ఫిరాయింపులు తప్పని తెలీలేదా అని ఎద్దేవా చేశారు
ఫిరాయింపు ఎంఎల్ఏల రాజీనామాల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. నిజానికి ఈఎదురుదాడిని కాంగ్రెస్ నేతలు ఎప్పుడో మొదలుపెట్టాల్సింది. అయితే హస్తంపార్టీ నేతల్లో చాలామందికి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవటంతోనే పుణ్యకాలం సరిపోతోంది. ఇక ప్రతిపక్షాలపై ఆరోపణలు, విమర్శలతో ఎదురుదాడులుచేసేంత సమయం ఎక్కడుంటుంది. ఇపుడు విషయం ఏమిటంటే బీఆర్ఎస్(BRS) లో నుండి కాంగ్రెస్(Telangana Congress) లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలపై(BRS Defection MLAs)అనర్హతవేటు వేయించాలన్నది కేటీఆర్(KTR) పట్టుదల. ఇందులో భాగంగానే సుప్రింకోర్టులో కేసులు వేసి, వేయించి నానా రచ్చచేస్తున్నారు.
ఇది సరిపోదన్నట్లు ఫిరాయింపు ఎంఎల్ఏలతో వెంటనే రాజీనామా చేయించాలని ప్రతిరోజు డిమాండ్లు చేస్తున్నారు. ఇదికూడా చాలదన్నట్లుగా ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో వాళ్ళని ఇరుకునపెట్టేందుకు బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. బండ్లకృష్ణమోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తు మొదటి బహిరంగసభను శనివారం గద్వాలలో నిర్వహించారు. ఇదే విషయమై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ క్రమశిక్షణకమిటి ఛైర్మన్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లరవి వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతు కేటీఆర్ పై మండిపోయారు. ఫిరాయింపు ఎంఎల్ఏలతో వెంటనే రాజీనామా చేయించాలని ఇపుడు డిమాండ్ చేస్తున్న కేటీఆర్ కు తాము అధికారంలో ఉన్నపుడు ఏమిచేశారో గుర్తులేదా అని నిలదీశారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 35 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నపుడు ఫిరాయింపులు తప్పని తెలీలేదా అని ఎద్దేవా చేశారు. అప్పట్లో బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించారా అని సూటిగా నిలదీశారు. ఫిరాయింపుల విషయంలో అప్పుడు మాట్లాడని, రాజీనామాలు చేయించని కేటీఆర్ ఇఫుడు ఎందుకు మాట్లాడుతున్నారు ? ఎందుకు రాజీనామాలు డిమాండ్ చేస్తున్నారని ఇద్దరు నేతలు ధ్వజమెత్తారు. ఫిరాయింపుల విషసంస్కృతికి కేసీఆరే నాంధి పలికిన విషయాన్ని బొమ్మ, మల్లు గుర్తుచేశారు.