
భద్రాచలం దేవాలయం ఈవోపై దాడి
దేవాలయ భూములు కబ్జాకు గురవుతున్నా తెలంగాణ ప్రభుత్వం, అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు.
భద్రాచలం దేవాలయం ఈవో రమాదేవిపై స్ధానికులు దాడిచేశారు. ఈదాడిలో ఈవో స్పృహకోల్పోయారు. వెంటనే ఈవోను సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఇంతకీ విషయం ఏమిటంటే దేవాలయంకు అనుబంధంగా పురుషోత్తమపట్నం అనే గ్రామంలో సుమారు 900 ఎకరాలున్నాయి. ఈభూముల్లో అత్యధికం కబ్జాలకు గురయ్యాయి. భద్రాచలం(Bhadrachalam Temple)కు ఆనుకునే ఉన్న ఈ గ్రామంలో భూములు కబ్జాకు గురవుతున్నా నిరోధించలేని స్ధితిలో దేవాలయం ఉన్నది. కారణం ఏమిటంటే పురుషోత్తమపట్నం అనే గ్రామం దేవాలయం పట్టణానికి ఆనుకునే ఉంది కాని సాంకేతికంగా ఈ గ్రామం ఏపీ పరిధిలో ఉంది. భౌగోళికంగా గ్రామం తెలంగాణలోనే ఉన్నా సాంకేతికంగా మాత్రం ఏపీ ప్రభుత్వంలో ఉంది.
దీనివల్ల దేవాలయ భూములు కబ్జాకు గురవుతున్నా తెలంగాణ ప్రభుత్వం, అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. విభజన చట్టంలో తెలంగాణలోని ఐదుగ్రామాలు ఏపీలో కలిసిపోయాయి. ఆ ఐదు గ్రామాలను తిరిగి ఏపీ నుండి తెలంగాణ(Telangana)లోకి తీసుకురావాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆ ఐదుగ్రామాల్లో పురుషోత్తమపట్నం కూడా ఉంది. ఇపుడు విషయం ఏమిటంటే కబ్జా అయిన భూముల్లో కొందరు నిర్మాణాలు చేపడుతున్నట్లు దేవాలయ అధికారులకు స్ధానికులు సమాచారం అందించారు. దాంతో ఈవో రమాదేవి తన సిబ్బందితో వెంటనే గ్రామానికి వెళ్ళారు.
మొదలైన నిర్మాణాలను గమనించిన ఈవో కబ్జాదారులను అడ్డుకున్నారు. ఈనేపధ్యంలో కబ్జాదారులకు, ఈవో+సిబ్బందికి మధ్య పెద్ద తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఈవో రమాదేవి కిందపడిపోవటమే కాకుండా స్పృహతప్పిపోయారు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఈవోను అక్కడినుండి తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఈవో ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని సమాచారం.