
అజారుద్దీన్ మాజీ భార్య ఫాం హౌజ్ ధ్వంసం
సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్న పోలీసులు
భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మాజీ భార్య, బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీకి చెందిన ఫాంహౌస్ ధ్వంసమైంది. మహారాష్ట్ర పుణే సమీపంలోని టికోనా గ్రామంలో సంగీతా బిజ్లానీకి ఫాంహౌస్ ఉంది. ఈ నెల 18న ఆమె తన ఫాంహౌస్‌ను సందర్శించినప్పుడు విస్తుపోయింది.
మెయిన్ గేటు, కిటికీల గ్రిల్స్ ధ్వంసమైన స్థితిలో కనిపించాయి. ఒక టీవీ చోరీకి గురైంది. అంతేకాక సీసీటీవీ కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ఫాంహౌస్ లో ఉన్న ఇంటిలో ఎగువ అంతస్తు పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
తన తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగా నాలుగు నెలలుగా ఫాంహౌస్‌కి వెళ్లడం లేదు.ఇప్పుడు వచ్చి చూసేసరికి అంతా ధ్వంసమై ఉందని సంగీత బిజ్లాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె పుణే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్ కు చెందిన భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ నౌరీన్ ను వివాహం చేసుకుని మనస్పర్దల కారణంగా విడాకులిచ్చారు. అప్పటికే బాలివుడ్ టాప్ హీరోయిన్ సంగీత బిజ్లానిని అజారుద్దీన్ పెళ్లి చేసుకున్నారు. ఈ కాపురం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.