ప్రపంచ చేనేత దినోత్సవ లక్ష్యంగా కార్యచరణఇండియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, శ్రీలంక మరియు ఆస్ట్రేలియా నుండి ప్రతినిధులు హాజరు
చేనేతను ప్రోత్సహించడం ద్వారా ఇండియా, ఇండోనేషియాల మధ్య బంధాన్ని పెంచుదాం - బాలి టూరిజం బోర్డ్ హెడ్ రాయ్ సూర్యవిజయ
ప్రపంచ చేనేత దినోత్సవం సాధించేవరకు ఈ ప్రయాణం ఆగదు. తదుపరి సమావేశాలు వియత్నం, కంబోడియా దేశాలలో ఉంటాయి - చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత
ఇండియా, ఇండోనేషియాల మధ్య చేనేత బంధం - 'ఇండోనేషియా ఫ్యాషన్ వీక్' వ్యవస్థాపకరాలు పాపి దర్షనో
ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో చేనేతల పాత్ర కీలకం - వీవిండియా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు సాయిరూప నేత
చేనేత చీరను ప్రపంచవ్యాప్తం చేస్తాం - శారీ కనెక్షన్స్ వ్యవస్థాపకురాలు పద్మజా నాయుడు
ఇండోనేషియాలోని బాలి లోని వాంటిలాన్ కన్వెన్షన్ సెంటర్లో చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత అధ్యక్షతన ఫిబ్రవరి 18న వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ అత్యంత వైభవంగా జరిగింది. ప్రపంచ చేనేత దినోత్సవ సాధనగా జరిగిన ఈ సమావేశానికి వైస్ కన్సోల్ జర్నల్ ఆఫ్ ఇండియా రుచికా బిష్ట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రపంచ చేనేత దినోత్సవ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించడమేకాక ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ దేశాలకు కాన్ఫరెన్స్ ప్రతినిధుల విన్నపం చేశారు. ఈ సందర్భంగా బాలి టూరిజం బోర్డ్ హెడ్ రాయ్ సూర్యవిజయ మాట్లాడుతూ చేనేతను ప్రోత్సహించడం ద్వారా ఇండియా, ఇండోనేషియాల మధ్య బంధాన్ని పెంచుదామని, వెంకన్న నేత ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని బాలిలో నిర్వహించడం అభినందనియమని అన్నారు. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకు తమ సహకారం తప్పకుండా ఉంటుందని ఆయన తెలియజేశారు.
ఇండియా, ఇండోనేషియాల మధ్య చేనేత బంధం విడదీయరానిదని, ముఖ్యంగా ఇక్కత్ కళను కాపాడడంలో ఇరుదేశాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని ఇండోనేషియా ఫ్యాషన్ వీక్ వ్యవస్థాపకరాలు పాపి దర్షనో (కింది ఫోటో) అన్నారు.
భవిష్యత్తులో ఇరుదేశాల సంబంధాల పెరిగి, చేనేత పరిశ్రమ పురోగతికి మరియు చేనేత కళాకారుల సంక్షేమానికి కలిసి పని చేద్దామని ఆమె అన్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆగస్ ఇంద్ర ఉదయానా మాట్లాడుతూ మార్కండేయ మహర్షి మూలాలు ఇండోనేషియాలో ఉన్నాయని, ఆ మహర్షి సంతతి ఈరోజు ఇండోనేషియాలో ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించడంతో తాను ఎంతో సంతోషిస్తున్నానని తెలియజేశారు. ఇండోనేషియాలో తాను గాంధీ ఆశ్రమాలు స్థాపించి, గాంధీజీ ఫిలాసఫీని ప్రచారం చేస్తున్నానని, తన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించిందని ఆయన గుర్తు చేశారు. ఇక్కత్ పరిశ్రమ పురోగతికి ఇక్కత్ పరిశ్రమ కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి బాలిలో చేనేత కళాకారుల మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని ఇండోనేషియా ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
జాతీయ చేనేత దినోత్సవ వ్యవస్థాపకునిగా ఇండోనేషియాలో వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం తనకు గర్వంగా ఉందని, ప్రపంచ చేనేత దినోత్సవం సాధించేవరకు ఈ ప్రయాణం ఆగదని యర్రమద వెంకన్న నేత తెలిపారు.
ఇండోనేషియా కాన్ఫరెన్స్ విజయం ఇచ్చిన స్ఫూర్తితో తదుపరి సమావేశాలు వియత్నం, కంబోడియా దేశాలలో ఉంటాయని వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ నిర్వాహకులు వెంకన్న నేత ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య మరియు చింతకింది మల్లేశం మాట్లాడుతూ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ప్రపంచ చేనేత దినోత్సవం సాధించే వరకు ఈ ప్రయాణంలో కలిసి ముందుకు కొనసాగుతామని తెలియజేశారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో చేనేతల పాత్ర కీలకమని, చేనేత పరిశ్రమ విస్తరణ అవశ్యకతను వీవిండియా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు సాయిరూప నేత వివరించారు.
సదస్సులో ప్రసంగిస్తున్న గజం
చేనేత చీరను ప్రపంచవ్యాప్తం చేస్తామని శారీ కనెక్షన్స్ వ్యవస్థాపకురాలు పద్మజా నాయుడు ప్రకటించారు. పొట్టబత్తిని అరుణ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో జాతీయ అవార్డు గ్రహీతలు గంజి యాదగిరి, కొలను రవీందర్, గజం భగవాన్, లోల్ల వీర వెంకట సత్యనారాయణ జాతీయ మెరిట్ సర్టిఫికెట్ అవార్డు గ్రహీతలు వరదన్, చిలుకూరి శ్రీనివాస్ పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో బూరం శంకర్, జూహి శుక్లా, పులిజాల రేణుక, కృష్ణ సంతోషి , కొలను భవాని, ఏలె రాంబాబు, ఘంటసాల సుభాష్ చంద్ర , అనుమాల వెంకటేశ్వర్లు, ఉషావర్రా తదితరులు ప్రసంగించారు. ముఖ్య అతిథులను మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీతలను జాతీయ అవార్డు గ్రహీతలను వెంకన్న నేత జ్ఞాపకతో సత్కరించిన తర్వాత దీపికా రెడ్డి వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది. సభా ప్రారంభంలో ఇండోనేషియా సంప్రదాయ నృత్యమైన బాలినెస్ డాన్స్ ఆహుతులను ఆకర్షించింది.
ఫ్యాషన్ వీక్
ఇండోనేషియా బాలిలో చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత అధ్యక్షతన జరిగిన వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ లో ఇండోనేషియా ఫ్యాషన్ వీక్ వ్యవస్థాపకురాలు పాపి దర్శనో మరియు APPMI ఇండోనేషియా ఫ్యాషన్ డిజైనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మలైకా ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో కన్నుల పండుగగా జరిగింది.