
తగ్గేదేలే ..అంటున్న ముఖ్యమంత్రులు
వరదను భరించాలి గాని ఆ నీటిని వాడుకోవద్దా ..చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తలుస్తుంటే .. ఆపి తీరతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు.ఇప్పటికే ఈ వివాదం రెండు రాష్ట్రాల రాజకీయాలలోనూ హాట్ టాపిక్ గా మారితే స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ లలోనూ ఇరు రాష్ట్రాల సీఎంల నోట బనకచర్ల ప్రస్తావన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశంలో కీలక వ్యాఖ్యలు చేసారు.తమతమ వాదనలను వినిపించి తగ్గేదేలా అంటున్నారు.
వరదను భరించాలి గానీ .. ఆ నీటిని వాడవద్దా?
బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు మరోమారు పునరుద్ఘాటించారు..సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వాడుకుంటాం అని మరోమారు స్పష్టం చేసారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు.ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నామని గుర్తుచేస్తూ , అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.గోదావరి వరద జలాలనే వాడుకునే ఈ బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తీరతామంటూ తన మునపటి వాదననే తన పంద్రాగస్ట్ స్పీచ్ లోనూ స్పష్టం చేయడం ద్వారా చంద్రబాబు తెలంగాణకు మరోమారు తేల్చి చెప్పినట్లైంది.
నీటి వాటా హక్కులపై రాజీ లేదు
అటు చంద్రబాబు బనకచర్ల విషయంలో తగ్గేదిలేదని స్పష్టం చేస్తే , తన ఇండిపెండెన్స్ డే స్పీచ్ లోనూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాల నీటి వాటాల అంశాన్ని ప్రస్తావించారు.తెలంగాణ నీటివాటా హక్కుపై రాజీలేదని ఆయన తేల్చి చెప్పారు.బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదని స్పష్టం చేశారు.తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటాం అని అన్నారు. మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వైఖరి కారణంగా తెలంగాణ జలాల విషయంలో నష్టపోయిందని ,గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు.
ఆచితూచి వ్యవహరిస్తున్న కేంద్రం
బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసేందుకు వరద జలాల వినియోగం కోసమే బనకచర్ల నిర్మాణమంటూ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం పై చంద్రబాబు వత్తిడి చేస్తున్నారు. ఎన్డీఏ లో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడం ,ఏపీలోనూ కూటమి ప్రభుత్వం వుండటంతో ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఆలోచన చేస్తోంది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది .అయితే బనకచర్ల విషయంపై తాము ఆ సమావేశంలో చర్చించలేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.అయితే తెలంగాణ లో బలపడుతున్న బీజేపీ కి బనకచర్ల ఒక పరీక్షగా మారింది.ఏపీలో చంద్రబాబు వాదనకు తలొగ్గితే తెలంగాణ లో బీజేపీకి సమస్యలు ఎదురవుతాయి.అందుకే బనకచర్ల విషయంలో బీజేపీ హైకమాండ్ డబుల్ గేమ్ ఆడుతోంది.ఇదంతా గతంలో కేసీఆర్ ఒప్పుకోవడం తోనే వచ్చిందని తెలంగాణ బీజేపీ నేతలతో పాటు , తెలంగాణ లో అధికారం లో వున్నకాంగ్రెస్ పెద్దలు వాదిస్తున్నారు. దాంతో రెండు రాష్ట్రాలలో బనకచర్ల రాజకీయ వివాదంగా మారింది.రెండు రాష్ట్రాలు చర్చలతో నీటి వాటాలు పరిష్కరించు కోవాలంటూ కేంద్రం మధ్యస్థంగా వ్యావహరిస్తోంది.మరి ఇప్పుడు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులూ బనకచర్లపై తమతమ వైఖరిపైనే నొక్కి చెప్పడంతో రానున్న రోజులలో ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది చూడాల్సి వుంది.
Next Story